సచివాలయాల్లో సర్వీసు రూల్స్ ఎక్కడ..?


Ens Balu
8
Tadepalle
2021-08-04 02:09:30

భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తిచేసుకోబుతున్నా నేటికీ  కొన్నిశాఖల ఉద్యోగులకు సర్వీసు రూల్స్ ప్రభుత్వం తయారు చేయలేదు. ఈ విషయంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సదరు శాఖలను ఆదేశించలేదో.. లేదంటే ఆ శాఖల ముఖ్య కార్యదర్శిలకు ఖాళీలేకనో తెలీదు కానీ ఉద్యోగుల సర్వీసు రూల్స్ ఫ్రేమ్ చేసే విషయంలో మాత్రం నేటికీ ఒక్క అడుగు కూడా పడలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో కొందరు సిబ్బందిని నాలుగైదు శాఖలను కలుపుతూ ఒక ఉద్యోగంగా తయారు చేసింది ప్రభుత్వం. దీనితో ఏశాఖ తరపున వీరికి సర్వీసు రూల్సు తయారు చేయాలో తెలీక ప్రభుత్వం మధనపడుతోంది. మిగతాశాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, పదోన్నతల విషయంలో ఒక క్లారిటీ వచ్చినా మరికొన్నిశాఖల సిబ్బందికి క్లారిటీ రాకపోవడంతో వారి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా..? లేదా..  తాము జీవితాంతం ఇదే ఉద్యోగం చేయాలా.? అనే అనుమానంతో కొట్టిమిట్టాడుతున్నారు. ఇందులో ముఖ్యంగా విద్య, సంక్షేమ సహాయకులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు ప్రధానంగా ఉన్నారు. విద్య, సంక్షేమ సహాయకులను తీసుకుంటే వీరి ఉద్యోగం(బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గల నాలుగు శాఖలను కలిపి ఒక ఉద్యోగాన్ని తయారు చేశారు), ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను తీసుకుంటే(పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్, హౌసింగ్, ఎస్ఎస్ఏ ఇలా ఐదు ప్రభుత్వ శాఖల)ను కలిపి ఒక పోస్టుగా తయారు చేశారు. ఇక సర్వేయర్ల విషయానికొస్తే వీరు ప్రస్తుతం పనిచేసేది రెవిన్యూశాఖ అయినప్పటికీ, వీరికంటూ సర్వే శాఖ ఒకటుంది. అలాగనీ వీరు ఈ రెండు శాఖల అధికారులద దగ్గరా పనిచేస్తున్నారు. వీరంతా అన్ని శాఖలకు సంబంధించిన పనులూ చేస్తున్నప్పటికీ వీరికి ఏశాఖ నుంచి సర్వీసు నిబంధనలు అమలు చేయాలి, వీరికి సర్వీసులో ఏశాఖ నుంచి పదోన్నతి కల్పించాలి అనే విషయంలో క్లారిటీ లేదు.

 ఈ మూడు శాఖలకు చెందిన సిబ్బంది 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 45వేలకు పైనే ఉన్నారు. ప్రస్తుతం అన్నిశాఖలకు సర్వీసు నిబంధనలు, పదోన్నతుల విషయంలో ప్రత్యేకంగా జీఓలు వచ్చినప్పటికీ వీరికి మాత్రం ఎలాంటి జీఓలు రాలేదు. దీనితో తాము ఏశాఖకు చెందిన ఉద్యోగులగా తమను ప్రభుత్వం గుర్తిస్తుందో తెలీక ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ప్రభుత్వం ఇచ్చే జీతం చాలక.. ఉద్యోగాలకు రాజీనామాలు చేసి, మంచి ఉద్యోగాల్లో చేరిపోయారు. అంతేకాకుండా ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 85శాతం ఉద్యోగులంతా పట్టభద్రులే అయినప్పటికీ, వీరి ఉద్యోగం నాల్గవ తరగతికి చెందినదా, 5వ తరగతికి చెందినదా..లేదంటే వీరిని ప్రభుత్వం ఒక ప్రత్యేక సంఖ్య ఉద్యోగులుగా గుర్తించినదా అనేదీకూడా తెలియడం లేదు. వాస్తవానికి ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు, గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలా వ్యత్యాసాలు ఉండటంతో ప్రభుత్వం కల్పించే పదోన్నతుల విషయంలో చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోనీ రెగ్యులర్ ఉద్యోగం కదాని దైర్యం చేసి కొనసాగించుకుందామనుకున్నా..నేటికీ వీరందరికీ సర్వీసు రూల్సు లేకపోవడం, రెండేళ్ల ప్రొబేషన్ కాలం అక్టోబర్ 2తో పూర్తవడంతో తమను ఏ శాఖ కింద ఉద్యోగులుగా ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందోనని వీరిలో ఉత్కంఠ మొదలైంది. ఈ విషయమై ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం ద్రుష్టికి తమ సమస్యలు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఈ మూడు శాఖల ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 

మరోపక్క మిగిలిన శాఖలకు సంబంధించి సర్వీసు నిబంధనలు అమలు చేసినా, అవి మిగిలిన ప్రభుత్వశాఖల ఉద్యోగుల కంటే మరీ తక్కువ స్థాయి పదోన్నతులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నో ఆశలతో గ్రామ, వార్డు సచివాలయ శాఖలోకి ఉద్యోగులుగా చేరితే తమకి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చే విషయంలో కనీసం ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు ఈ ఉద్యోగం కంటే మంచి ఉద్యోగాలు వచ్చాయని వెళ్లిపోవడంతో, మరికొంత మంది ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవడం లేదని ఉన్న ఉద్యోగాలను వదిలి వెళ్లిపోతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు వేల ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఏర్పడగా, మరికొన్ని ఉద్యోగాలను ప్రభుత్వం ఇంకా భర్తీచేయకుండానే వదిలేసింది.. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తోంది తప్పితే.. వీరి సర్వీసు రూల్సు, పదోతన్నల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే పనికి మాత్రం పూనుకోవడంలేదు. మరో విచిత్రం ఏంటంటే మరో మూడు నెలల్లో సర్వీసులు రెగ్యులర్ చేయాలనే ఉద్దేశ్యంతో మాత్రం ఉద్యోగులందరికీ సర్వీసు రిజిస్టర్లు  ఓపెన్ చేసింది ప్రభుత్వం. అక్టోబరు 2 తరువాత ఆ రిజిస్టర్ లో ఆయా ప్రభుత్వ శాఖలు సర్వీసు నిబంధనల ఆధారంగా ఎంట్రీలు జరపాల్సి వుంటుంది. మరి ఆ సమయంలో ఏ ప్రభుత్వశాఖ కింద ఈ ఉద్యోగులను చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో తెలియన పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందనేది మాత్రం అక్టోబరు 2 దాటేవరకూ ఒక కొలిక్కి వచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు..!