మహిళా పోలీసులకూ ఖాకీ డ్రెస్సు ఖాయం..


Ens Balu
6
Tadepalle
2021-08-07 03:56:15

గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ మహిళా పోలీసు ఖాకీ డ్రెస్సు వేసుకొని తిరగడం ద్వారానే ప్రజలకు రక్షణ కల్పించడానికి ఆస్కారం వుంటుందని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో నియమించిన సుమారు 15వేల మంది మహిళా పోలీసులకు హోంశాఖ ఖాకీ డ్రెస్సు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు గ్రామ, వార్డు మహిళా పోలీసుల నియామకాలు అస్సలు తమకు ఇష్టం లేనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. అంతేకాకుండా మీరు మాలా నిజమైన పోలీసులా, మీకు డ్రెస్సులుంటాయా.. శిక్షణలుంటాయా.. మీరు ఏ విషయంలో మాలాగ రెగ్యులర్ పోలీసులుగా ఫీలవుతున్నారు అంటూ మరెన్నో రకాలుగా చేసిన కామెంట్లను కేంద్ర ఇంటెలిజెన్సు విభాగం ద్వారా పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ మహిళా పోలీసులను కూడా సాధారణ పోలీసులుగా మార్పుచేస్తూ జీఓనెంబరు 59ని విడుదల చేసింది. దీనితో క్రింది స్థాయి పోలీసు సిబ్బంది కామెంట్లకు అడ్డుకట్ట పడింది. ఆ తరువాత రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీలు ముందు మీరు మహిళా పోలీసులను హోంశాఖ పోలీసులుగా ఇష్టం వున్నా, లేకపోయినా గుర్తించాలనే ఆదేశాలు జారీచేయడంతో సిబ్బంది ఒప్పుకోక తప్పలేదు. ఇపుడు తాజాగా మహిళా పోలీసులకు ప్రభుత్వం ఖాకీ డ్రెస్సు కూడా ఇచ్చి గ్రామ పరిరక్షణలో భాగం చేయడానికి అన్ని ఏర్పాట్లును చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన జీఓనెంబరు 59 ఆధారంగా వీరిని సాధారణ పోలీసులుగానే మార్పుచేసిన ప్రభుత్వం వీరికి కూడా దశల వారీగా పోలీసు శిక్షణ  ఇవ్వనుంది. 

ఈ మేరకు డిజిపి గౌతం సవాంగ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా దిశా నిర్ధేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభుత్వం నిర్ధేశించిన కొత్త నిబంధన ప్రకారం వీరికి కూడా పోలీసు యూనిఫారం రానుంది. ఈ విషయాన్ని డిజిపి ఎస్పీలకు తెలియజేశారు. అంతేకాకుండా ఆ కాకీ డ్రెస్ మోడల్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా కూడా చూపించారు. బహుసా ఇదే మోడల్ ఖాకీ డ్రెస్సులను మహిళా పోలీసులకు ప్రభుత్వం ఇవ్వనుంది. ఇప్పటికే మహిళా పోలీసులను నియమించిన ప్రభుత్వం, హెడ్ కానిస్టేబుళ్లుగా వున్న 2052 మందిని రాష్ట్రవ్యాప్తంగా వున్న పోలీసు స్టేషన్లలో ఉన్నట్టు గుర్తించింది. సర్కిల్ లెవల్ లో ఏఎస్ఐలు 196 మంది ఉండగా, మహిళా ఎస్ఐలు 97 మంది ఎస్డీపీఓ లెవల్ లో వున్నట్టుగా గుర్తించారు. ఇక ఇనెస్పెక్టర్ గా ఒక యూనిట్ లో 18ని ఉండేలా  సర్కిళ్లలో కూడా నియమించనున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక జిల్లాల్లో ప్రభుత్వం ప్రస్తుతం మహిళా పోలీసు ఉద్యోగాలను ఏ ప్రాతిపధికన రెగ్యులర్ చేయాలి, వీరికి ఏ విధమైన పరీక్షలు నిర్వహించాలి, దేహ దారుడ్యానికి, నడక లేదా పరుగు ఏ విధంగా పెట్టాలనే అంశాలకు సంబంధించి కూడా డిజిపి గౌతం సవాంగ్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఆగస్టు 15న మహిళా పోలీసులకు డ్రెస్ కోడ్ అందుబాటులోకి రానుందని సమాచారం అందుతుంది. అయితే అది ఆ తేదీనే ప్రకటిస్తారా.. లేదంటే వీరికి ప్రభుత్వం నిర్ధేశించిన పరీక్షలన్నీ పూర్తయిన తరువాత, వీరి సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత ప్రకటిస్తారనే అనే విషయంలో క్లారిటీ రావాల్సి వుంది. 

