ఆంధ్రప్రదేశ్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ, రాబోయే థర్డ్ వేవ్ పై రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎ మాట్లాడుతూ, స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రమంతా వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం
మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూళ్లలో కరోనా వైరస్ టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలని ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసహాయం అందేలా చూడాలాన్నారు. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ అందించాలన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకొని కేసులు పెట్టాలన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. కాగా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 17,218,రికవరీ రేటు 98.45%,పాజిటివిటీ రేటు 1.94 % గా ఉందన్నారు. 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదైన జిల్లాలు 10,
3 నుంచి 6 శాతంలోపు పాజిటివిటీ నమోదైన జిల్లాలు 3 ఉన్నాయని అధికారులు సీఎంకి వివరించారు. థర్డ్ వేవ్ వచ్చినా 20,464 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందుబాటులోకి తీసుకురావడానికి సిద్దంగా ఉన్నాయన్నారు. ఇక డి టైప్ ఆక్సిజన్ సిలిండర్లు 27,311 అందుబాటులో ఉన్నాయని, ఆగష్టు నెలాఖరునాటికి 104 చోట్ల ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటు పూర్తిచేయడంతో పాటు మరో 36 చోట్ల సెప్టెంబరు రెండోవారానికి పూర్తి చేయనున్నట్లు అధికారులకు సీఎంకి వివరించారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, వైద్య,ఆరోగ్య శాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవి శంకర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.