ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థలో సింహభాగమైన పంచాయతీకార్యదర్శిల విధులు, అధికారాలపై పంచాయతీరాజ్ శాఖ రెండు నాల్కల దోరణి అవలంభిస్తుంది. పంచాయతీరాజ్ శాఖలోని జీఓనెంబరు 149ను అనుసరించి గ్రేడ్-1 నుంచి గ్రేడ్-5 వరకూ అన్ని అధికారాలు, రికార్డుల నిర్వహణ, జమాఖర్చుల విధులు చేపట్టవచ్చునని చెబుతూనే.. దానికి సంబంధించిన ఉత్తర్వులు ఎక్కడ అంటే మాత్రం.. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. దీనితో విసుగు చెందిన ఉద్యోగులు నేరుగా సమాచారహక్కు చట్టాన్ని ప్రయోగించిన సందర్భంలో కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివ్రుద్ధి శాఖ పౌరసమాచార అధికారి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ అదికూడా అమలుకి మాత్రం నోచుకోవడం లేదు. ఫలితంగా ఎప్పటి మాదిరిగానే సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్-5 కార్యదర్శిలంతా ఉత్తుత్తి కార్యదర్శిలుగా నేటికీ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక అంశాలన్ని ఇటు ప్రభుత్వము, గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు గమనించాల్సి వుంది. చూపించడానికే ప్రభుత్వ జీఓలు తప్పా వాటిని అమలు చేయడానికి మాత్రం పంచాయతీరాజ్ శాఖలో చోటులేదని.. ఎందుకంటే ఆ విషయాన్ని సమాచారహక్కు చట్టం దరఖాస్తుకి జవాబు ఇచ్చిన కమిషనర్ కార్యాలయ అధికారులే స్పష్టం చేశారు. దానికి కూడా కారణం లేకపోలేదు. 2019లో గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి నేటి వరకూ ఎంపీడీఓలు, డిపీఓలు, జిల్లా కలెక్టర్లు ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల క్రిష్ణ ద్వివేదికి సైతం నేరుగా జీఓనెంబరు 149ని అమలు చేయమని, ప్రభుత్వ జీఓ ప్రకారం తమ పరిధి, విధులు, జాబ్ చార్టు కేటాయించాలని దరఖాస్తులు చేసినా అవన్నీ బుట్టదాఖలే అయ్యాయనడానికి ప్రభుత్వం నేటికీ చర్యలు తీసుకోకపోవడమే.
పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్లు.. గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు 149ని ప్రకారం అధికారాలు బదలాయించకపోవడం వలన ప్రభుత్వం ఇటీవల అమలు చేస్తున్న ఇంటిపన్ను నవీకరణలు నత్తనడకన సాగుతున్నాయి. వాస్తవానికి కార్యదర్శిలందరికీ వారి వారి సచివాలయ పరిధి మేరకు అధికారాలు, రికార్డులు, నిధులు కేటాయిస్తే వారి పరిధిలో పనివారు చక్కగా చేసుకుని ఉండేరు. కానీ ఇపుడు ఆ అధికారాలన్నీ పంచాయతీల్లో పనిచేసే గ్రేడ్-1-4 కార్యదర్శిల దగ్గరే వదిలేదయడంతో వారికి పనిచేయడం చేత కాక మళ్లీ గ్రామసచివాలయ ఉద్యోగులకు, కార్యదర్శిలకు ప్రత్యేక డ్యూటీలు వేసి వారితో చేయించుకునే పరిస్థి నెలకొంది. ఇదొక్కటే కాదు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40శాతానికి పైగా ఇంటిపన్నుల బకాయిలు పేరుకు పోయాయి. వాటిని కూడా ప్రస్తుతం పంచాయతీల కార్యదర్శిలు వసూలు చేయడానికి నానా పాట్లు పడాల్సి వస్తుంది. గ్రేడ్-1-4 పంచాయతీ కార్యదరద్శిలంతా సచివాలయ ఉద్యోగులపై అజమాయిషీ చలాయించినంతగా వసూళ్లు వెళ్లాంటే మాత్రం తెగ నొప్పులు పడిపోతున్నారు. అక్కడ బిల్ కలెక్టర్లు, కొన్ని మేజర్ పంచాయతీలకు జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నా.. వారికి పనిచేయడం చేతకాక ఆ పనులన్నీ మేజర్ పంచాయతీ పరిధిలో వున్న మూడు సచివాలయ సిబ్బందితోనే చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే గ్రేడ్-1 నుంచి గ్రేడ్-5 కార్యదర్శిల వరకూ వాదోపవాదాలు, కొన్నిచోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. కొందరు ఏకంగా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలపై తిరుగుబాటు జెండా ఎగుర వేస్తున్నారు.
