రుణాలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసుకునే క్రమంలో పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందనే ప్రచారం అవాస్తవమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ స్ధితిగతులను వివరించేందుకు బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి సమాచార శాఖా కమిషనరు టి.విజయకుమార్‌రెడ్డితో కలిసి విజయవాడలోని ఆర్ అండ్ బి భవన సముదాయంలో మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణ దువ్వూరి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి అప్పుల విధానంపై ప్రతిపక్ష పార్టీలు, కొన్ని మీడియా సంస్ధలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తలసరి ఆదాయం ఏపికి వనరులు జనాభాతో పోలిస్తే సగం మాత్రమేనన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై వక్రీకరించి ప్రజలను తప్పుదోవపట్టించేలా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఇటువంటి చర్యల వలన ఆర్ధిక సంస్ధలను కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించడమేనన్నారు. ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసుకునేందుకు రుణాలు తీసుకోవడం ఎ ప్పటినుండో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానమని దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదేవిధానాన్ని అనుసరిస్తున్నాయని ఈవిషయాన్ని ప్రతిపక్షాలు గుర్తెరెగాలని అన్నారు.
ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం రుణం 17.15 శాతంమేర పెరిగితే రాష్ట్ర ప్రభుత్వ రుణం 15.26 శాతం మాత్రమే పెరిగిందని ఆయన వివరించారు. రాష్ట్ర విభజననాటికేమన రాష్ట్రంపై ఎ న్నో వేల కోట్ల రూపాయలు రుణం ఉందని దీనికి తోడు గత ప్రభుత్వం కూడా వేల కోట్ల రూపాయలను రుణం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రం తీసుకున్న రుణం విపరీతంగా పెరిగి పోయిందన్నారు. విభజన తర్వాత ఏపికి రూ. 97 వేల 102 కోట్లు అప్పు మిగలగా, ఐదేళ్లలో రూ. 2 లక్షల 68 వేల 225 కోట్ల రూపాయలకు పెరిగిపోయిందన్నారు. 2021 మార్చి నాటికి రాష్ట్ర అప్పు రూ. 3 లక్షల 56 వేల 172 కోట్లకు చేరిందని ఆయన అన్నారు. 2016-17, 2017-18, 2018-19 ఆర్ధిక సంవత్సరాలలో అప్పటి ప్రభుత్వం రూ. 16 వేల కోట్ల మేర పరిమితికి మించి అప్పులు చేసింది వాస్తవం కాదా అన్నారు. విభజన నాటికి రూ. 14 వేల కోట్లు ఉన్న అప్పులు గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 2019 మార్చి నాటికి రూ. 39 వేల కోట్ల రూపాయలకు పెరిగిందని, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ క్రింద రూ. 58 వేల కోట్లుగా ఉందని ఆయన అన్నారు. విద్యుత్తు ఉత్పాదనకు సంబంధించి వ్యయం 2014లో రూ. 2893 కోట్లు ఉండగా, గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 2019 నాటికి రూ. 21540 కోట్లుగా ఉందన్నారు.
ఈపరిస్ధితుల్లో 2019లో అధికారం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసి పెట్టుబడులు తీసుకురావడంతోపాటు ప్రజల జీవన అవసరాలు మెరుగుచేసే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు రుణాలను తీసుకోవడం జరిగిందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అనూహ్యంగా రాష్ట్ర ఆర్ధిక స్ధితిగతులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. 2020-21లో రూ. 7780 కోట్లు కేంద్ర పన్నుల వాటాలో నష్టం, రాష్ట్ర పన్నుల్లో రూ. 7 వేల కోట్లు నష్టం, కోవిడ్ వ్యయం రూ. 8 వేల కోట్ల రూపాయలతో కలిపి మొత్తం రూ. 24 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడిందన్నారు. ఈపరిస్ధితుల్లో అప్పుచేయడం తప్పని పరిస్ధితిగా మారిపోయిందన్నారు. అప్పులు పెరగలేదని తమ ప్రభుత్వం చెప్పడం లేదని ప్రజలకు మేలు చేయాలన్నదే ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహనరెడ్డి పాలనా లక్ష్యమన్నారు. ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుని ఒక్క సంక్షేమ పధకం కూడా ఆగకుండా సమయానికి లబ్దిదారులకు ఖాతాలలో సొమ్ము జమచేయడమే ఇందుకు నిదర్శనం అని ఆయన అన్నారు. తీసుకున్న రుణంలో ఏఒక్క రూపాయి వృధాచేయ లేదని, పారదర్శకంగా అభివృద్ధికి ఖర్చు చెెస్తున్నామని ఇంతవరకూ రూ. లక్ష కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పధకాల క్రింద నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి అన్నారు.