వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉద్యోగులకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకోవడం ఉద్యోగుల పట్ల సీఎం వైయస్ జగన్ ఆలోచనాతీరును ఆ నిర్ణయాలు తెలియచేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని ప్రైవేటు కల్యాణమండపంలో ఏపి ఎన్ జి ఓ సంఘ నేత నలమారు చంద్రశేఖరరెడ్డి అభినందన సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎప్పుడూ చెబుతుంటారని తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నిరంగాలలో అగ్రగామిగా నిలవాలన్నా,ప్రజల జీవనప్రమాణాలు పెరగాలన్నా అది భాధ్యతాయుతంగా పనిచేసే ఉద్యోగుల వల్లనే సా«ధ్యమవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.కరోనా వంటి కష్టసమయంలో కూడా సీఎం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను ప్రజల ఇంటి ముంగిటకు తీసుకువెళ్లిన ఘనత ఉద్యోగులదేనని వారందర్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు సీఎం చెప్పమన్నారని సజ్జల తెలియచేశారు. అధికారం చేపట్టగానే గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 42 వేల ఉద్యోగాలను సృష్టించారు.ప్రపంచ చరిత్రలో ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మనం చూసి ఉండమన్నారు. ప్రజలకు అందించాల్సిన సేవలు గ్రామసచివాలయాల ద్వారా త్వరితగతిన పారదర్శకంగా అందించాలనేది ఆయన లక్ష్యమని వివరించారు. ఆ లక్ష్యసాధనలో భాగంగా గ్రామసచివాలయాల వ్యవస్ధ ను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఆ ఉద్యోగ నియామకాలలో కనీసం ఇంటర్వూల వంటివి కూడా లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతిభ కలిగిన వారికి అది కూడా వెనకబడిన వర్గాల వారికి దాదాపు 80 శాతం ఉద్యోగాలను అందించారన్నారు. వారికి సహాయంగా రెండులక్షల 55 వేలమందితో వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటుచేశారన్నారు. కాంట్రాక్ట్ ,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నవారిని సైతం ఏపి కార్పోరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్(ఆప్కాస్ ) పేరుతో సంస్ధను ఏర్పాటుచేసి ఆ ఉద్యోగులలో ఆత్మవిశ్వాసం పెంచారన్నారు. ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలే ప్రభుత్వంలో ఉంటాయన్నారు.