నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆశాఖ అడ్వైజర్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపిఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సంస్థ ఎండి ఎన్ బంగారరాజు తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి కార్యాలయంలో రాష్ట్ర స్థాయి నైపుణ్యపోటీలకు సంబంధించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. రెండు రోజులపాటు జరిగే పోటీలను కేఎల్ యూనివర్సిటీతోపాటు స్వర్ణభారతి ట్రస్ట్, వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ట్రాటెక్ సిమెంట్, సిపెట్, నేచురల్స్, ఆంధ్రా లయోలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ, శ్రీవిశ్వకర్మ గోల్డ్ స్మిత్ ల దగ్గర కూడా వివిధ విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి టాప్ ప్లేస్ లో నిలిచినవారిని త్వరలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని 2022 సెప్టెంబర్లో చైనాలోని షాంఘై నగరంలో నిర్వహించే ప్రపంచస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.
ఈ సందర్భంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 24 నుంచి రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నామని ఇందుకు ప్రారంభ వేడుకలను నిర్వహించేందుకు కేఎల్ యూనిర్సిటీ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎపిఎస్‌ఎస్‌డిసి పనిచేస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలకు ఎంపికైనవారు మంచి ప్రతిభను ప్రదర్శించి జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయికి కూడా ఎంపికై రాష్ట్రానికి మంచి పేరుకు తీసుకురావాలన్నారు.
అనంతరం నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ అడ్వైజర్ చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ చైనాలో 2022లో జరిగే ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు గాను ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నిర్వహించామన్నారు. 32 విభాగాల్లో పోటీలకు గాను మొత్తం 21,515 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన 397మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. వీరంతా కేఎల్ యూనివర్సిటీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి.. మన దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం పొందడంతోపాటు చైనాలోని షాంఘై నగరంలో జరిగే ప్రపంచ నైపుణ్య పోటీల్లో సత్తా చాలాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైపుణ్య శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపారని.. అంతర్జాతీయస్థాయి నైపుణ్యాలు మన యువతకు అందించాలన్న ఉద్దేశ్యంతో అనేక సంస్థలతో కలిసి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణశాఖ అడ్వైజర్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎపి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సంస్థ ఎండి ఎన్ బంగారరాజు, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ డి.వి రామకోటి రెడ్డి, కె. విజయ్ మోహన్ కుమార్, వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్స్ కన్వీనర్ డాక్టర్ గుజ్జుల రవి, కెఎల్ యూనివర్సిటీ ప్రోవైస్ చాన్సులర్ ప్రొఫెసర్ వెంకట్రామ్, కెఎల్ యూనివర్సిటీ డీన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.