దేశీయ పర్యాటకులనే కాకుండా ఇతర దేశాల పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పర్యాటకం, సాంస్కృతికం, యువజన, క్రీడా శాఖలకు చెందిన ఉన్నాతాధికారులతో సచివాలయంలోని తన చాంబరులో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాలయాలు, అటవీ ప్రాంతాలను కలుపుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు సర్క్యూట్ లుగా (రాయలసీమ, విజయవాడ, గోదావరీ, ఉత్తరాంధ్ర) పర్యాటక ప్యాకేజిలు పెట్టాలని నిర్ణయించామని అన్నారు. రాయలసీమలో తలకోన, హార్సీ హిల్స్, తిరుపతి.. కృష్ణా,గుంటూరు పరిధిలో భవానీ ఐలెండ్, దుర్గమ్మ దేవాలయం, బౌద్దరామాలు, గోదావరి పరిధిలో అన్నవరం, పాపికొండలు, దిండి ప్రాంతంలో బోటింగ్, ఉత్తరాంధ్రలో పాడేరు, అరుకు, సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం ప్రాంతాలను పర్యాటక సర్క్యూట్ పరిధిలో అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై పర్యాటకులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 13 పర్యాటక ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. విశాఖలో బీచ్ ల నిర్మాణం, కృష్ణా గోదావరి నదీ పర్యాటకాన్ని స్థానిక అంశాల ఆధారంగా పర్యాటకలకు ప్యాకేజీలను అందిస్తామన్నారు. విశాఖ ప్రాంతంలోని ఎర్రమట్టి దిబ్బలు ప్రాంతాన్ని పర్యాటకాన్ని.. అభివృద్ధి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ప్రభుత్వం పర్యాటక శాఖకు స్థలం కేటాయించిందని మంత్రి తెలిపారు.
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహకాలు అందించేందుకు 4 కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో రాష్ట్రంలో పదిహేను ప్రాంతాల్లో క్రీడా కేంద్రాలను అభివృద్ది చేసేందుకు.. ఖేల్ ఇండియా పథకం క్రింద విశాఖపట్నం, కడప, తూర్పు గోదావరి జిల్లాలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపిస్తున్నామన్నారు. ఈ ఏడాది వై.ఎస్.ఆర్. క్రీడా పురస్కారాలు అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2శాతం రిజర్వేషన్లు కేటాయించామన్నారు. స్పోర్ట్సు కోటా క్రింద జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలను పరిశీలించి స్పోర్ట్సు కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. థర్డు వేవ్ లేకపోతే.. కోవిడ్ జాగ్రత్తలతో గతంలో మాదిరిగానే టూరిజం ఫెస్టివల్స్, ఆగస్టు నుంచి ప్రతి నెలా కనీసం రెండు యువజన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.రజత్ భార్గవ్, ఏపీ పర్యాటక సంస్థ సి.ఇ.ఓ. ఎస్.సత్యనారాయణ, ఏపీటీడీసీ ఈడీ మాల్ రెడ్డి.. ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.