ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫలితాల విషయంలో విద్యార్థులకు మేలు జరిగేలా, ఎవరూ నష్టపోకుండా రాష్ట్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా 'ఆల్ పాస్'కు బదులు గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి వల్ల గత విద్యా సంవత్సరం(2019-20)లో పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల 'ఆల్ పాస్'గా ప్రకటించిన విద్యార్థులందరికీ తాజాగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది.ఆ విద్యా సంవత్సరంలో విద్యార్థులు రాసిన సమ్మేటివ్, ఫార్మేటివ్ పరీక్షల మార్కుల ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు ఇవ్వనున్నారు. గతేడాది కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేక రాష్ట్ర విద్యా శాఖ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. వారి ధ్రువపత్రాల్లో సబ్జెక్టులకు గ్రేడ్లు బదులు.. పాస్ అని మాత్రమే ఇచ్చారు. దీంతో వారి ఉన్నత చదువులకు ఇబ్బందులేర్పడ్డాయి.
చదువులకే కాకుండా పదో తరగతి మార్కుల ఆధారంగా వచ్చే ఉద్యోగాలను పొందే విషయంలోనూ గ్రేడ్లు, మార్కులు లేకపోవడం వల్ల నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత విద్యా సంవత్సరం విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించాలని విద్యా శాఖ నిర్ణయించింది. దీనిపై ఛాయారతన్(రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి) నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ చర్చించింది. 2019-20 విద్యార్థులకు ఫార్మేటివ్-1, ఫార్మేటివ్-2, ఫార్మేటివ్-3, సమ్మేటివ్-1 పరీక్షలు జరిగాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని వారికి ఇప్పుడు గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఒక్కో ఫార్మేటివ్ పరీక్షకు 20 మార్కులు చొప్పున 60 మార్కులుగా, సమ్మేటివ్ పరీక్షకు 40 మార్కులుగా పరిగణనలోకి తీసుకొని గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఇందులో వీరికి కూడా ఎక్కువ మార్కులు సాధించిన 3 సబ్జెక్టుల సగటును తీసుకొని పబ్లిక్ పరీక్షల గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. హైపవర్ కమిటీ తుది నివేదిక తర్వాత విద్యా శాఖ ఫలితాలు ప్రకటిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అత్యున్నత స్థాయి కమిటీ త్వరలోనే తన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. దాని ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటిస్తారు.