ప్రస్తుతం ప్రొబేషన్ లో వున్న గ్రామసచివాలయ సిబ్బంది కూడా గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలుగా వున్న వారి మాటలను వినీ విననట్టు వ్యవహరిస్తూ పనిచేస్తున్నారు. అక్టోబరు 2 నుంచి జవరిలోపు అందరి సచివాలయ ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ అవుతాయి. ఈసమయంలో పంచాయతీల్లో పెండింగ్ పనులు పూర్తయ్యాయా సరేసరి లేదంటే మాత్రం అవి పూర్తికావడానికి, పెండింగ్ ఇంటి పన్నులు వసూలు చేయడానికి ఎంత సమయం పడుతుంతో లెక్కలేదు. ఇప్పటి వరకూ తమ ఉద్యోగాలకి ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని భయపడుతూ, ప్రొబేషన్ లో మచ్చపడకూడదని మాత్రమే ఇప్పటి వరకూ గ్రామ సచివాలయ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ కాస్త నెమ్మదిగా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలో చాలా మంది గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శిలు ఎంపీడీఓ మిలాఖత్ అయి కావాలనే గ్రామ సచివాల కార్యదర్శిలను, సిబ్బంది చులకనగా చూస్తున్నారు. ఎన్నిచూసినా, ఏం చేసినా ప్రభుత్వ నిభందనల మేరకు విధులు నిర్వహిస్తూ.. చాలా చోట్ల అధికారులు తిట్టినా ఓపికతో విధులు నిర్వహిస్తున్నారు సచివాలయ సిబ్బంది. ఈ తరుణంలోనే మరో 4 నెలల సమయం పూర్తై వీరి సర్వీసులు రెగ్యులర్ అయితే మాత్రం ఏ సచివాలయ సిబ్బందీ ఫాల్స్ ప్రెస్టీజీతో మూర్ఖంగా వ్యవహరించే అధికారుల ఒత్తిడిని, మాటలు, చులకనగా వ్యవహరించే తీరును ఓపిక పట్టరనే సంకేతాలను అపుడే సిబ్బంది విడుదల చేస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన జీఓనెంబరు 149ని పంచాయతీరాజ్ శాఖ గానీ, గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్యకార్యదర్శి గానీ ఎందుకు అమలు చేయడం లేదనే విషయంలో సరిగ్గా నేటికీ క్లారిటీ రాలేదు. ప్రభుత్వం ఎంత కాలం నాన్చుతుందో ఓపికతోనే చూద్దామనే ధీమాలోనే గ్రేడ్-5 కార్యదర్శిలతోపాటు, సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు. విశేషమేంటంటే కొన్ని గ్రామ సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శి మొదలు కొని అన్ని శాఖల సిబ్బంది ఒక మాటమీదకు వచ్చి సచివాలయం-1 అంటే ప్రస్తుం మేజర్ పంచాయతీలుగా వున్న చోట కొన్ని పనులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాల్సివున్నా.. తమకు ప్రభుత్వం కేటాయించిన విధులన్నాయని చెప్పి తప్పించుకు పోతున్నారు. ఈ తరుణంలో చాలా పనులు పెండింగ్ లో పడిపోతున్నాయి. ఇదే సమయంలో కొందరు గ్రేడ్-1-4 కార్యదర్శిలు ఉద్యోగులపై వీర ప్రతాపం చూపించినా ఫలితం లేకుండా పోతుంది. కొన్ని పంచాయతీల్లో సిబ్బంది ఏమీ అనలేక కావాలని జీతాలు ఆలస్యంగా బిల్లులు చేసే పనికి పూనుకుంటున్నారు పంచాయతీల కార్యదర్శిలు. ఈ విషయాలన్నీ పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యాలయానికి, స్థానిక ఎంపీడీఓలకు, జిల్లా పంచాయతీ అధికారులకు సమాచారం ఉన్నప్పటీకి నోరు మెదపకుండా అలానే ఉండిపోతున్నారు. