ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి అనే హోదా జీఓఎంఎస్ నెంబరు 129 నుంచి 60లతో మహిళా పోలీసుగా మారిపోయింది. రాష్ట్ర హోంశాఖ ఉద్యోగులుగా ఉన్నవీరందరినీ ఇకపై మహిళా పోలీసులుగానే పిలవాలని ఆదేశిస్తూ.. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ లిఖితపూర్వక ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు జీఓనెంబరు 129ను ఎమెండ్ మెంట్ చేస్తూ ప్రభుత్వం జీఓనెంబరు 60ని విడుదల చేసింది. దీని ప్రకారం సాధారణ పోలీసులకు ఉండే అన్ని అధికారాలు మహిళా పోలీసులకు కూడా వర్తిస్తాయని అందులో పేర్కొంది. అంతేకాకుండా వీరికి పోలీసు సిబ్బంది మాదిరిగా శిక్షణ కూడా ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఎక్కడైనా వారందరినీ మహిళా పోలీసులుగా పిలవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీచేసినట్టు ఆ జీఓలో పేర్కొన్నారు. అంతేకాకుండా దీనిని అదనపు సాధారణ గెజిట్ నోటిఫికేషన్ లో పొందు పరిచినట్టుగా వివరించింది. ఈ యొక్క విషయాన్నిసీఎం ఓఎస్డీ, పీఎస్ లతోపాటు రాష్ట్ర డీజీపి కార్యాలయం, స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హోంమంత్రి కార్యాలయాలకూ ప్రత్యేకంగా తెలియజేశారు. డిజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఎస్పీ కార్యాలయాలకు, అక్కడి నుంచి ఎస్పీకార్యాలయం, సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయాలకు, అక్కడ అడ్మిన్ ఎస్పీలకు ఈ సమాచారం చేర్చింది ప్రభుత్వం.
గ్రామ,వార్డు సచివాలయ మహిళా పోలీసు ఉద్యోగం విషయంలో పోలీస్ శాఖలోనే కింది స్థాయి సిబ్బందికి(హోంగార్డు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ) ఉన్న అనుమానాలు, వారి ఇబ్బందులను నివ్రుత్తి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేక జీఓ, గెజిట్లను అందరికీ సర్క్యూలేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆదేశాలో వచ్చిన ఈ జీఓలు, గెజిట్ లపై పోలీసుశాఖలోని ఏ ఒక్క సిబ్బంది తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, వ్యవహరించడానికి వీల్లేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న మహిళా పోలీసులను పోలీస్ స్టేషన్ లోని కానిస్టేబుళ్లుగానీ, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, ఎస్ఐలు ఏ విధంగానూ.. ఏ స్థాయి వారైనా అదైర్య పరిచేవిధంగా కానీ, వారంతట వారే మహిళా పోలీసు ఉద్యోగాలకు రాజీనామాలు చేసే విధంగా ప్రేరేపించేలా వ్యవహరించినా వారిపై ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగానే ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం నుంచి హోంశాఖలో ఏ జీఓ వచ్చినా దానిని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల గ్రూపులో పెట్టి అవగాహన కల్పిస్తున్నారు.
అదే సమయంలో స్టేషన్ పరిధిలోని పోలీసులు కూడా వారి స్టైల్ లోవారూ నోటికొచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రత్యేక నిఘా వ్యవస్థ ద్వారా పసిగట్టిన జిల్లా ఎస్పీలు అన్ని డివిజన్ల డిఎస్పీలకు, సర్కిల్ ఇనెస్పెక్టర్లకు, స్టేషన్ ఎస్ఐలకు కూడా వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మహిళా పోలీసులను హోంశాఖ ఉద్యోగులుగా ఇష్టం ఉన్నా, లేకపోయినా గుర్తించాలని చెబుతున్నారు. అయినప్పటికీ మహిళా పోలీసు నియామకాలు, ప్రత్యేక జీఓలు, ప్రభుత్వ గెజిట్లు(రాజపత్రం) విడుదలైనా కొందరు కిందిస్థాయి పోలీసులు వారి పద్దతి మార్చుకోని సిబ్బందిపై స్టేట్ ఇంటెలి జెన్సుతో కాకుండా, సెంట్రల్ ఇంటెలి జెన్సు ద్వారా స్టేషన్ స్థాయిలో సిబ్బంది మహిళా పోలీసుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారనే కోణంలో ప్రభుత్వం నిఘా పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే డిజిపీ గౌతం సవాంగ్ ఆదేశాలతో అన్ని జిల్లాల ఎస్పీలు మహిలా పోలీసు వ్యవస్థను గ్రామాల్లో పూర్తిస్థాయిలో వ్యవస్థీకరించి గ్రామ సంరక్షణ చేపట్టే కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో భాగంగానే మహిళా పోలీసులతో ప్రత్యేక గ్రూపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థాయిలో ఏం జరిగినా తక్షణమే సదరు పోలీస్ స్టేషన్ కి సమాచారం అందేవిధంగా పక్కా నెట్వర్క్ ను కూడా పెంచారు. ఈ క్రమంలో ప్రభుత్వము, ఏపీ పోలీస్ బాస్, డిజిపీ గౌతం సవాంగ్ సైతం మహిళా పోలీసు అనే పదంతోనే వీరిని వ్యవహరిస్తున్నారు. ఇకపై స్టేషన్ లోని పోలీసులు సిబ్బంది కానీ, ఎస్ఐలు, సీఐలు, డిఎస్పీలు జీఎంఎస్కే అని వ్యవహరించకూడదని, ఆ పదాలన్నీ జీఓనెంబరు 60తో కనుమరుగు అయ్యాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది..!