సంక్షేమ సహాయకులకు పదోన్నతులు లేవు..


Ens Balu
13
Tadepalli
2021-07-31 01:41:33

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ శాఖలో పనిచేసే ఉద్యోగికైనా సర్వీసులో పదోన్నతులు ఉంటాయి..విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్యా సంక్షేమ సహాయకులకు మాత్రం వారి ఉద్యోగాల్లో మాత్రం పదోన్నతులు లేవట. ఇదే ఎవరో అన్నమాట కాదు. సాక్షాత్తూ.. ప్రభుత్వమే ఈ విషయాన్ని సమాచార హక్కుచట్టం దరఖాస్తుపై ఇచ్చిన క్లారిటీ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న విద్యా, సంక్షేమ సహాయకులకు ఇప్పటి వరకూ పదోన్నతులపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని, దానిపై ఇప్పటి వరకూ సర్వీస్ రూల్స్ పై దానికోసం నిర్ధేశాలు జారీ చేయలేదని, కనీసం డిపార్ట్ మెంటల్ టెస్టులు కూడా పెట్టలేదని, దానికి సంబంధించిన కారణాలను కూడా పొందు పరచలేదనే విషయాన్ని పేర్కొంది. అయితే ఈ సమాచారం ఇప్పటిది కాదు.. 30-09-2020న కర్నూలుకి చెందిన కె.శ్రీరాములు అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకి  సంక్షేమశాఖ డైరెక్టర్ కె.హర్షవర్దన్ 30-09-2020న ఇచ్చిన సమాధానం. ఇదెందుకు మీకు ఇపుడు గుర్తొచ్చిందనే అనుమానం కూడా ఈ వార్త చదువుతున్న వారికి రావొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులను నిబంధనలకు లోబడి రెండేళ్లు పూర్తికావస్తొన్న సందర్భంగా.. క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పెట్టి అందులో పాసైన వారికే ప్రభుత్వం ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని ప్రకటించింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా ఆందోళన చేస్తున్న వేళ ఈ ఆర్టీఐ సమాచారం కూడా ఉద్యోగుల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అలాగని నాటి నుంచి నేటి వరకూ విద్యా సంక్షేమ సహాయకుల పదోన్నతుల విషయమై ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీనితో రెండేళ్లు గడుస్తున్నా తమ ఉద్యోగాల్లో పదోన్నతులపై సరైన వివరణ ఇవ్వని ప్రభుత్వం.. టంచనుగా ప్రొబేషన్ పూర్తైన తమకు క్రెడిట్ బేస్డ్ అసెస్ మెంట్ సిస్టం(సిబీఏసి) పరీపరీక్ష పెట్టడానికి సిద్ధమైపోయిందని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశేషం ఏంటంటే ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ విద్యా, సంక్షేమ సహాయకుల ఉద్యోగులను సచివాలయాల్లో నియమించేందుకు బిసీవెల్ఫేర్, ఎస్సీవెల్ఫేర్, మైనార్టీవెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇలా నాగు శాఖల ఉద్యోగాలను కలిపి తమ ఒక్క శాఖగా మార్చేసిందని.. తద్వారా ఇక్కడ మూడు శాఖల్లో ఉద్యోగాలు కూడా రద్దైనట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇన్నిచేసి, తమకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం రెండేళ్ల సమయంలో సర్వీస్ రూల్స్ ని మాత్రం తయారు చేయలేదని, అలాగని పదోన్నతుల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతీ నిరుపేద కుటుంబాలకు అందించే తమ ఉద్యోగాలు, పదోన్నతులపై క్లారిటీ లేకపోతే తాము జీవితాంతం ఈ ఉద్యోగమే సచివాలయాల్లోనే చేయాలా.. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా తమకు ఎలాంటి పదోన్నతులు ఉండవా, ఇదెక్కడి ప్రభుత్వ ఉద్యోగమో తమకు తెలియడం లేదని అంతా తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని లక్షా 20 వేల మంది ఉద్యోగాల్లో కొన్ని శాఖలకే ప్రభుత్వం సర్వీస్ రూల్స్, గెజిట్ నోటిఫికేషన్(రాజపత్రం) విడుదల చేసిందని, తమ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీచేయపోవడంతో తాము ఏ ప్రభుత్వశాఖకు చెందుతామో మాకే అర్ధం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాగని సచివాలయాల్లోనైనా అన్ని వసతులు ఉన్నాయా అంటే అదీలేదని, కనీసం ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో సొంత మొబైల్ ఇంటర్నెట్, తమ కంప్యూటర్లతోనే పనులు చేస్తూ ప్రజలకు సేవలు చేయాల్సి వస్తుందని విద్యా, సంక్షేమ సహాయకులు కన్నీరు మున్నీరవుతున్నారు.  ఈ సమయంలో చాంతాడంత సిలబస్ సర్వీసు రెగ్యులర్ చేయడానికి మూడు నెలల ముందు ఇచ్చి దీని ద్వారా ప్రభుత్వం పెట్టే పరీక్ష పాసవ్వాలని.. లేదంటే ప్రస్తుతం ఉన్న రూ.15 వేల జీతంతోనే మళ్లీ పరీక్ష పెట్టే వరకూ పనిచేయాలని నిబంధన పెట్టడం ఎంతవరకూ సమంజసమని వీరంతా ప్రశ్నిస్తున్నారు.

