ఈఎన్ఎస్ వార్తకు స్పందన.. విలేజ్ క్లినిక్స్ లోనూ మెడికల్ టెస్టులు..


Ens Balu
4
తాడేపల్లి
2021-08-03 01:55:13

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు ఆనుకుని నిర్మిస్తున్న విలేజ్ క్లినిక్స్ లలో 14 రకాల మెడికల్ టెస్టులు చేయడానికి నిర్ణయించింది. గతంలో కేవలం మందులను, సిబ్బందిని మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో, నాటి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ కలను ప్రస్తావిస్తూ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మరియు అధికారికి మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net ద్వారా ప్రత్యేక కధనాలను ప్రచురించింది. దీనితో స్పందించిన సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి నేత్రుత్వంలోని ప్రభుత్వం ప్రాధమిక వైద్యం అందించేచోట, ప్రాధమిక వైద్యపరీక్షలు కూడా అందుబాటులో తేవాలని సంకల్పించింది. ఆపై మందుల సంఖ్యను తగ్గిస్తూ.. మెడికల్ టెస్టులను విలేజ్ క్లినిక్ లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షలో రాష్ట్ర అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్లినిక్ లలో స్టాఫ్ నర్సుతోపాటు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు కూడా అందుబాటులో ఉంటారు. పిల్లకు అన్ని రకాల వేక్సిన్లు ఇక్కడే వేస్తారు. ఆరోగ్యశ్రీకార్డుల సమాచార కూడా వివేజ్ క్లినిక్ లకు మేపింగ్ చేస్తారు. వీటి ద్వారానే ప్రాధమిక వైద్యం అందించి.. మరీ అవసరమైతే ఇక్కడి నుంచే పీహెచ్సీకి, ఆపై జిల్లా ఆసుపత్రులకు రోగులను పంపించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. 62 రకాల మందులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. 12 రకాల ప్రాధమిక వైద్యసదుపాయాలు, టెలీమెడిసిన్, వీడియో కాన్ఫరెన్సు విధానం కూడా అందుబాటులో వుంటుంది. అవుట్‌పేషెంట్‌ ఎగ్జామినేషన్‌ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, వెయిటింగ్‌ హాల్, ఏఎన్‌ఎం క్వార్టర్స్‌కూడా అక్కడే ఉంచుతున్నామన్న అధికారులు దీనివల్ల 24 గంటలపాటు ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారని, 67 రకాల బేసిక్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విలేజ్ క్లినిక్ విధానం దేశంలోనే ఒక వినూత్న విధానమని, వీటి ద్వారా గ్రామీణ ప్రజలు వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను, ఆర్ఎంపీలను ఆశ్రయించే పరిస్థితి ఉండదన్నారు. గ్రామస్థాయిలో వివిధ రకాల మెడికల్ టెస్టులు చేయడం వలన ప్రజల ఆరోగ్యపరమైన భారం పూర్తిగా తగ్గుతుందని అధికారులు చెప్పారు. మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విలేజ్ క్లినిక్ లలో మెడికల్ టెస్టులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది..