బయో మెట్రిక్ వేయకపోతే రంగు పడుద్ది..


Ens Balu
12
Amaravati
2021-07-18 02:30:57

ప్రజలకు సేవలందించాలని గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తే.. అక్కడ పనిచేసే సిబ్బందిని ఇష్టానుసారంగా కావాల్సిన చోటుకి డిప్యుటేషన్లు, అదనపు విధులకు పంపుతున్నారు.. ఒక్కరు కూడా పూర్తిస్థాయిలో సచివాలయాల్లో ఉండటం లేదు.. డిజిటల్ అసిస్టెంట్లను ఎక్కడా బయట విధులకు పంపకూడదనే ప్రత్యేక జీఓ ఉన్నా మండల అధికారులు కావాలనే వారిని బయటకు పంపుతూ వారి కార్యాలయ విధులకు వాడుతున్నారు.. అలా అయితే గ్రామసచివాలయాలు ఎందుకు.. మనం అనుకున్న లక్ష్యం ఎలా నెరవేరుతుంది.. ఏ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గద్దు.. సచివాలయ సిబ్బంది డిప్యుటేషన్లన్నీ రద్దుకావాలి.. ఎవరికి కేటాయించిన సచివాలయంలో వారే ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఉండాలి.. ఖచ్చితంగా బయో మెట్రిక్ అటెండెన్సుతో ఉండాల్సిందే.. ఏం చేస్తారో నాకు తెలియదు సోమవారం నుంచి మొత్తం సచివాలయాల స్వరూపమే మారిపోవాలి.. ఇవీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్లుకి ఇచ్చిన ఆదేశాలు.. ఇవన్నీ ఎందుకంటే సచివాలయ సిబ్బందికి జిల్లా అధికారులు అదనంగా కేటాయిస్తున్న విధులు, సక్రమంగా వేయని బయోమెట్రిక్ రిపోర్టులు తెచ్చిన తంటా.. రాష్ట్రవ్యాప్తంగా బయోమెట్రిక్ నేరుగా సీఎం చెక్ చేసిన సమయంలో ప్రతీ జిల్లాలోనూ 60శాతనికి పైగానే బయోమెట్రిక్ పడని విషయం..సచివాలయ సిబ్బందిని అదనపు విధులకు వినియోగిస్తున్నట్టు తేలింది.. దీనితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది ఖచ్చితంగా బయో మెట్రిక్ ను వేసేలా చూడాలని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను గట్టిగా ఆదేశించిన నేపథ్యంలో ఉదయం సాయంత్రం రిపోర్టులు జిల్లా కలెక్టరేట్లకు చేరుతున్నాయి. రాష్ట్రంలోని 13జిల్లాలు, 16 మున్సిపాలిటీల్లో వార్డు సచివాలయాల సిబ్బంది బయో మెట్రిక్ వేయడంలో వెనుకంజలో ఉన్నారు.. మరికొంత మంది ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రసన్నం చేసుకొని కావాల్సిన సచివాలయాల్లోకి అదనపు డిప్యూటేషన్లు వేయించుకున్నారు. ఫలితంగా సీఎం ఆదేశాలతో ప్రస్తుతం డెప్యూటేషన్ లో వున్న కార్యదర్శిలంతా వారి వారి సొంత సచివాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. అన్ని డిప్యుటేషన్లు సోమవారం నుంచే రద్దు కానున్నాయి. ఏ ఒక్క సచివాలయ సిబ్బందికి బయో మెట్రిక్ నుంచి మినహాయింపు ఇచ్చేది లేదని, బయోమెట్రిక్ లోపాలు ఇబ్బందులు వుంటే తక్షణమే సరిచేయాలని సీఎం కలెక్టర్లకు వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా గందర గోళ పరిస్థితి ఏర్పడింది.  జిల్లాల్లో సచివాలయ కార్యదర్శిలు, వీఆర్వోలు, సర్వేయర్లు, మహిళా పోలీసులు, డిజిటల్ అసిస్టెంట్లకు అదనపు విధులు, డిప్యుటేషన్లు వేయడంతో వారి బయో మెట్రిక్ అటెండెన్సు కూడా చాలా తక్కువగా నమోదు అవుతుంది. దానిపై తమకు మండల అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు డిప్యూటేషన్లు వేశారని చెప్పుకునే సిబ్బందికి సోమవారం నుంచి సమయానికి రాకపోతే  రంగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. బయో మెట్రిక్ అటెండెన్సు ఆధారంగా సిబ్బందికి జీతాలు ఇవ్వనున్నారు. ఖచ్చితంగా సోమవారం నుంచి మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ సచివాలయంలోనే అన్నిశాఖల సిబ్బంది ఖచ్చితంగా హాజరు కావాల్సి వుంటుంది. ఇదే సమయంలో ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేసే సమయంలో ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ సిబ్బంది బయో మోట్రిక్ అటెండెన్సు పరిగణలోకి తీసుకోవడంతో ఆడుతూ పాడుతూ ఉద్యోగాలు చేసే ఉద్యోగులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా సచివాలయాల్లో బయో మెట్రిక్ అటెండెన్సు తక్కువగా ఉంటే సదరు జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించిన నేపథ్యంలో సచివాలయ సిబ్బంది మొత్తం ప్రజలకు గ్రామంలోనే ఉండి సేవలు