ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి తక్కువ ధరలకు కేబుల్ టీవీతోపాటు, గ్రామ, వార్డు సచివాలయాలకు నాణ్యమైన వేగంతో కూడిన ఇంటర్నెట్ కనెక్షన్లు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఏపీ ఫైబర్ నెట్ కి రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వం అందించే ఏపీఫైబర్ నెట్ కనెక్షన్ లకు బదులు వారి సొంత నెట్వర్క్ కనెక్షన్లు వేసుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనితో 13జిల్లాల్లోని కేబుల్ నెట్ కోసం సుమారు 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వున్న 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాలకు కూడా ఇవే కనెక్షన్లు ద్వారా ఇంటర్నెట్ అందాల్సి వున్నా కేవలం కొన్ని చోట్ల మాత్రమే అందిస్తోంది. మిగిలిన చోట్ల ఉద్యోగులే వారి సొంత ఇంటర్నెట్ ను కూడా సచివాలయ సేవలకు వినియోగించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ వెబ్ సైట్ https://apsfl.in/ లో ప్రకటించినట్టుగా 100, 50, 30ఎంబీపీఎస్ వేగం అయితే ఎక్కడా రావడం లేదు. ఇక ఇళ్లకు వేసే కనెక్షన్లకు తరచుగా అవాంతరాలు ఎదురవుతున్నాయి. చంద్రబాబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా సక్రమంగా అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్లు సక్రమంగా వేయకపోవడంతో చాలా గ్రామాలకు నేటికీ స్థంబాలను ఏర్పాటు చేసి హెచ్టీ కేబుల్ వైర్లు రన్ చేసి కనెక్షన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో చెట్లు పడినపుడు, వర్షాలు వచ్చేటపుడు పిడుగులు పడుతున్న సమయంలో వైర్లు దెబ్బతింటున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కేబుల్ ఆపరేట్లర్ల మధ్య వున్న గొడవలన్నీ ఏపీఫైబర్ నెట్ మీద చూపిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల తోపాటు, ఇప్పటికే ఈ కనెక్షన్లు అందుబాటులో వున్న 5400 గ్రామాల్లో ప్రతీ మూడు రోజులకు ఇబ్బందులు వస్తూనే వున్నాయి. ఇక గ్రామ సచివాలయాల్లో అయితే కనీసం బయో మెట్రిక్ వేయడానికి కూడా నెట్ స్పీడ్ పెరగగక పోవడంతో ఉద్యోగులు వారి మొబైల్ నెట్ ని వినియగించి కార్యాలయ పనులు, బయోమెట్రిక్ అటెండెన్సు వేయాల్సి వస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరుగా కేబుల్ ఆపరేటర్లు ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్ రావడం లేదని ప్రచారం చేస్తూ కనెక్షన్లు వేయమన్నవారికి కనెక్షన్లు వేయడం లేదు. మరీ బలవంతం పెడితే.. వేసినా చాలా చోట్ల వారే అవాంతరాలు స్రుష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనితో ఇప్పటి వరకూ రాష్ట్రంలో కేవలం 9లక్షల 70వేల మందికి మాత్రమే ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు చేరాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా చోట్ల కేబుల్ ఆపరేటర్లు కూడా వారి కేబుల్ సెటప్ బాక్సులతో ఇంటర్నెట్ వ్యాపారం కూడా మొదలుపెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీనితో ఏపీఫైబర్ నెట్ ద్వారా ఆన్ లైన్ లో కనెక్షన్ కావాలని దరఖాస్తు చేసున్న లక్షల మందికి నేటికీ కనెక్షన్లు అందలేదు. దానికి కేబుల్ ఆపరేటర్లు చెప్పే ఒకే ఒక్క కారణం ప్రభుత్వం సెటప్ బాక్సులు సరఫరా చేయడం లేదని. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24వేల కిలోమీటర్ల పరిధిలో కేబుల్ ను నడిపింది ఏఫీఫైబర్ నెట్ సంస్త. ఇంటికి వేసుకునే ప్లాన్ల నుంచి కమర్షియల్ గా వేసుకునే ప్లాన్ల వరకూ ఏపీ ఫైబర్ నెట్ లో అతి తక్కువ రేట్లకు పథకాలున్నా అవి ప్రజల వద్దకు చేరడంలేదు.