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందాన.. పంచాయతీలకు సిబ్బంది ఉన్నా వారికి సాంతికపరంగా పనిచేసే విధానం, కంప్యూటర్ వర్క్ పై అవగాహన లేకపోవడంతో చచ్చినట్టు మళ్లీ సచివాలయ ఉద్యోగులతోనే అన్ని పనులు చేయించుకుంటున్నారు. దానికి కారణం ఒక్కటే ప్రస్తుతం గ్రామసచివాలయ శాఖ పనిచేస్తున్న 80శాతం మంది ఉద్యోగులు బీటెక్, డిగ్రీ, పీజీ, ఎంటెక్, కొన్ని సచివాలయాల్లో పీహెచ్డీలు చదివిన వారు కూడా ఉండటమే. అంతేకాదు అత్యధిక చదువులున్న ప్రభుత్వ శాఖ ఉద్యోగులున్న శాఖగా గ్రామ, వార్డు సచివాలయశాఖ రికార్డులకెక్కింది. ఈరోజుకీ చాలా పంచాయతీల్లో కార్యదర్శిలు పదవ తగరతి, మెట్రుక్యులేషన్, అత్యధిక చదువు ఇంటర్ వరకూ మాత్రమే పూర్తిచేసిన వారు ఉండటమే దీనికి ప్రత్యేక కారణం.
ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి తెలిసినప్పటీకి కావాలనే నాన్చుడు దోరణి అవలంభిస్తుంది. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలంటే గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు అధికార బదలాయింపులు జరగాల్సి వుంది. అదే సమయంలో సచివాలయాల్లోని 14 శాఖల సిబ్బందినీ వారి పనులను వారిని చేసుకోనీయాలి. అలాకాకుండా ఇటు పంచాయతీరాజ్ శాఖ, అటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు కావాలనే గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందకూడదనే అడ్డుకట్ట వేయాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. అలాకాకపోతే ఈపాటికే గ్రామ, వార్డు సచివాలయాల్లోని 19రకాల సిబ్బంది సర్వీసు రూల్సు, జాబ్ చార్టు, ఆయా ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వమే అమలు చేసిన జీఓలను అమలు చేసి ప్రజలకు 50శాతం చేరువ కావాలి. నేటికీ సచివాలయాల్లో ప్రభుత్వం ఏ తరహా సేవలు అందిస్తున్నదో ప్రజలకు తెలియపోవడానికి కారణం కూడా ఇదే. తమకు అధికారాలు ఇవ్వనపుడు లేని అధికారాలతో ప్రజలకు ఏం సేవలు చేస్తామని ప్రశ్నిస్తున్నారు గ్రేడ్-5 ఉద్యోగులు. ఒక రకంగా చాలా సేవల వివరాలు గ్రేడ్-5 కార్యదర్శిల ద్వారా ప్రజలకు ఎక్కువగా తెలుస్తాయి. ఒక వేళ మిగిలిన ప్రాంతాల్లోవున్న గ్రేడ్-1-4 కార్యదర్శిలు చెప్పాలన్నా వారికి ప్రస్తుతం ఆన్ లైన్ పనులు, ఇతర జీఓలు వాటిపై అవగాహన లేదు సరికదా చాలా మంది వాటిని చదివి అర్ధం చేసుకునే పరిస్థితుల్లో కూడా లేరు. దానికి ప్రధాన లోపం కనీసం చాలా మంది డిగ్రీ చదువు ఇంగ్లీషులో ప్రావీణ్యత లేకపోవడమే. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోకపోతే జనవరి2022 దాటిన తరువాత నుంచి సచివాలయ సిబ్బంది నుంచి ప్రభుత్వం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కునే పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయి. చూడాలి ఇప్పటికై ప్రభుత్వం జీఓనెంబరు 149 అమలు చేయడంతోపాటు, అన్నిశాఖలకు సంబంధించి ఆయాశాఖల జాబ్ చార్టు ప్రభుత్వమే విడుదల చేసిన జీఓ ప్రకారం అమలు చేస్తుందో.. లేదంటే ఇంకా పాద పద్దతిలోనే నాన్చుడు వ్యవహారాన్నే కొనసాగిస్తుందో..!