ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని లక్షా 20వేల మంది ఉద్యోగాలను అక్టోబరు 2 తరువాత రెగ్యులర్ చేస్తే ఖజానాపై నెలకు రూ.300 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుంది. అదీ ప్రభుత్వం సచివాల ఉద్యోగులకు నియామక ఉత్తర్వుల్లో 2015 పీఆర్సీ నిబంధనలకు లోబడి ఇచ్చిన పేస్కేలు ఆధారంగా.. అదే ప్రొబేషన్ పూర్తైన సచివాలయ ఉద్యోగులకు క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పెట్టి అందులో పాసైన వారికే ప్రభుత్వం ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని బావించింది. అలా చూసుకుంటే ఎంత మంది పాసవుతారో ప్రస్తుత పరిస్థితిలో చెప్పలేనివిధంగా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగంలోనైనా నియామక సమయంలో ప్రభుత్వం నిర్ధేశించిన పేస్కేలు మొత్తం అమలు చేసి జీతాలు ఇస్తారు. కానీ ప్రొబేషన్ మాత్రం రెండేళ్ల తరువాతే చేస్తారు. ఆ రకంగా చూసుకున్నా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు లక్షకు పైగా చేరడంతో ప్రభుత్వం వీరికి రూ.15వేలు జీతమనే లక్ష్మణ రేఖ పెట్టింది. ఈ నిబంధనకు లోబడి ఉద్యోగాల్లో చేరినందుకు ఒక్కో సచివాలయ ఉద్యోగి రెండేళ్లలో కోల్పోయిన జీతం రూ.2.40లక్షలు(ప్రస్తుత పేస్కేలు ఆధారంగా రమారమీ రూ.25వేలు జీతం వస్తే). ఈ మొత్తం జీతం పోయినా రెండేళ్ల తరువాత ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయనుకున్న ఉద్యోగులకు ప్రభుత్వ ప్రకటన గుండెళ్లో రాయిపడేసినంత పనిచేసింది. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు చేస్తున్న ఉద్యోగం గ్రూప్-4 కేడర్ ఉద్యోగమే అయినా వీరందరికీ క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పాస్ కావాలంటే ఇచ్చిన సిలబస్ మాత్రం గ్రూప్-1 సిలబస్ ను తలపించేదిగా ఉందని ఉద్యోగులు భయపడిపోతున్నారు.
ప్రభుత్వం ఇంతస్థాయిలో సిలబస్ ఇచ్చే ఆలోచన ఉంటే ఈ రెండేళ్లలో ఈ తరహా ఉద్యోగం ఎప్పుడైనా పెట్టి ఉండవచ్చునని, ఉద్యోగులందరికీ ఈ పరీక్ష పాస్ కాకపోతే ప్రొబేషన్ పూర్తవదనే నిబంధన అప్పుడే పెట్టి ఉంటే ఈ రెండేళ్లలో అందరు ఉద్యోగులం పాస్ అయ్యేవారమని.. ఇపుడు ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని అంతా ఆశగా ఎదరుచూసే సమయానికి క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పాసైతేనే ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని.. అపుడు మాత్రమే పేస్కేలు వర్తిస్తుందని చెప్పడం పద్దతి కాదని ఉద్యోగులంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 20వేల మంది ఉద్యోగులం పనిచేస్తున్నామని.. తమకు ఇచ్చే రూ. 15వేల జీతంలో కేవలం రూ.180 కోట్ల రూపాయలు నెలకు ప్రభుత్వానికి అవుతుందని.. మా సర్వీసులు రెగ్యులర్ చేస్తే ఉన్నపళంగా ప్రభుత్వంపై రూ.300 కోట్లు భారం పడుతుందనే కారణంతోనే ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు ఈ ప్రత్యేక పరీక్ష విధానాన్ని ప్రభుత్వం ముడిపెట్టి తెరపైకి తీసుకొచ్చిందని ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఉద్యోగంలోనైనా ఈ తరహా పరీక్షలు ఉంటాయని చెబుతున్న ప్రభుత్వ సలహాదారులు ఈ విషయాన్ని ఉద్యోగాల్లో చేరే సమయంలో ఎందుకు ప్రకటించలేదని, ఈ రెండేళ్లలో ఈ పరీక్ష పెడితే మొత్తం ఉద్యోగులమంతా పాస్ అయి ఉద్యోగాల రెగ్యులరైజేషన్ లైన్ క్లియర్ అయ్యేది కదాని ప్రశ్నిస్తున్నారు. అలాకాకుండా ఇప్పటిప్పుడు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి చాంతాండంత సిలబస్ ఇచ్చీ.. తూతూ మంత్రంగా ఉద్యోగంలో చేరినపు శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ప్రత్యేక ప్రవేశ పరీక్ష విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యే 3 నెలల సమాయానికి ముందు ప్రత్యేక పరీక్షను తీసుకురావడం