ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ వైద్యానికి మహర్ధశ పట్టనుంది. దివంగత ముఖ్యమత్రి డా.వైఎస్ రాజశేఖకరరెడ్డి కన్న కలలను ఆయన తనయుడు యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ను ఏర్పాటు చేసి గ్రామంలో ప్రాధమివైద్యాన్ని అందించడానికి సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ప్రతీ గ్రామసచివాలయం పరిధిలో ఒక వైఎస్సార్ క్లినిక్ ను నిర్మిస్తున్నారు. ప్రాధమిక రోగాలకు సంబంధించి 14 రకాల మెడికల్ టెస్టులు చేసి 65 రకాల మందులను, మరో 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్ మెంట్లు, మరో 12 రకాల వైద్య సదుపాయాలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తేబోతుంది. గ్రామంలో ఉండే ఏఎన్ఎం 24 గంటలూ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడే వారికి ప్రత్యేక క్వార్టర్స్ కూడా నిర్మిస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని 13 జల్లాల్లోని సచివాలయాల పరిధిలోని వున్న ప్రజలను ఆయా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ కు అనుసంధానం చేశారు. వ్యాధి నిర్ధారణ చేయడం కోసం క్యూర్ కోడ్ విధానాన్న ప్రవేశ పెడుతున్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ల నుంచి ప్రాధమిక వైద్య కేంద్రానికి, అక్కడి నుంచి ఏరియా, జిల్లా ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ డేటాను అనుసంధానం చేస్తారు. ఇలా ప్రాధమిక వైద్యం గ్రామస్థాయిలో అందించి అంతకు మించితే వారికి వైద్యం ప్రాధమిక వైద్యకేంద్రాల్లో ఇంకా అవసరమైతే జిల్లా వైద్యశాలకు పంపి ఉచితంగానే వైద్యం చేయిస్తారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకు వస్తారు. ఒక మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఏఎన్ఎం కూడా అందుబాటులో ఉంచుతారు. రోగులు వేచి వుండటానికి వేయిటింగ్ హాలు ల్యాబు, ఫార్మశీ, ఇలా అన్నీ వేర్వేరుగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లలో వుండే విధంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్మాణాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల దగ్గరకు వెళ్లే పనిలేకుండా పూర్తిస్థాయిలో గ్రామస్థాయిలోనే మినీ హాస్పపత్రులను నిర్మాణం చేస్తుంది ప్రభుత్వం. గ్రామాల్లోనే ప్రజలకు ప్రాధమిక వైద్యం పూర్తిస్థాయిలో అందించాలనుకున్న డా.వైఎస్సార్ పేరుతోనే వాటిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యసేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణాలు సగానికిపైగా పూర్తయ్యాయి. వాటికి అనుగుణంగా ఆగస్టు చివరినాటికి ఇందులో పనిచేయడానికి మిడ్ లెవల్ హెల్త్ ప్రొవడైర్లను కూడా ప్రభుత్వం నియమించనుంది. సుమారు 6వేలకు పైగానే వీరిని నియమించడానికి అటు ఆర్ధిక శాఖ కూడా ఆమోద ముద్రవేసింది. ఇక్కడ ప్రజలకు ప్రాధమిక వైద్యం అందించే సమయంలో ఏమైనా అనుమానాలొస్తే వైద్యులను, 104 ద్వారా సంప్రదించడానికి టెలీ మెడిసిన్ విధానాన్ని కూడా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ లోనే ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం దీనికి కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని, వీడియో కాన్ఫరెన్సు సిస్టమ్ ను కూడా అందుబాటులోకి తేవాలని చూస్తోంది ప్రభుత్వం. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి నాటికి ప్రతీ గ్రామంలోనూ డా.వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ద్వారా ప్రజలకు ప్రాధమిక వైద్యం అందుబాటులోకి రావడంతోపాటు, చిన్నారులకు అన్ని రకాల వ్యాక్సిన్లును ఇక్కడే అందించనున్నారు. దానికోసం ఆశను కూడా ఇక్కడే అందుబాటులోకి తీసుకు వస్తోంది ప్రభుత్వం.