రేషన్ కార్డుతో ప్రొబేషన్ కి మెలికపెట్టారు..


Ens Balu
49
Tadepalle
2021-08-25 01:52:50

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నీ నిబంధనల ప్రకారమే చేస్తుందని..దేశంలో ఇచ్చిన జీఓలను అచ్చుగుద్దినట్టు పాటించే ప్రభుత్వం దేశంలోనే రాష్ట్రానిదేనని అన్ని ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కాని అమలులో మాత్రం ‘చెప్పడానికే శ్రీరంగ నీతులు’అన్నచందాన వ్యవహరించడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఇచ్చిన జీఓలను కావాలనే అమలు చేయకుండా వదిలేయడం ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే చేయడం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని లక్షా 34 వేల మంది ఉద్యోగులకు అర్ధం కాకుండా వుంది. మళ్లీ ఇపుడు పుండుపై రోకటి పోటు అన్నట్టుగా ఇపుడు.. ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది తెలుపురంగు రేషన్ కార్డు వినియోగిస్తున్నారని వారంతా ప్రభుత్వానికి కార్డులు సరెండర్ చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి సర్కారు..దానికి రేషన్ కార్డులేని నిరుపేదలు ఎంతో హర్షించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది నేటికీ రేషన్ కార్డు వినియోగిస్తున్నవారందరీకి గొంతులో పచ్చివెలక్కాయ్  కూడా పడింది. దానికి స్పందించిన ఉద్యోగులు తమ రేషన్ కార్డును ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి ముందుకొస్తే..దానికి నియమ నిబంధనలు మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు( ఉదాహరణకు అనంతపురం జిల్లాలో 65 మండలాల్లో 9313 మంది) వైట్ రేషన్ కార్డు దారుల కుటుంబాల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ-కేవైసీ, ఆధార్ నెంబర్లు ఎంటర్ చేసినపుడు ఆ కార్డులు లైవ్ లో ఉన్నట్టు చూపిస్తున్నాయి. వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని చూస్తున్న ఉద్యోగులకు వాటిని ఎలా చేయాలో అర్ధం కావడం లేదు. అలాగని కొంత మంది ఉద్యోగులు సరెండర్ చేయడానికి గానీ, వారి పేర్లను తొలగించుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రస్తుతం అన్నిజిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల రేషన్ కార్డులను సరెండర్ చేయాలని ప్రత్యేక సర్క్యులర్లు జారీచేశారు.

అలాగని మండలస్థాయిలో తహశీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, జిల్లా స్థాయిలో జెసీలు సైతం దానికి ఏ విధంగా సరెండర్ చేయాలి(ఉద్యోగి మాత్రమే తప్పుకోవాలా..లేదంటే కుటుంబం మొత్తానికి కార్డు రద్దు చేసుకోవాలా) అనే విషయంలో దిశ నిర్దేశం చేయలేదు. దీనితో తాము ఉన్న రేషన్ కార్డులో నుంచి తమపేరు ఎలా బయటకు తీయించాలనే విషయం, కార్డు సరెండర్ చేసే విషయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు క్లారిటీ రాలేదు. ఇదిలా వుంటే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే తెలుపురంగు రేషన్ కార్డులో సచివాలయ ఉద్యోగులన్న కార్డులకు నిత్యవసర సరుకుల దుఖాణంలో సరుకులు కూడా ఇవ్వడం మానేశారు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం కేవలం రూ.15000వేలు మాత్రమే ప్రస్తుతం ప్రొబేషన్ పీరియడ్ లో జీతంగా ఇస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం నిరుపేదల వార్షిక ఆదాయం రూ.2.50లక్షలు ఉంటే వారు పేదవారిగానే లెక్క.  కానీ సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు కావడంతో వారి జీతాలు వార్షిక ఆదాయం లెక్కన చూసుకుంటే రూ.రెండు లక్షల లోపుగానే ఉన్నాయి. అలాంటపుడు వీరు నిరుపేదల జాబితాలోకి రారా అంటే.. ఖచ్చితంగా రారు అనే సమాధానం చెబుతున్నది ప్రభుత్వం. ఇలా ప్రకటించిన తరుణంలో రాష్ట్రంలోని సచివాలయ ఉద్యోగులంతా వారున్న రేషన్ కార్డుల్లో నుంచి తమ పేర్లను తొలగించాలని ప్రయత్నిస్తుంటే వారికి పరిష్కారం దొరకడం లేదు. అన్నీ నిబంధనల ప్రకారం చెప్పే ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేరిన వెంటనే ప్రకటించాల్సి వుంది. కానీ సుమారు రెండేళ్ల పాటు కామ్ గా ఊరుకొని ‘మావోడికి మెదిలినపుడే’ మొదలెట్టాలి అన్నట్టుగా రెండేళ్లు ప్రొబేషన్ పూర్తవుతున్న తరుణంలో ఈ నిబంధన పెట్టడమేంటని ఉద్యోగులంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 

ఆది నుంచి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కాస్త తేడానే వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని ఉద్యోగులు వాపోతున్నారు. గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5గా నియమించిన ప్రభుత్వం నేటి వరకూ తమకు అధికారాలివ్వకపోగా.. ఇప్పటికే అమలులో ఉన్న జీఓ నెంబరు 149ని అమలు చేయకుండా పంచాయతీ గ్రేడ్-1,4 వాళ్లను మాత్రమే డిడిఓలుగా కొనసాగిస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వమే విడుదల చేసిన జీఓనే ఎందుకు అమలు చేయడం లేదంటే ‘ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారని’ ఇలా అయితే తాము ప్రజలకు ఏం సమాధానం చెబుతామని, అధికారాలు లేకుండా తాము ఏ విధంగా సేవలు చేస్తామని వీరంతా మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంతో వివక్షకు గురవుతూ ఉద్యోగాలు చేస్తున్నామని..ఈ సమయంలో తామున్న రేషన్ కార్డులను సరెండర్ చేయమంటున్నారని.. వచ్చే ఈ తక్కువ జీతంతో ఎలా కుటుంబాలను నెట్టుకు రావాలో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి సరెండర్ చేయడానికి ముందుకొస్తే దానికి సరైన సూచనలు గానీ, సలహాలు గానీ చేయడం లేదని సచివాలయ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఈ ఉద్యోగాల్లోకి వచ్చిన తమకు తక్కువ జీతం ఒక కారణమైతే..తీవ్ర మైన వివక్ష రెండో కారణంగా, అధికారాలు లేని ఉద్యోగాలు మూడో కారణంగా తమను వెంటాడుతున్నాయని వాపోతున్నారు. అన్నింటినీ భరిస్తూ విధులు నిర్వహిస్తున్నా తమకు ఎలాంటి గుర్తింపు ఉండటం లేదని..ప్రశ్నించిన పాపానికి సస్పెండ్ లు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ‘రాజు తలచుకుంటే దెబ్బలకు..డబ్బులకు కొదవా’ అన్నట్టు రాష్ట్రంలో వున్న ఏ ప్రభుత్వశాఖలో లేని విధి విధానాలు, జీఓలు అమలు కాకపోవడం ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే ప్రభుత్వం చేపట్టడం దారుణమనే వాదన సర్వత్రా వినిపిస్తుంది. రేషన్ కార్డులతో ప్రొబేషన్ కి మెలిక పెడుతూ, కఠిన చర్యలంటూ ఇపుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందనేది రోజు రోజుకీ ఆశక్తిని రేపుతోందంటున్నారు విశ్లేషకులు..!