రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో మహిళలకు రక్షణ ఉండాలి.. ఆకతాయిల ఆగడాలను కూకటి వేళ్లతో పెకిలించాలి.. దిశ చట్టంతో మహిళల దశను మార్చాలి.. దిశ చట్టం దేశానికే ఆదర్శం కావాలి.. నలుదిశలా వ్యాప్తి చెందాలి.. మహిళలకు పోలీసు శాఖ ఒక రక్షణ కవచంలా మారాలి.. అలా జరగాలంటే మహిళా పోలీసు వ్యవస్థ ఒక్కటే ముఖ్యం.. అలా జరగాలన్నా.. ప్రభుత్వం అనుకున్నట్టు గ్రామాల్లో తేడాగాళ్లకు కాస్త భయం వచ్చేటట్టు చేయాలన్నా.. మహిళా పోలీసుల ఒంటిపై కాఖీ చొక్కా.. నెత్తిన మూడు సింహాల గుర్తు.. చేతిలో లాఠీ ఉంటేనే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేది.. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 15వేల మంది మహిళా పోలీసులు గ్రామస్థాయిలో ఉత్తుత్తి పోలీసులుగానే మిగిలిపోయారు.. నిజమైన పోలీసులనే సివిల్ డ్రెస్సులో ఉంటే ఎవరూ పట్టించుకోరు..ఇక మహిళా పోలీసులమని చెప్పి సాధారణ దుస్తుల్లో గ్రామాల్లో తిరుగితే పరిస్థితి ఎలా వుంటుందో ఆలోచించుకోవాలి.. ఏంటి తేడాగా చదువుతున్నాం అనుకుంటున్నారా... కాదు కాదు మీరు కరెక్టుగానే చదువుతున్నారు.. ప్రభత్వ వ్యవస్థలోని లోపాలు.. రాష్ట్ర అధికారులు నిర్ధిష్టంగా ఇవ్వలేని ఆదేశాలు.. ఈ ఆర్టికల్ చదవేటపుడు మిమ్మల్నే కాదు ప్రజలను కూడా కాస్త చులకనగా ఆలోచించేలా చేస్తున్నాయి.. కారణం ఒక్కటే రాష్ట్రస్థాయిలో పోలీస్ బాస్ డిజిపి ఇచ్చిన ఆదేశాలు, ప్రత్యేక జీఓలు అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో అమలు కాకపోవడమే.. నేటికీ గ్రామ, వార్డు మహిళా పోలీసులను ప్రభుత్వమే ఏ విధంగా గుర్తించాలో ఒక కొలిక్కిరాలేదంటే ఇక ప్రజలకు, మహిళలకు ఏ విధంగా సేవలందించి రక్షణ కల్పిస్తారనే అంశం ప్రశ్నార్ధకమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం నియమించిన మహిళా పోలీసులకు ఏ తరహా విధులు అప్పగించాలి, వీరిని ఏవిధంగా గుర్తించాలనే విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి డిజీపీ వరకూ అధికారులంతా మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి గ్రామస్థాయిలో మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం పరిరక్షించాలనేది ప్రభుత్వ ఆలోచన. దానికి అనుగుణంగా వీరి నియామకాల సమయంలో జీఓ నెంబరు 129 ద్వారా సాధారణ పోలీసులు నిర్వర్తించే విధులతోపాటు వీరికి ఐసిడిఎస్ అంగన్వాడీల పర్యవేక్షణ బాధ్యత కూడా అప్పగించారు. అంతవరకూ బాగానే వున్నా.. పోలీస్ ఉద్యోగమంటే ఒంటిపై కాఖీ చొక్కా, చేతిలో లాఠీ లేకపోతే గ్రామస్థాయిలో ప్రభుత్వం అనుకున్న గ్రామ సంరక్షణ జరగదు. అలా కాఖీ చొక్కా లేకపోతే వచ్చేది పోలీసులని ప్రజలు కూడా గుర్తించరు.. దీనితో ప్రభుత్వం తరువాత మరో జీఓ నెంబరు 59ని విడుదల చేసి.. మహిళా పోలీసులందరినీ సాధారణ పోలీసులుగా మారుస్తున్నామని అందులో పేర్కొంది. అంతే కాదు వీరికి పదోన్నతి వస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇస్తామని కూడా ప్రభుత్వం ఆ జీఓ పేర్కొంది. ఇక్కడే చిక్కంతా వచ్చిపడింది. డిగ్రీ చదువుకున్న తమను కానిస్టేబుళ్ల మాదిరిగా ఎలా గుర్తిస్తారంటూ మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు సాధారణ పోలీసులు చేసే విధులకంటే తాము అధికంగా విధులు