సచివాలయాలున్నా.. మీ-సేవాలదే హవా..
Ens Balu
19
Tadepalle
2021-08-01 06:43:33
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల ను ఏర్పాటుచేసి అందులో 745 సర్వీసులను అందుబాటులోకి తెచ్చినా నేటికీ మీ-సేవ సర్వీసులదే అగ్ర తాంబూలాన్ని అందుకుంటున్నాయి.. విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మీసేవా కేంద్రాల్లో 62వేల దరఖాస్తులకు ద్రువీకరణ పత్రాలు ఇస్తే సచివాలయాల్లో కేవలం 21 వేల దరఖాస్తులకు కేవలం 18వేల ద్రువీకరణ పత్రాలు మాత్రమే జారీచేశారు. ఈ సంఖ్య తూర్పుగోదావరి జిల్లాలోని ఓ మండలంలోనిది. ఆధారాలు లేకుండా చెబుతున్న సంఖ్య కాదు, అధికారికంగా తహశీల్దార్ లాగిన్ ద్వారా విడుదల చేసిన సంఖ్య. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తూర్పుగోదావరి రెండవ అత్యధి మండలాలున్న జిల్లాగా ఉంది(64). ఈ జిల్లాలోని ఒక్క మండలంలోనే 16 గ్రామ సచివాలయాలున్నచోట మీసేవా కేంద్రాలు అంతభారీ సంఖ్యలో ద్రువీకరణ పత్రాలు మంజూరు చేశాయంటే..ఇక జిల్లావ్యాప్తంగా ఎన్ని వేలు, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని లక్షల ద్రువీకరణ పత్రాలు మంజూరు చేశారో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి గ్రామసచివాలయాలు వచ్చిన తరువాత మీ-సేవ సర్వీసుల సంఖ్య తగ్గాలి. కానీ దానికి విరుద్దంగా సచివాలయాల్లో అత్యల్పంగా సర్వీసులు అందుబాటులోకి వస్తే.. మీ-సేవల ద్వారా సచివాలయాల కంటే నాలుగింతలు ద్రువీకరణ పత్రాలు మంజూరు చేయగలుగుతున్నాయి.
ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం చేసిన తప్పిదమే కనిపిస్తుంది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం అన్ని గ్రామ సచివాలయాల్లో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను నియమించింది. వారిని నియమించి 20నెలలు గడుస్తున్నా వారికి చట్టబద్ధంగా జీఓనెంబరు 149 ద్వారా కట్టబెట్టాల్సిన అధికారాలు, బాధ్యతలు ఇవ్వలేదు. అధికారాలు చేతిలో ఏమీ లేకపోవడంతో గ్రేడ్-5 కార్యదర్శిలు కూడా మిన్నకుండిపోయారు. అధికారాలు ఇవ్వకుండా తాము ఎలా పనిచేయాలో తెలియడం లేదని సమాధానం చెబుతున్నారు. తద్వారా ప్రభుత్వం అక్షరాల కోల్పోయిన ఆదాయం చూసుకుంటే కోట్ల రూపాయల్లోనే ఉంది. అటు ప్రభుత్వం కూడా సేవలైతే అందుబాటులోకి తెచ్చింది గానీ, ఆయా ప్రభుత్వశాఖలకు మీసేవాలను అనుసంధానం మాత్రం చేయలేదు. దీనితో ఏ సేవ కోసం సచివాయాలకు వచ్చినా ప్రజలకు ఇక్కడ ప్రస్తుతం ఆ సేవలు అందుబాటులో లేవనే సమాధానమే వచ్చేది. ఇక్కడలేని సేవలు మీ-సేవలోనే ఉంటాయని భావించి అందరూ అక్కడి నుంచే వివిధ రకాల ద్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. నాటి నుంచి నేటి వరకూ సచివాలయాల్లో అందించే సేవలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో నేటికీ అత్యవసర పనులకు వారంతా మీ-సేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. అలా రాష్ట్రంలో మీసేవా కేంద్రాలు 60శాతం సర్వీసు రిక్వెస్టులకు ద్రువీకరణ పత్రాలు మంజూరు చేయగలిగితే.. కేవలం రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాలు కేవలం 40శాతం ఒక్కోసారి తక్కువగా 30 శాతం కూడా కొన్ని జిల్లాల్లో సర్వీసులు మాత్రమే ఇస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
