ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగులు ఉద్యోగాలు భర్తీ చేయక పోవడం వలన సచివాలయ సిబ్బంది అదనపు పని భారం మోయాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న మేజర్ పంచాయతీల్లో ఒకే చోట రెండు నుంచి మూడు సచివాల యాలు ఏర్పడటం, సుమారు 13వేలకు పైగా ఖాళీలు మిగిలిపోవడం, గ్రేడ్1 కార్యదర్శిలు సీనియారిటీ పేరుతో పక్కకు జరిగిపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పనిభారం మొత్తం పడుతోంది. అలాగనీ అటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగానీ, కమిషనర్ గానీ జీఓనెంబరు 149 ని అమలు చేయకపోవడంతో అధికార వికేంద్రీకరణ సైతం జరగలేదు. సచివాలయ పరిధిలోని రికార్డులు, ముఖ్య విధులు, అధికార లావాదేవీలన్నీ గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతుల్లోనే ఉంచుకొని, కొత్తగా చేరిన గ్రేడ్-5 కార్యదర్శిలతోనే పనంతా చేయిస్తున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సచివాలయా వారీగా పరిధిని విడదీయని అధికారులు, తమతోనే అదనపు పనిచేయించే గ్రేడ్ 1, 2 కార్యదర్శిల ఉత్తుత్తి, విధులు, అనధికార ఇన్చార్జి ఉద్యోగాలు, డిప్యుటేషన్లను కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, మహిళా పోలీస్, వెటర్నరీ అసిస్టెంట్, సెరీకల్చర్ అసిస్టెంట్, తదితర పోస్టులన్నీ కలిపి సుమారు 13వేలకు పైగానే ఖాళీలు ఉండిపోయాయి. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ కేలండర్ లో వాస్తవానికి ఈ ఉద్యోగాలను తొలుత భర్తీచేయాల్సి వుంది. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 5 సచివాలయాల్లో మిగులు ఉద్యోగాలను భర్తీచేస్తే ప్రజలకు గ్రామ, వార్డు స్థాయిలోనే సేవలు అందుతాయి. అలాకాకుండా ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీలలను మాత్రమే చూపడం విచిత్రంగా వుందంటున్నా సచివాలయ ఉద్యోగులు. అత్యవసర ఉద్యోగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన భర్తీచేస్తాయి. అదేంటో దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో పూర్తిస్థాయిలో ఉద్యోగులను భర్తీచేయకుండా వదిలేసింది. పైగా ప్రొభిషన్ పేరుతో తమతోనే పనులు అధికారం ఇవ్వకుండా పనులు చేయిస్తూ.. యాక్టింగ్ పనులు చేసే గ్రేడ్-1 కార్యదర్శిల వైపు ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యస్తం చేస్తున్నారు. కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో జీతం ప్రొభిషనరీ సమయంలో కేవలం రూ.15వేలు మాత్రమే ఇవ్వడంతో ఎటూ చాలని వారు చాలా మంది ఈ ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయారు. మరికొన్ని ఉద్యోగాలు అర్హత సాధించిన వారు లేక వదిలేస్తే..వెటర్నరీ, సెరీకల్చర్, ఫిషరీష్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, పంచాయతీ కార్యదర్శి ఇలా చాలా రకాల ఉద్యోగాలు భర్తీకాకుండా ఉండిపోయాయి. దీనితో మూడు సచివాలయాలు ఉన్నచోట ఖాళీగా వున్న పోస్టుల్లో ఆయా శాఖ సచివాలయ ఉద్యోగులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఉద్యోగులపై పనిభారం అధికంగా పడుతుంది. అధికారాలు తమకు తేకపోయినా సిబ్బందితో దగ్గరుండి అదనపు విధులు తామే చేయించాల్సి వస్తుందని చెబుతున్నారు గ్రేడ్5 పంచాయతీ కార్యదర్శిలు. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన తరువాత ప్రభుత్వ శాఖల వారీగా వారి విధులకు సంబంధించిన డ్యూటీ చార్టులను కూడా ప్రత్యేక జీఓల రూపంలో విడుదల చేస్తుంది. ఈ క్రమంలో అదనంగా ఖాళీగా వున్న ఉద్యోగాల్లో అదనపు విధులు నిర్వహిస్తున్నవారిపై పనిభారం పడుతోందని, అయినప్పటికీ కష్టపడి పనిచేస్తున్నా ప్రభుత్వ పరంగా తమకు రావాల్సిన అధికార బదలాయింపుల విషయంలో మాత్రం ఉన్నతాధికారులు కనీసం ద్రుష్టి సారించడం లేదనే విమర్శలు చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. అంతేకాకుండా వీరు ఉద్యోగస్థానంతో పాటు అధికారులు డిప్యుటేషన్, ఇన్చార్జి ఉద్యోగానికి సంబంధించిన వర్క్ టార్గెట్లపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారట.. అటు అధికారుల ఆదేశాలు పాటిస్తూ విధినిర్వహణలో అదనపు విధులు ఖచ్చితంగా నిర్వహిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు సచివాలయ ఉద్యోగులు. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో ఇన్చార్జి, లేదా డిప్యుటేషన్ విధులు నిర్వహించే వారికి ప్రభుత్వం అదనపు జీతం మంజూరు చేస్తుంటుంది. కానీ ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు ప్రొభేషన్ లోనే ఉన్నారు. వారికి వచ్చే ఆ రూ.15వేలు జీతంతోనే వారికి కేటాయించిన ఇన్చార్జి పోస్టుల బాధ్యతలు, రికార్డులు, ట్రాన్స్ పోర్టు ఇలా అన్నిరకాల ఆర్ధిక భారాలు పడాల్సి వస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా అదనపు విధులు చేద్దామన్నా చేతిలో కనీసం అధికారాలు పెట్టకుండా... తమ పరిధి తమకు అప్పగించకుండా.. అన్ని అధికారాలు.. రికార్డులు గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిల చేతుల్లోనే వుంచి వారి పనులు కూడా తమతోనే చేయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రెండవ శనివారం, ఆదివారాల్లో కనీసం సెలువులు వినియోగించుకోవడానికి వీలులేకుండా ఆరోజుల్లోనే కోవిడ్ వేక్సినేషన్ కు సైతం సచివాలయ ఉద్యోగులనే వినియోగించడం పట్ల ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు ఉద్యోగులంతా. అయితే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ కేలండర్ లో అయినా గ్రామ, వార్డు సచివాలయ మిగులు ఉద్యోగాలు భర్తీచేస్తే తమకు అదనపు పనిభారం తగ్గుతుందని ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూశారు. కానీ విచిత్రంగా సచివాలయాల్లో మిగులు ఉద్యోగాలు కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేయడంతో ఇన్చార్జి బాధ్యతలు చేస్తున్న సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల జిల్లా కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాల్లో డిప్యుటేషన్లు, ఇన్చార్జి బాధ్యతలు ప్రస్తుతం ఉన్న సచివాలయ ఉద్యోగులకు తొలగించాలని ఆదేశాలు జారీచేసినా..మండల, వార్డు స్థాయిల్లో మాత్రం సచివాలయ ఉద్యోగులతోనే జిల్లా అధికారులు వారితో అదనపు పనులు చేయిస్తున్నారని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో అదనపువిధులు, డిప్యుటేషన్లు, ఇన్చార్జిల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సి వుంది..!