నిర్వర్తిస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. తమకు పదోన్నతి కల్పిస్తే ఎస్ఐలుగా పదోన్నతి కల్పించాలనేది వీరి డిమాండ్. ఇదిలా వుంటే గ్రామస్థాయిలో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు అనే వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా స్టేషన్ పోలీసులుగా తమ గౌరవానికి భంగం కల్పించారని హోంగార్డు నుంచి స్టేషన్ ఎస్ఐల వరకూ తెగ ఫీలై పోతున్నారు. అంతేకాదు.. మిమ్మల్ని తాము సాధారణ పోలీసులుగా గుర్తించలేమని, మేముండగా మిమ్మల్ని పోలీసులని ఎలా పిలుస్తారని.. ఇది జరిగేపని కాదని పోలీసులంతా వీరిని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని చోట్ల నేరుగా మీరు నిజమైన పోలీసులు కాదనీ.. మేమే నిజమైన పోలీసులమని.. అయినా డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగాలు పొందిన మీరు.. మాలా ఇంటర్ విద్యార్హతతో కానిస్టేబుల్స్ గా ఉండటం ఏంటంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయడం విశేషం. దీనితో ఈ విషయం కాస్తా నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందటంతో వీరికి ప్రస్తుతం పోలీసు యూనిఫారం కాకీ డ్రెస్సు, లాఠీ ఇవ్వాలా లేదంటే. సివిల్ డ్రెస్సులో పేరుకే పోలీసులుగా ఉంచి, హోంగార్డులు, కానిస్టేబుళ్ల కిందనే విధులు నిర్వర్తించేలా చేయాలా అనే కోణంలో పోలీసులు వర్గాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇటు మహిళా పోలీసుల్లో కూడా చాలా మంది 45సంవత్సరాలు వచ్చినవారున్నారు. వారంతా తమకు పోలీస్ డ్రెస్సు వద్దని, పదోన్నతి ఇస్తే ఐసిడిఎస్ విభాగం నుంచి ఇవ్వాలని చెబుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా స్టేషన్ పోలీసులు తమకి ఏ స్థాయి ఉద్యోగం అంటే... పోలీస్ డ్రెస్ వేసుకున్న ఉద్యోగం కావాలా, లేదంటే గ్రామసచివాలయంలోనే డ్రెస్సులేని ఉత్తుత్తి పోలీసు ఉద్యోగం కావాలా అనే కోణంలో సర్వే నిర్వహిస్తున్నారట. ప్రత్యేక సమావేశాల్లో వీరి ఆలోచనలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అసలు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసే సమయంలో మహిళా పోలీసు ఉద్యోగం ఇవ్వడం, వారి విధుల కోసం జీఓ 129 జారీ చేసింది ప్రభుత్వం. అసలు ఆ జీఓపై రాష్ట్రంలోని ఎంత మంది పోలీసులకు అవగాహన వుంది.. దానిపై ఎన్ని జిల్లాల ఎస్పీలు వాటిపై నిర్ధిష్ట ఆదేశాలు ఎస్ఐలకు ఇచ్చారనే దానిపైనా నేటికీ క్లారిటీ రాలేదు. దీనితో సాధారణ పోలీసులుగా ప్రభుత్వం మిమ్మల్ని నియమిస్తే మాత్రం తామెలా గుర్తిస్తామంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట కానిస్టేబుళ్లు, ఎస్ఐలు. పోలీసుశాఖ పిలవబడే హోంశాఖలోని సాధారణ పోలీసులు నిర్వర్తించే విధులతోపాటు మహిళా శిసు సంక్షేమశాఖలోని అంగన్వాడీ కేంద్రాల మానటరింగ్ విధులు వీరికి కేటాయించారు. వాటితోపాటు గ్రామస్థాయిలో ఆరోగ్య సహాయకులు చేసే విధులు ఇమ్యునైజేషన్ విధులు కూడా కేటాయించారు. ఇలా ఒక్క మహిళా పోలీసు మూడు శాఖలకు చెందిన విధులతోపాటు, గ్రామసచివాలయంలో డిజిటల్ అసిస్టెంటుకి అత్యవసర సమయంలోనూ, పని అధికంగా ఉన్న సమయంలోనూ సహాయం చేయాలని ప్రభుత్వం మహిళా పోలీసులకు తెలియజేసింది. ఇన్ని చేస్తున్న ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థకు ఒక గుర్తింపు అంటూ ఇవ్వకవోవడం విశేషం. ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన మహిళా పోలీసు వ్యవస్తను హోంశాఖలోని ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల ద్వారా మహిళా పోలీసు వ్యవస్థను ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అధికారులు తమకు వీరి ద్వారా పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టారన్నట్టుగా వ్యవహరిస్తూ..మహిళా పోలీసులను కాస్త చులకనగా చూస్తున్నారు. ఈ విషయం డివిజన్ స్థాయిలో డిఎస్పీల, జిల్లా స్థాయిలో ఎస్పీలకు తెలిసినా కింది స్థాయి పోలీసులకు ప్రభుత్వం జారీచేసిన జీఓల ఆధారంగా వారి విధులు వారిని నిర్వర్తించనీయండి అనే కోణంలో ఆదేశాలు జారీచేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలా ఆదేశాలు జారీ చేసి ఉంటే స్టేషన్ స్థాయిలో పోలీసులు.. గ్రామ సచివాలయ మహిళా పోలీసులను ప్రశ్నించే తీరు, అజమాయిషి తీరు మారుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం గీసిన లక్ష్మణ రేఖ రెండేళ్ల ప్రొబిషన్ అనే మాటకు మహిళా పోలీసులు కూడా కాస్త వెనుకడుగు వేస్తున్నట్టు చెబుతున్నారు. లేదంటే డిగ్రీ, అంతకంటే ఎక్కువగా చదువుకున్న మహిళా పోలీసులు తాము ఏఏ జీఓ నెంబర్లు ద్వారా విధుల్లోకి చేరామో... ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో జీఓనెంబర్లు 129, జీఓనెంబరు 59లను విడుదల చేసిందో.. దైర్యంగా చెప్పేంత సత్తా ఉన్నవాళ్లే మహిళా పోలీసులుగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోనూ, పట్టణాల్లోని వార్డుల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు. అంతెందుకు దిశ యాప్ టార్గెట్ లు పెడితే రోజుకు 50 నుంచి 100 రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారంటే గ్రామస్థాయిలో వీరి విధులు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి ప్రభుత్వం కూడా గుర్తించాలనే వాదన బలపడుతోంది. ఇవేమీ కాకుండా మాట్లాడితే మేము ఒక్క లెటర్ పెట్టామంటే మీ ఉద్యోగాలు పోతాయనే పదాన్ని స్టేషన్ లో హోంగార్డులు నుంచి ఎస్ఐల వరకూ ఆ పదాలను జోబులో పెట్టుకున్నట్టే మాట్లాడటం, వీరే మహిళా పోలీసులకు జీతాలు ఇస్తున్నట్టు కలరివ్వడం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఇదంతా హోంశాఖలోని 60శాతం మంది పోలీసులు వెలబెడుతున్న వ్యవహారం మిగిలిన 40శాతం మంతి పోలీసులు ఎంతో చక్కగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ.. మహిళా పోలీసులు గ్రామస్థాయిలో ఏ విధంగా వ్యవహరించాలో చాలా చక్కగా వారికి ఉపదేశిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా సర్కిల్ ఇనెస్పెక్టర్లు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అటు ప్రభుత్వంగానీ, డిజిపీ కార్యాలయం నుంచి గానీ నిర్ధిష్ట ఆదేశాలు రాకపోవడం వలనే మహిళా పోలీసుల విధులేంటో.. యూనిఫారమేంటో నేటికీ తెలియని స్థితిలో విధులు నిర్వహిస్తున్నారు వార్డు, సచివాలయ మహిళా పోలీసులు.. ముందు ముందు వీరంతా పవర్ లేని ఉత్తుతి పోలీసులుగా గ్రామస్థాయిలో యూనిఫారం లేకుండా రక్షణ కల్పిస్తారా.. లేదంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందిస్తారా..అనేది డిజీపీ ఇచ్చే ఆదేశాల మీదే ఆధారపడి వుంది..చూడాలి ఏం జరుగుతుందనేది..!