అందించేందుకు సోమవారం నుంచి సిద్దమవుతారు. ఇప్పటి వరకూ సచివాలయ కార్యదర్శిలకు బయో మెట్రిక్ నుంచి మినాయింపులు ఇచ్చారని చెప్పుకునేవారంతా కూడా ఖచ్చితంగా సమయానికి బయో మెట్రిక్ వేయాల్సి వుంటుంది. ప్రభుత్వ లక్ష్యానికి జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు, మండల అధికారులు(ఎంపీడీఓలు, తహశీల్దార్లు,ఏఓలు) గండికొడుతున్నట్టు స్పష్టంగా సీఎం నేరుగా గుర్తించేలా చేసింది. రాష్ట్రంలో సచివాలయ సిబ్బందికి కేటాయిస్తున్న అదనపు విధుల  కారణంగా ఈ బయో మెట్రిక్ అటెండెన్సు సక్రమంగా పడటం లేదనే విషయం స్పష్టమైంది. అయినా ఇక్కడ తప్పంతా సచివాలయ ఉద్యోగులదే అన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఎందుకు సచివాలయ సిబ్బంది సమయానికి బయో మెట్రిక్ వేయలేకపోతున్నారనే విషయంపై రాష్ట్రప్రభుత్వం ఆరాతీస్తే.. జిల్లా అధికారులు, మండల అధికారులు సచివాలయ సిబ్బందికి అదనపు పనులు సిబ్బందిలేమిని కారణంగా చూపి కావాలనే పురమాయిస్తున్నట్టు లెక్కతేలింది. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సచివాలయ సిబ్బందికి ఎలాంటి అదనపు పనులు అప్పగించకూడదని.. డెప్యూ టేషన్లు రద్దు చేయాలని.. ముఖ్యంగా ప్రతినిత్యం సేవలు అందించే డిజిటల్ అసిస్టెంట్లు ఏ పనులకూ వినియోగించకూడదనే జీఓను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మండల కార్యాలయాల్లో సిబ్బంది కొరతగా ఉండటంతో చాలా మండలాల్లో డిజిటల్ అసిస్టెంట్ల సేవలను అనధికారికంగా ఎంపీడీఓలు, తహశీల్దార్లు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ విడుదల చేసినప్పటికీ దానిని కూడా ఎంపీడీఓలు భేఖాతరు చేయడంతో వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సచివాలయాలకి కేటాయించిన సిబ్బంది వారి సచివాలయాల్లో ఉండకపోతే కలెక్టర్లుపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరు కలెక్టర్లు అన్నిశాఖల జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి తక్షణమే డిప్యూటేషన్లు రద్దు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని కూడా కలెక్టర్లు జిల్లాఅధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఖచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్సు ఆధారంగానే సచివాలయ సిబ్బంది మొత్తానికి జీతాలు అందించాలని కూడా కలెక్టర్లంతా జిల్లా, మండల అధికారులను ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన రెండేళ్లకు గానీ సచివాలయ ఉద్యోగులపై ద్రుష్టిసారించకపోవడంతో ఇప్పటి వరకూ ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతూ వచ్చింది. ఇపుడు నేరుగా సీఎం రంగంలోకి దిగడంలో ప్రభుత్వంలోని సుమారు 14శాఖల ముఖ్యకార్యదర్శిలంతా కలెక్టర్లందరికీ ఫోన్ ఇన్ చేసి తలంటేశారు. సోమవారం నుంచి 100శాతం బయో మెట్రిక్ పడకపోతే చర్యలు తొలుత జిల్లా కలెక్టర్లపై ఉంటే.. కలెక్టర్లు జిల్లా అధికారులపైనా, జిల్లా అధికారులు మండల అధికారులకు చార్జిమెమోలు జారీచేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అదేసమయంలో సచివాలయ సిబ్బంది మూమెంట్ రిజిస్టర్, ప్రజల నుంచి వచ్చే శాఖల వారీ అర్జీలకు ఉద్యోగులే బాధ్యత వహించాల్సి వుంటుంది. సర్వేయర్లకు సైతం డిప్యూటేషన్లు రద్దు, అదనపు విధులు మండల అధికారులు రద్దుచేయాలి. అలా కాకపోతే రాష్ట్రశాఖ ముఖ్య కార్యదర్శిల నుంచి అనుమతులు తెచ్చుకోవాలని జిల్లా శాఖ అధికారులకు కలెక్టర్లు తెగేసి చెప్పేశారు. దీనితో సోమవారం నుంచి సచివాలయ సిబ్బంది ఉదయమంతా వారి డ్యూటీ చార్టు ప్రకారం విధులు, మధ్యాహ్నం నుంచి స్పందన కార్యక్రమ నిర్వహణలో పాల్గొనాలి.. కానీ రాజకీయ ఒత్తిళ్లు.. యధాస్థితిగానే మండల అధికారుల ప్రత్యేక పనుల పురమాయింపు.. ప్రభుత్వం ఇచ్చిన జీఓలను అమలు చేయకపోవడం అలవాటుగా మారిన ప్రభుత్వశాఖల అధికారులు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఆదేశాలను ఏ స్థాయిలో అమలు చేస్తారనేది వేచి చూడాలి.. ఒకవేల అమలు చేయకపోతే రంగు పడటం ఖాయంగానే కనిపిస్తుంది ఆదేశాల్లో మాత్రం.. చూడాలి ఏం జరుగుతుందనేది.