కరోనా సమయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకోవడానికి సైతం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా కనెక్షన్లు ఇవ్వలేకపోయారు. చేసేది లేక వేల, లక్షల సంఖ్యలో సాఫ్ట్ ఇంజనీర్లు వర్క్ ఫ్రం హోమ్ పనులకు ప్రైవేటు ఇంటర్నెట్ సంస్థలనే ఆశ్రయించాల్సి వచ్చింది. వాస్తవానికి కరోనా సమయంలో ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు అందించి వుంటే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు, ఇటు ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీల ద్వారా అందించే ఆన్ లైన్ క్లాసులకు ఎంతో బాగా ఉపయోగపడేది. కానీ ప్రభుత్వం ఆ ఏర్పాట్లు చేయకపోడంతో విద్యార్ధులు ప్రైవేటు నెట్వర్క్ లను ఆశ్రయించాల్సి వచ్చింది. అటు ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో అందుతున్న ఏపీ ఫైబర్ నెట్ సేవలకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. కావాలనే కేబుల్ ఆపరేటర్లు కనెక్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే విషయాన్ని ఇటు అధికారులు కూడా గుర్తించారు. దీనితో కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నామని ఒక ఉన్నతాధికారి ఈఎన్ఎస్ చి చెప్పారు. కేవలం గ్రామాల్లోని కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యం వలన ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. వాటిని పరిష్కరించడంలో ఆపరేటర్లు చొరవ చేపడం లేదున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కేబుల్ నెట్వర్క్ కనెక్షన్లు 70శాతం వుంటే కేవలం ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు కేవలం 30శాతం మాత్రమే ఉన్నాయని అధికారిక లెక్కలే తెలియజేయడం విశేషం.
ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ నిరుపేదల ఇంటికి కేబుల్ లైన్ తో కూడిన ఇంటర్నెట్ అందించి ఆన్ లైన్ తరగతులు, ప్రత్యేక డిజిటల్ తరగతుల, మరికొందరికి వర్క్ ఫ్రం హోమ్, గ్రామణీ వ్యాపార సంస్తలకు ఇంటర్నెట్ చేరువ చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఏపీ ఫైబర్ నెట్ జంక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచే గ్రామం మొత్తం అన్ని కుటుంబాలకు, సంస్థలకు ఏపీఫైబర్ నెట్ ద్వారా కేబుల్ టీవీలతో, ఇంటర్నెట్ కనెక్షన్లు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానికోసం సచివాలయాల్లో టెక్నీషియన్లను నియమించాలా... అక్కడి నుంచి మళ్లీ కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యేక లింక్ ఏర్పాటు చేయాలా అనే కోణంలో ప్రభుత్వం యోచిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే కేబుల్ ఆపరేటర్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తే ఏపీఫైబర్ నెట్ సేవలు అందని విషయం ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం వీటి నిర్వహణను పంచాయతీలకు అప్పగించి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది. గ్రామానికొక టెక్నీషియన్ ను నియమించినా.. లేదంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్లనే ఈ ఏపీ ఫైబర్ నెట్ సేవలకు వినియోగించుకోవాలనేది కూడా ప్రభుత్వ ఆలోచన.. ఎలాగూ పంచాయతీలో ఉండే పారిశుధ్య సిబ్బందిని అత్యవసర సమయంలో ఈ కేబుల్ సేవలకు కూడా వినియోగించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. తద్వారా వేగంతో కూడిన నాణ్యమైన ఇంటర్నెట్ ప్రజలకు అందించడంతోపాటు ఆన్ క్లాసులకు, వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఉద్యోగాలు చేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు, గ్రామాల్లోని వ్యాపార సంస్థలకు ఇలా అన్నింటికీ కనెక్షన్లు ఇచ్చి సేవలందించడంతోపాటు, ఆదాయ మార్గాలను పెంచుకోవాలనే ప్రభుత్వ ఆలోచన. అదే జరిగితే రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేబుల్ వ్యవస్థ ఏపీ ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసేందుకు వేసే ఎత్తులన్నీ చిత్తవడంతోపాటు, ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటర్నట్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి..!