ఇక న్యాయపోరాటంతోనే సర్వీస్ రెగ్యులర్..


Ens Balu
19
Tadepalle
2021-07-30 01:57:29

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసును కోర్టును ఆశ్రయించి సాధించుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేపట్టినపుడు కనీసం మూడు నెలలు కూడా శాఖ పరమైన శిక్షణ ఇవ్వకుండా ఇపుడు ఏకంగా గ్రూప్-1 స్థాయిని తలపించేంత సిలబస్ ఇచ్చి ప్రొబేషన్ పూర్తైన సచివాలయ ఉద్యోగులకు క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పెట్టి అందులో పాసైన వారికే ప్రభుత్వం ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని చూస్తుంది ప్రభుత్వం. దీనితో ఇప్పటికే ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి నియామకాల్లో విడుల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా కాకుండా ప్రత్యేకంగా పరీక్ష పెట్టడానికి వీరితోపాటు అన్ని సుమారు 16 కేటగిరీల్లోని సచివాలయ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. అందునా రెండేళ్లు పాటు పరీక్షలు పెట్టకుండా కేవలంల అక్టోబరు 2 నాటికి రెండేళ్లు ప్రొబేషన్ కాలం పూర్తవుతుందనగా కొండంత సిలబస్ ఇచ్చి ఇపుడు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుందని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు లేకుండా జీఓనెంబరు2 ద్వారా వీఆర్వోలకు అధికారాలు కట్టబెట్టడం, పంచాయతీరాజ్ చట్టాన్ని, ఆర్టికల్ 73కు వ్యతిరేకంగా డిడిఓ అధికారాలు వీఆర్వోలకు బదలాయించిన విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 అంతేకాకుండా జీఓనెంబరు 149ని అమలు చేయకుండా గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల వద్దే పంచాయతీల్లో అధికారాలు ఉంచేసింది ప్రభుత్వం. ఈ విషయంలో ఎన్నిసార్లు గ్రేడ్-5 కార్యదర్శిలు ఎందరు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇపుడు ఇదే సమయంలో ఇపుడు సచివాలయ ఉద్యోగులందరికీ ఒకేసారి ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తే సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా భారం పడుతుందనే ఉద్దేశ్యంతో సచివాలయ ఉద్యోగులకు క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష అది పాసైతేనే సర్వీసు రెగ్యులర్ చేస్తామని లేదంటే ప్రొబేషన్ మరికొంత కాలం పెంచుతామని..ఉద్యోగాలు మాత్రం తీయని చేసిన ప్రభుత్వ ప్రకటన ఉద్యోగుల్లో ఆగ్రహ జ్వాలలను రేకిత్తిస్తోంది. ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో లేనివిధంగా కేవలం రూ.15వేల జీతంతో రెండేళ్లు పనిచేయించుకొని, ఇపుడు ప్రభుత్వం ఈ విధంగా మాట మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క గ్రామ విద్యా, సంక్షేమ సహాయకులకు సైతం ఈ ఉద్యోగం తరువాత వీరికి ఏ విధంగా ప్రమోషన్లు ఇస్తాయో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఇదే విషయాన్ని ఇటు వారు కూడా సామాజిక మాద్యమాల్లో ప్రభుత్వానికి దాఖలైన సమాచార హక్కచట్టం దరఖాస్తుకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారాన్ని తెలియజేస్తున్నారు. 

మరోపక్క మహిళా పోలీసులు సైతం డిగ్రీ చదువుకున్న తమను సాధారణ పోలీస్ కానిస్టేబుళ్లుగా ప్రభుత్వం గుర్తించి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఇస్తామని జీఓనెంబరు 59 ద్వారా ప్రకటించడంతో వారు కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉన్నత విద్య ఉన్న తమకు ఎస్ఐగా ప్రమోషన్లు ఇవ్వాలని వీరంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అటు అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్, ఫిషరీష్,  యానిమల్ హజ్బండరీ సహాయకులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సైతం ఈ ఉద్యోగం తరువాత ఏ స్థాయి ప్రమోన్ ఇస్తారో వారికి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు.  ఇలా గ్రామ, వార్డు సచివాలయ శాఖల్లోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ,వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న లక్షా 20వేల మంది ఉద్యోగులు భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. ప్రభుత్వం పెడతామన్న పరీక్ష పాస్ కాకపోతే మరో ఏడాది పాటు రూ.15వేల జీతంతో ఎలా బతకాలనీ.. నిత్యవసర సరకుల ధరలు అమాంతంగా పెరిగిన సమయంలో వచ్చే జీతమే ఎటూ చాలడం లేదని ఉద్యోగులంతా గగ్గోలు పెడుతున్నారు. తమతో రెండవ శనివారాలు, ఆదివారాలు కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా పనులు చేయించుకుని ఇపుడు తీరా ఉద్యోగాలు రెగ్యులర్ చేసే సమయానికి కొత్త కొత్త నిబంధనలు తెరపైకి తీసుకు వస్తున్నారని ఉద్యోగులంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఇన్ని ఇబ్బందులు నడుమ తమ ఉద్యోగాలు రాజమార్గంలో రెగ్యులర్ కావాలన్నా..భవిష్యత్తులో ప్రభుత్వం ప్రత్యేక పరీక్ష పాసవ్వాలనే మెలిక పోవాలన్నా.. పేస్కేలు అమలై జీతం పెరగాలన్నా న్యాయస్థానం ఒక్కటే సరైన మార్గమని భావించి ఆదిశగా అన్నిశాఖల ఉద్యోగులు కోర్టు ఆశ్రయించాలని, దానికోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, ఆ తరువాత వచ్చిన జీఓలు, గెజిట్ నోటిఫికేషన్ ఆర్డర్లు, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వమే ఇచ్చిన అధికారక సమాధానాలు, ఇప్పటి వరకూ తమ ఉద్యోగాల్లో కోల్పోయిన పేస్కేలులోని మొత్తం, ప్రభుత్వం పెట్టబోయే పరీక్ష కాకపోతే మరో ఏడాది పాటు కోల్పేయే జీతం ఇలా అన్ని అధారాలను కోర్టు ముందుంచి న్యాయం కోరాలని చూస్తున్నారట. అటు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు 8 డిఏలు, ఒక పీఆర్సీ అమలు చేయలేదు. వారికి సిపిఎస్ కూడా రద్దు చేయలేదు. ఇపుడు వారి జాబితాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేరనున్నారు. వీరంతా ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినా.. సహకారం అందించకపోయినా భారీ స్థాయిలో ప్రభుత్వం వీరి నుంచి మద్దతు కోల్పోపోయే ప్రమాదం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాడు టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన తప్పులు, ఉద్యోగుల డిమాండ్ల పట్ల నిర్లక్ష్యం కంటే.. నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అంతకంటే తప్పులు చేసే దిశగా పయనిస్తుందని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం ఏవిధమైన నిర్ణయం తీసుకుంటోందోనని అంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు 40 మంది ఉన్న సలహాదారుల్లో ఒక్కరు కూడా ఈ ఉద్యోగుల విషయంలో సీఎంకు సరైన సలహాలు ఇవ్వకపోగా, ఉద్యోగ వ్యతిరేక విధానాలనే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాటినే ఇపుడు ఉద్యోగుల సామాజిక మాద్యమ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందనేది..!