గ్రామసచివాలయ జెసీలకే క్లారిటీ లేదు..
Ens Balu
17
Tadepalle
2021-07-11 03:29:09
ప్రజలకు ఇంటిముంగిటే అన్నిరకాల సేవలు అందించాలనే ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏ విధంగా పరిపుష్టం చేయాలో ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన గ్రామ, వార్డు సచివాలయ శాఖ జాయింట్ కలెక్టర్లుకు నేటికీ క్లారిటీ రాలేదు. ఎప్పుడు సచివాలయాలను సందర్శించినా ప్రజలకు మంచిసేవలందించాలి.. బాగా పనిచేయాలి.. ప్రభుత్వానికి పేరుతేవాలని.. బాగ పనిచేయకపోయినా అలక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు తప్పితే.. భారతదేశంలో ఒక వినూత్న వ్యవస్థగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను ఏ తరహా అభివ్రుద్ధి చేయాలి.. ఏం చర్యలు తీసుకుంటే లోపాలను పరిష్కరించవచ్చు.. ఏ జీఓలు అమలవుతున్నాయి.. ఎందుకు పంచాయతీ కార్యదర్శిలు గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు, బాధ్యతలు అప్పగించలేదు.. జీఓ నెంబరు 149ని ఎందుకు అవహేలన చేస్తున్నారనే విషయాన్ని నేటికి రాష్ట్రంలో ఒక్క జాయింట్ కలెక్టర్ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు.. కాదు కాదు వారికే క్లారిటీలేకుండా పోయింది. ఏదో మొక్కుబడిగా సందర్శనలు చేశామా..వెళ్లామా అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.. అలాగని జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ అధికారులు సైతం గ్రేడ్-5 కార్యదర్శిల విషయంలో అమలు కానీ జీఓల అంశాన్ని జాయింట్ కలెక్టర్లకు వివరించడం లేదు. ఇదంతా చూస్తుంటే.. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ప్రభుత్వ జీఓలను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క జీఓ నెంబరు 149 మాత్రమే కాదు. గ్రామ,వార్డు సచివాలయ శాఖకు కమిషనరేట్ నుంచి వచ్చే 14 ప్రభుత్వశాఖలకు చెందిన ఏ జీఓలు కూడా సచివాలయాలకు చేరడంలేదు. అమలు జరగడం లేదు. ఈ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి ప్రత్యేక కధనాల రూపంలో తీసుకొస్తూనే వుంది. అయితే ఇక్కడ ప్రధాన సమస్య గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలకు తమ చేతిలో వున్న అధికారం ఇచ్చే ఉద్దేశ్యం లేనట్టుగా కనిపిస్తుంది. అక్కడికీ వీరే గ్రేడ్-5 కార్యదర్శిలను సచివాలయాల్లో నియమించినట్టు, జేబుల్లోనుంచి జీతాలు జీతాలు ఇస్తున్నట్టు..వారంతీ వీరి కింద సబార్డినేట్ ఉద్యోగులుగానే చూస్తూ తెగఫీలైపోతున్నారట. అదొక్క కార్యదర్శిల విషయంలోనే కాదు..అటు మహిళా పోలీసుల విషయంలో కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు కూడా అలానే ఫీలైపోతున్నారు..అసలు వీరిని పోలీసులగా ఎలా గుర్తిస్తామని.. వీరికి ప్రభుత్వం ఎందుకు పోలీస్ అనే పదం తగిలించిందో అర్ధం కావడం లేదని తెగ మదన పడిపోతున్నారు.. అటు వీఆర్వోలు కూడా ప్రభుత్వం తమకిచ్చిన డీడీఓ ఉత్తర్వుల పరంగా తామే సచివాలయాకు ప్రధాన అధికారులమంటూ వ్యవహరిస్తున్నారు. వ్యవసాయశాఖలో అయితే చెప్పాల్సిన అగ్రికల్చర్ అసిస్టెంట్లు కనీసం సచివాలయం మొహం కూడా చూడటం లేదు వీరంతా ఆర్బీకేలకే పనిమితం అయిపోతున్నారు..సర్వేయర్లకు ప్రభుత్వం సమగ్ర భూ సర్వే పని అప్పగించడంతో వారూ సచివాలయాలకు దూరంగానే ఉంటున్నారు.. ఆరోగ్యశాఖకు చెందిన ఏఎన్ఎంలంతా వారి పీహెచ్సీ వైద్యులు సూచించిన విధుల్లో నిమగ్నమవుతున్నారు..ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మొత్తం కొత్త భవనాల నిర్మాణాలకే అంకితం అయిపోతున్నారు.. అలాగనీ విరికి ప్రభుత్వం వీరి విధులు, బాధ్యతల విషయంలో ఏమైనా జీఓ ప్రకారం సూచించిందా అదీ లేదు. ఈ క్రమంలో సచివాలయాలు వచ్చినా.. సచివాలయ ఉద్యోగులంతా తమ కిందే పనిచేయాలంటూ పంచాయతీ గ్రేడ్-1 కార్యదర్శిలు హుకుం జారీ చేస్తున్నారు. తమ అధికారాల విషయంలో ఎవరికి వారు తామే బాసులమని బల్లగుద్ది చెబుతున్నారు. సచివాలయాల్లో మాత్రం గ్రేడ్1 కార్యదర్శిలు అధికారాలు బదలాయించకుండా మొండి పట్టుదలతో ఉండిపోయినా.. వారికి మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ అధికారులు వత్తాసు పలుకుతూ రావడం వలన నేటికీ అధికార వికేంద్రీకరణ జీఓ నెంబరు 149 ద్వారా గ్రేడ్-5 కార్యదర్శిలకు చేరడం లేదు. మరో ఆరునెలల్లో సచివాలయ ఉద్యోగుల సర్వీసు కూడా క్రమ బద్దీకరణ పూర్తవుతుంది. అయినప్పటికీ వీరికి అధికారికంగా చేసే పనులపై ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలాగని వున్న జీఓలను కూడా అమలు చేయలేదు. దీనితో తాము ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నామో కూడా తెలియడం లేదని, ప్రభుత్వం తమను ఎందుకు నియమించిందో నేటీకీ మాకు అర్ధం కావడం లేదని గ్రేడ్-5 కార్యదర్శిలంతా తలలు పట్టుకుంటున్నారు. అలాగని పంచాయతీరాజ్ శాఖ, గ్రామ, వార్డు సచివాలయ శాఖల్లో కమిషనర్లు అయినా ప్రభుత్వ జీఓలను జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశిస్తున్నారా అంటే అదీ కనిపించడం లేదు. సచివాలయాలు వచ్చిన తరువాత డిడిఓలుగా వీఆర్వోలను చేస్తూ ఇచ్చిన జీఓనెంబరు 2ను మాత్రం ఆగమేఘాలపై అమలు చేసింది ప్రభుత్వం. అలాగని గతంలో విడుదల చేసిన జీఓ నెంబరు 149 అమలు చేయాలంటే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టు వ్యవహరిస్తోందని కార్యదర్శిలు వాపోతున్నారు. అసలు ప్రభుత్వం ఉత్తర్వులను అమలు చేసే ఉద్దేశ్యం లేనపుడు ఎందుకు వాటిని విడుదల చేయాలని..అందులో నియమ నిబంధనలను ఎందుకు పొందు పరచాలని ప్రశ్నిస్తున్నారు. మొట్టమొదటి సారిగా ఉద్యోగాల్లోకి వచ్చిన తమకు ప్రభుత్వం జారీ చేసిన జీఓలను అమలు చేయకపోతే తమకు ప్రభుత్వం మీద ఏం నమ్మకముంటుందంటూ పెదవి విరిస్తున్నారు. ఒక శాఖలో పనిచేసే ఉద్యోగికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా పనిచేయమంటే ఎలా పనిచేస్తామని వీరంతా ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో శానిటేషన్ దగ్గర నుంచి, ఇంటి పన్నుల వసూలు, వివిధ రకాల అనుమతులు ఇలా ఏ విషయానికైనా గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెబుతున్నారు. కనీసం శానిటేషన్ సిబ్బందితో పనిచేయించుకునే అధికారం కూడా లేకపోతే తమ ఉద్యోగాలు దేనికి పనిచేస్తాయంటూ మండి పడుతున్నారు. ఒక్క గ్రామ పంచాయతీ గ్రేడ్-5 కార్యదర్శిలే కాకుండా..సచివాలయాల్లోన్ని మొత్తం 14శాఖల ఉద్యోగులకు తాము ఏశాఖ కిందకి వస్తామో కూడా తెలియని పరిస్థితి సిబ్బందిలో నెలకొందని.. ఈవిషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన గ్రామ, వార్డు సచివాలయశాఖ జాయింట్ కలెక్టర్లు పూర్తిస్థాయిలో ద్రుష్టిసారిస్తే వాస్తవాలు తెలుస్తాయని వాపోతున్నారు. లేదంటే పేరుకి సచివాలయ సిబ్బందిగా మాత్రమే పనిచేస్తున్నా.. ఎలాంటి అధికారాలు లేని ఉద్యోగాలు ఎలా చేయాలో కనీసం ఉన్నతాధికారుల దగ్గరున్నఆలోచనలు చెప్పినా బావుంటుందని..లేదంటే తామని ప్రభుత్వం ఎందుకు నియమించిందో నేటికీ క్లారిటీ రాకపోతే ప్రజలకు ఏ విధంగా సమాధానాలు చెబుతామని సచివాలయాలను దగ్గరుండి నిర్వహించాల్సిన గ్రేడ్-5 కార్యదర్శిలు నెత్తీ నోరూ కొట్టుంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శిల దగ్గర నుంచి అధికారాలు, శానిటేషన్ సిబ్బంది, తమ పరిధికి చెందిన రికార్డులు అసలు అప్పగిస్తుందా..లేదంటే వీరిని పేరుకే సచివాలయ కార్యదర్శిలుగా నియమించాం తప్పితే..అధికారాలు..డిప్యుటేషన్ బాధ్యతలు గ్రేడ్-1 కార్యదర్శిల చేతిలోనే ఉంచుతామని ప్రకటిస్తుందా అనేది తేలని ప్రశ్నిగా మారింది..చూడాలి ఏం జరుగుతుందో..!