భావ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ఆధారంగా ప్రవేశ పెడితే కనీసం రాష్ట్రవ్యాప్తంగా 50శాతం ఉద్యోగులు కూడా పాసయ్యే అవకాశం లేదని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఏడాది ఒక్కసారే పెడితే పరీక్ష పాస్ కాని వారంతా మరో ఏడాది పాటు రూ.15వేల జీతంతోనే ఉద్యోగాలు ఏ విధంగా చేయాలో ప్రభుత్వమే చెప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక పరీక్ష 6నెలలకు ఒకసారి, ఏడాది ఒకసారి లేదంటే రెండేళ్లకు ఒకసారి పెడుతుందా అనే విషయం కూడా ప్రభుత్వం నేటికీ క్లారిటీ ఇవ్వకపోవడం ఉద్యోగుల ఆందోళన మరింత పెంచుతున్నది. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని గ్రామస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసినందకు ఆనందించామని.. ఈ వ్యవస్థలో తొలి ఉద్యోగాలు చేస్తున్నందకు గర్వపడ్డామని.. తమ ఆనందం మొత్తం ప్రత్యేక ప్రవేశ పరీక్షనెపంతో ప్రభుత్వం నీరుగార్చేయడం అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. రెండు దశల్లో కరోనా వైరస్ వచ్చినపుడు సచివాలయ ఉద్యోగుల విధులకు కనీసం రెగ్యులర్ ఉద్యోగులకి ఇచ్చిన వెసులు బాటు కూడా ఇవ్వకుండా విధులు నిర్వహించేలా చేశారని.. తామంతా కూడా ప్రజలకు సేవచేసే భాగ్యం వచ్చిందన్నట్టుగా రెండవ శనివారాలు, ఆదివారాలు అనే తేడా లేకుండా సెలవులు కూడా తీసుకోకుండా అధనపు విధులు నిర్వర్తించినందుకు ప్రభుత్వం ఈ స్థాయిలో గుర్తిస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ కన్నీరు మున్నీరవుతున్నారు ఉద్యోగులంతా. ప్రాణాలకు తెగించి అదనపు విధులు చేసినందుకు గుర్తుగా సర్వీసు రెగ్యులర్ అయ్యేంత వరకూ రూ.15వేలకే ఏళ్ల తరబడి పనిచేయించుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఏ రాష్ట్రప్రభుత్వమూ పెట్టని నిబంధన రూ.15వేలకే ఉద్యోగం చేయడమే పెట్టి.. అదే జీతం తమ ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యేంత వరకూ ఇచ్చి తమ ముందు కొండం సిలబస్ పెట్టి ఎప్పటికీ పాస్ కాకుండా చేద్దామనే కుటిల బుద్ధితోనే ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక ఆరునెలలు, లేదా ఏడాది ముందు ఈ విషయం చెప్పినా.. సిలబస్ విడుదల చేసినా శిక్షణ పొందడానికి, సిలబస్ మొత్తం చదువుకోవడానికి వీలుండేదని.. ఆఖరి సమయంలో ఇంత పెద్ద సిలబస్ ఇస్తే ఎలాగూ వీరు పాసవరని.. ప్రభుత్వంపై పడే భారాన్ని తగ్గించుకోవడానికే ఈ విధంగా ప్లాన్ చేశారని ఇటు విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. అందులోనూ వయస్సు మళ్లిన(45ఏళ్లు దాటిన వారు) సుమారు రాష్ట్రవ్యాప్తంగా 20 నుంచి 30వేలకు పైగా ఉద్యోగులం ఉన్నామని, ఈ వయస్సులో తాము ఈ సిలబస్ ఎప్పటికి చదివి..మరెప్పటికీ పాసవుతామో తెలియడం లేదని వాపోతున్నారు. దీనితో ఇప్పటి వరకూ ప్రభుత్వంపై ఎంతో గౌరవం పెంచుకున్న సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినట్టుగానే రెండు రోజుల నుంచి సంకేతాలు అందతున్నాయి.. అంతేకాదు ఇంత కష్టపడి పనిచేసినందుకు ఇదా ప్రభుత్వం తమకిచ్చే గౌరవమంటూ.. ఉద్యోగ సంఘాల సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో రోజూ చర్చలు జరుగేంత స్థాయికి చేరుకున్నారు. ఇదే కొనసాగితే ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులు పూర్తిస్థాయిలో వ్యతిరేకమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోట్లాది రూపాయిలు సంక్షేమ పథకాలు పేదలకు అందించామని.. తెల్లవారు జామున 5గంటలకే వెళ్లి పించన్లు ఇచ్చినందుకు గుర్తుగా తమకి ప్రభుత్వం చాలా బాగా గుర్తించిందంటూ తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. చూడాలి ప్రభుత్వ చర్యలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల విషయంలో రెగ్యులైజేషన్ పై ఏ నిర్ణయం తీసుకుంటుందో..!