భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు సాంకేతికత మోకాలడ్డుతోంది. లక్షా 16 వేల మంది సిబ్బంది, 10వేల 5 గ్రామ,వార్డు సచివాలయాలు.. అదనంగా మరో 8వేల మంది గతంలోని పంచాయతీ కార్యదర్శిలు. ఉద్యోగుల పరంగా భారీ ఉద్యోగులున్న 4వ ప్రభుత్వ శాఖ గ్రామ,వార్డు సచిలయ శాఖ. కాకపోతే ఇఅన్నీ పేరులోనే బలంగా కనిపిస్తున్నాయి. వారందరినీ జిల్లాలో పరిపాలించడానికి జాయింట్ కలెక్టర్లుగా 13 మంది ఐఏఎస్ అధికారులు ఇంతటి మహత్తర వ్యవస్థను ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ సర్కారు.. అదే స్థాయిలో సాంకేతికను అంది పుచ్చుకోవడంలో ఘోరంగా విఫలమైందనే చెప్పాలి.. దానికి కారణం కూడా లేకపోలేదు. అందుబాటులో సాంకేతిక, వనరులున్నా వాటిని వినియోగించుకోలేకపోవడమే. నేటికీ సంక్షేమ పథకాలు అందించానికి వినియోగించే మొబైల్ యాప్స్ ని పూర్తిస్థాయిలో సచివాలయ వెల్పేర్ అసిస్టెంట్లుగానీ, వాలంటీర్లు, మండల స్థాయి అధికారులు సైతం వాడలేకపోతున్నారంటే కారణం ఒక్కటే సాంకేతికతను ఉద్యోగులకు దగ్గర చేయలేకపోవడం. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ సిబ్బంది, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్స్ పూర్తిస్థాయిలో పనిచేయాలి. అంతకంటే ముందుగా సదరు గ్రామ, వార్డు సచివాలయశాఖ వెబ్ సైట్లు కూడా పరిపూర్ణంగా పనిచేయాల్సి వుంది. అంతేస్థాయిలో వీటి నిర్వహణకు కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలి. కానీ సచివాలయ శాఖలో సిబ్బందిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చూపించిన శ్రద్ధ.. తరువాత వారి ద్వారా ప్రజలకు సేవలందించడానికి ఎలాంటి అడ్డంకి సాంకేతికత విషయంలో అడ్డుకాకుండా ఉండేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడం ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మొత్తం కార్యకలాపాలన్నీ డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. అలాంటి సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలకు ఉపయోగ పడేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలోనే ఒక ఐటీ విభాగాన్ని, హ్యూమన్ రీసోర్స్ కేంద్రాలు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సుగమం అయ్యేది. వాటిని ఏర్పాటు చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది సాంకేతికతకు చాలా దూరంలోనే ఉండిపోతున్నారు. పనిజరుగుతుందంటే అంతా బాగనే వుందనుకుంటున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏ స్థాయిలో సాంకేతికను అదిగమించి ప్రజలకు సేవలందిస్తున్నామనే విషయాన్ని జిల్లా స్థాయిలో గ్రామ, సచివాలయ శాఖ జెసిలుగానీ, జిల్లా కలెక్టర్లు గానీ, రాష్ట్రస్థాయిలో కమిషనర్లు, ఈశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి కూడా ఆలోచించడం లేదు. వాస్తవానికి ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసిన తరువాత వారికి శిక్షణ, సాంతికత, ఐటి పరికరాలు, ఇంటర్నెట్, కంప్యూటర్లు, ఇలా అన్నీ ఒక ప్రోటోకాల్ పద్దతిలో అందించాలి. అత్యధిక వినియోగాన్ని ద్రుష్టిలో ఉంచుకొని ఇవ్వాల్సిన ట్యాబ్ లు నాణ్యతలోపించడంతో అపుడే వాలంటీర్ల దగ్గర ఫోన్లు మొరాయిస్తున్నాయి.. ఇచ్చిన మొబైల్ సిమ్ లు పనిచేయకపోవడంతో వారి సొంత మొబైల్ ఫోన్లు వినియోగించి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు గ్రామ, వార్డు వాలంటీర్లు. ఆఖరికి సచివాలయాల్లో స్పీడ్ గా వచ్చే ఇంటర్నెట్ సదుపాయం కూడా లేకపోవడంతో ఆన్ లైన్ కార్యకాలాపాలన్నీ చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. సంక్షేమపథకాలు అమలు చేసే యాప్ లు కొత్త వెర్షన్లు, కొత్త ఆప్షన్లు జోడించినపుడు వారికి వాటిని ఏ విధంగా వినియోగించాలో ప్రత్యేక శిక్షణా కేంద్రం ద్వారా వారికి మార్గదర్శకాలు ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. గ్రూపులో కొత్త వెర్షన్ యాప్ పెట్టాం. దానినే వినియోగించండి అని ఒక్క మెజేస్ పెట్టి ఊరకుండిపోతున్నారు. దీనితో ఒక్కోసారి అవి ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో ఇనిస్టాల్ కాక వాలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బయోమెట్రిక్ యంత్రాలు కొరత, ఐరిష్ పరికరాల లేమి ఇలాం సాంకేతిక పరంగా చాలా లోపాలతోనే సచివాలయ సిబ్బంది పనిచేయాల్సి వస్తుంది. పాడైన మొబైల్ ఫోన్ల స్థానంలో ప్రభుత్వం వాటిని రిపేర్లు చేయించే ఇచ్చే సహాయం కూడా చేయడం లేదు. దానికితోడు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్న తరువాత వీరికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదు. అప్పటికప్పుడు నెల రోజులు శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకుంది. ఫలితంగా చాలా పనులు మందకొడిగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని చాలా సచివాలయాల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రింటర్లు కూడా మూలకు చేరిపోయాయి. దీనితో గ్రామపంచాయతీల్లో వినియోగిస్తున్న కంప్యూటర్లు, ప్రింటర్లు వినియోగించాల్సి వస్తుంది. ఇలా అడుగడుగునా సాంకేతిక విషయంలో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఇచ్చిన టార్గెట్లు పూర్తికాకపోయినా అధికారుల నుంచి తిట్లు, చీవాట్లు కూడా వీరే పొందాల్సి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ వ్యవస్థలో లోపాలను గుర్తించి, సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కొంత మంది సాంకేతిక సిబ్బందిని, జిల్లాకొక హ్యూమన్ రీసోర్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తే తప్పా ప్రభుత్వ సేవలకు అడ్డంకిగా వున్న అరకొర సాంకేతికను అదిగమించడానికి ఆస్కారం వుండదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.!