రెండేళ్లు గడస్తున్నా నేటికీ ప్రతీ చిన్న పనికీ పంచాయతీలపైనే ఆధార పడాల్సి వస్తుందని, సచివాలయాలు ఏర్పాటు చేసినా వాటికి స్వయం పతిపత్తి లేదని, కనీసం పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి ఇచ్చిన జీఓనెంబరు 149ని అమలు చేయడం ద్వారా గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు, పరిపాలన అనుమతులు ఇస్తే కనీసం కాస్తైనా సౌలభ్యంగా వుంటుందని వీరంతా వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10వేల గ్రామ పంచాయతీల్లో గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలు 1852, గ్రేడ్-2లో 703, గ్రేడ్-3లో 1679, గ్రేడ్-4లో 2907 మంది పనిచేస్తున్నారని వీరంతా చెబుతున్నారు. అందులో ఒక్కో  సీనియర్ కార్యదర్శికి రెండు మూడు పంచాయతీలు ఇన్చార్జిలు, డిప్యూటేషన్లు వేయడంతో కనీస అవసరాలు కూడా వారంతా వచ్చేంత వరకూ తీరడం లేదని, ఒక్కో సారి అత్యవసర సమయంలో తమ సొంత డబ్బులే పెట్టుకొని పనులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. అలాగని చేసిన పనులకు, ఖర్చుకి తిరిగి పంచాయతీల నుంచి వస్తున్నాయా అంటే అదీలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా అధికారాలు ఇస్తే కనీసం నిత్యం తమకు అందుబాటులో ఉండే వారి ద్వారానైనా పనులు జరుగుతాయంటే.. దానిని కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై గ్రేడ్-5 కార్యదర్శిలను ప్రశ్నిస్తే.. ప్రభుత్వం ఏవిధంగా పనిచేయమంటే తాము ఆవిధంగా పనిచేయాలని, ఇప్పటికే తాము కూడా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎక్కడా కనీసం ఫలితం కూడా రావడం లేదని చెబుతున్నారని విద్యా, సంక్షేమ సహాయకులు వాపోతున్నారు.

2019 అక్టోబర్ 2న ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నేటికీ ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఏఏ ఉద్యోగులు ఏఏ శాఖల కిందకు వస్తారు. వారికి ఎలాంటి పదోన్నతులు ఉంటాయి, వారు ఎవరికీ జవాబుదారీ, కొన్ని ఉద్యోగాలకే గెజిట్లు(రాజపత్రం) విడుదల చేసి, మిగిలిన శాఖల ఉద్యోగుల కోసం ఎందుకు రాజపత్రాలు విడుదల చేయలేదు, అసలు వీరి ఉద్యోగాలు ఎప్పటికి రెగ్యులర్ అవుతాయో కూడా సరైన క్లారిటీ ఇవ్వడంలో నేటికీ ప్రభుత్వంలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ నుంచి అనుబంధ శాఖల నుంచి కూడా క్లారిటీ రాలేదు. దీనితో తమ ఉద్యోగాలు జీవితాంతం రూ.15వేలు జీతంతోనే అరకొర వసతులతోనే పనిచేయాలేమో అనుమా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో వీరి ఆందోళన తారాస్థాయికి చేరుకోవడంతో గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని వివిధ శాఖల ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో జరిగే సంభాషనలు ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేస్తున్నాయానే అనే అనుమానాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జూలై నెల పూర్తైపోయింది..ఇక మిగిలింది ఆగస్టు, సెప్టెంబరు, నెలలు మాత్రమే. అక్టోబరు 2నాటికి ఎంత మంది వార్డు, సచివాలయ ఉద్యోగుల ఉద్యోగాలు సర్వీసులను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందో.. అదే సమయంలో సంక్షేమ, విద్యా సహాయకుల ఉద్యోగాలకు పదోన్నతులపైనైనా మార్గనిర్ధేశకాలు ఇస్తుందో.. అవేమీ చేయకుండా.. ఖజానాపై సుమారు 300 కోట్లకు పైనే భారం పడుతుందని, వీరి సర్వీసుని మరో రెండేళ్లు ఇదే జీతానికి పనిచేసేలా అడుగుడుగునా ప్రత్యేక పరీక్షల పేరుతో మరికొంత కాలం కాలయాపన చేస్తుందా అనేది తేలాల్సి వుంది..!