నిర్మాణాలన్నీ ఈఏడాదే పూర్తి కావాలి..


Ens Balu
3
Tadepalle
2021-07-13 12:41:53

రాష్ట్రవ్యాప్తంగా మిగిలి వున్న గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, ఆర్భీకేలు, డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం ఈ ఏడాది పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వివిధశాఖ అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని నిర్మాణాలు పూర్తి అయితే కార్యకాలపాలన్నీ నూతన భవనాల నుంచి ప్రారంభించాలన్నారు. వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాధాన్యక్రమంలో పనులు చేపట్టాలని అధికారులనుఆదేశించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని, పల్లెలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. వైయస్సార్‌ జలకళ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమన్న సీఎం దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. చిన్న చిన్న నదులమీద ఉన్న బ్రిడ్జిల వద్ద చెక్‌డ్యాం తరహా నిర్మాణాలు చేపట్టి నీటిని నిల్వచేయాలన్నారు. కనీసం 3–4 అడుగుల నీరు నిల్వ ఉండేలా ఏర్పాటు చేయడం ద్వారా భూర్భజలాలు బాగా పెరుగుతాయని సీఎం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రిడ్జిల వద్ద ఈ నిర్మాణాలు చేపట్టాలని, వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూరక్ష పథకం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. మరింత సమర్ధవంతంగా అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు.
పంచాయతీరాజ్, రెవెన్యూ, పురపాలకశాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె వి సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, సెర్ప్‌ సీఈఓ పి రాజాబాబు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.