వాస్తవానికి గ్రామవాలంటీర్లు, 12శాఖల సిబ్బందితో పూర్తిస్థాయిలో సేవలు అందించే సచివాలయాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149 ద్వారా అధికారాలు కట్టబెట్టగలిగితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగేది. కేవలం పంతానికి పోయి, ఆ అధికారాలన్నింటినీ గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల చేతిలోనే ఉంచేయడంతో వీరి ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు అందకుండా పోయాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. సీనియర్ పంచాయతీ కార్యదర్శిలకు ఒక్కొక్కరికీ రెండు నుంచి మూడు పంచాయతీలు ఇన్జార్జి బాధ్యలు, డిప్యూటేషన్లు అప్పగించడం, ప్రధాన సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి అందుబాటులోకి లేకపోవడంతో సచివాలయం నుంచి అందించే సేవలు ఏ రకంగా ప్రజలకు అందుతున్నాయో తెలుసుకోలేని పరిస్థితి. మిగిలిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు సచివాలయాల్లోనే ఉన్నా..వారికి అధికారాలు ఇవ్వకపోవడంతో.. తమని ప్రభుత్వం ఏ తరహా పనులు పురమాయించిందో అవే పనుల్లో వారు నిమగ్నం అయిపోతున్నారు. ఈ తరుణంలో సచివాలయాలకు రావాల్సిన సర్వీసు రిక్వెస్టులన్నీ మీ-సేవా కేంద్రాలకు తరలిపోతున్నాయి.
ఇలా ప్రభుత్వానికి కోట్ల రూపాయాల్లో ఆదాయం పోతుండటమే కాకుండా, అసలు సచివాలయాల్లో ఎన్ని సేవలు అందుతున్నాయో కూడా ప్రజలకు అవగాహన కలగడం లేదు. ఇదే విషయాన్ని గ్రేడ్-5 కార్యదర్శిలు మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో డీపీఓ, కలెక్టర్, రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రాలు సమర్పించినా జీఓనెంబరు 149పై ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనితో అధికారం ఇవ్వకుండా తామెలా పనిచేయగలమంటూ వారు కూడా ప్రభుత్వాన్నిప్రశ్నిస్తున్నారు. ఫలితంగా సచివాలయాలకు వివిధ సేవల ద్వారా రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది. సచివాలయాలున్న.. మీ సేవా కేంద్రాలదే అగ్రరాజ్యమవుతుంది. ఒక రోజులో ఒక్కో సచివాలయంలో సగటు పది సర్వీసు రిక్వెస్టులకు ద్రువీకరణ పత్రాలిస్తే..మీ-సేవా కేంద్రాల్లో మాత్రం రోజుకి 20 నుంచి 60 వరకూ సర్వీసు రిక్వెస్టులు పూర్తిచేయగలుగుతున్నారు. ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, గ్రామ, వార్డు సచివాలయాలకు జాయింట్ కలెక్టర్లు మారారు. వీరైనా ఈ జీఓనెంబరు 149పై ద్రుష్టిసారితే గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు వచ్చి, గ్రామ సచివాలయాల ద్వారానే ప్రజలకు అన్ని రకాల సేవలు అంది ప్రభుత్వానికి ఆదాయం కూడా కోట్ల రూపాయాల్లో అందుతుంది. అలా కాకుండా అధికారాలన్నీ గ్రేడ్-1,2,3,4 కార్యదర్శిల చేతుల్లోనే ఉంచేస్తే మాత్రం ఇదే పద్దతి కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది..!