ఇప్పటి వరకూ రాష్ట్రంలో చాలా మంది పోలీసులు మహిళా పోలీసు పోస్టుల విషయంలో, వారి విధుల విషయంలోనూ, వారిని మానసికంగా క్రుంగదీసి, వారి ఉద్యోగాలు వారంతట వారే వదిలి పోయేలా చేసిన(కొన్ని జిల్లాల్లో మహిళా పోలీసులు ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు, మరికొంత మంది మహిళా పోలీసు ఉద్యోగాన్ని వదిలి వేరొక ఉద్యోగానికి వెళ్లిపోయారు) ప్రయత్నాలకు ప్రభుత్వం ఒక్కసారిగా ఖాకీ యూనిఫారం ఇస్తున్నట్టు నేరుగా పోలీస్ బాస్ డిజిపి ప్రకటించడంతో మహిళా పోలీసులపై జరుగుతున్న ప్రచారాలను, సిబ్బంది చేసే కామెంట్లకు గట్టిగానే అడ్డుకట్ట వేయగలిగింది. వాస్తవానికి మహిళా పోలీసులను ప్రభుత్వం గ్రామాల్లో నియమించడం ద్వారా కానిస్టేబుళ్లు, ఎస్ఐల ప్రాభల్యం గ్రామాల్లో తగ్గిపోతుందని, గ్రామాల్లోకి వెళితే అప్పటికే వున్న మహిళా పోలీసులనే గౌరవిస్తారనే  భావనకు రాష్ట్రంలో చాలా మంది పోలీసులు(హోం గార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు) వచ్చినట్టుగా తీవ్ర ప్రచారం జరగడంతోపాటు, చాలా చోట్ల పోలీసు సిబ్బందే బయట పడిపోయారు. ఇదే సమయంలో పోలీసు సిబ్బంది ఎంతో ఆందోళన చెంది, బయటపడి మరి మనసులోని ఆలోచనలు మహిళా పోలీసుల దగ్గర అన్నా.. ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చేది, ఉద్యోగాల్లో నియమించేది హోంశాఖ మాత్రమే. 

అయినప్పటికీ ఈ విధంగా మాట్లాడటం ద్వారా కొందరిలోనైనా ఆలోచన పెరిగి చేస్తున్న ఉద్యోగాలను వారంతట వారే మానివేసేలా చేయలి.. లేదంటే వేరే ఉద్యోగాల్లోకి వెళ్లిపోవడం గానీ, అన్నింటికంటే ముఖ్యంగా ఖాకీ డ్రెస్సు వద్దని చెప్పించే ప్రయత్నం చేయడంలో సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడిగా చాలా గట్టిగానే కష్టపడ్డారనేది హాట్ టాపిక్. కానీ జిల్లా ఎస్పీలు మాత్రం ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకోవడంతో చాలామంది ఇపుడు ఆ ప్రవర్తన మార్చుకున్నట్టుగా తెలుస్తుంది.  నిన్న డిజిపీ గౌతంగ సవాంగ్ మహిళా పోలీసులకు ఖాకీ డ్రెస్సు ఇస్తున్నామనే మాటను ప్రకటించిన తరువాత.. ఏదో రకంగా మాట్లాడే క్రిందిస్థాయి పోలీసు సిబ్బంది గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది. అయితే మహిళా పోలీసుల ఒంటిపైకి ఖాకీ చొక్కా వచ్చేంత వరకూ పోలీసుశాఖలో ఏ నిబంధన అమలు జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.. చూడాలి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మహిళా పోలీసులందరికీ ఖాకీ డ్రెస్ ఇస్తారా లేదంటే.. తమ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, గ్రామాల్లో వారికి ప్రాబల్యం తగ్గిపోతుందని ఆ ఆలోచనను మార్చుకుంటారా.. తేలాల్సి వుంది..!