సచివాలయ సేవలపై బురద చల్లుతున్నారు..


Ens Balu
36
Tadepalle
2021-08-26 03:08:55

భారతదేశం మొత్తం తొంగిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ఆదర్శంగా, ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్తపై ఒక వర్గం మీడియా కావాలనే బుదరచల్లుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలో గత ప్రభుత్వాల సమయంలో పంచాయతీలు, పాలక మండలి మాత్రమే పరిపాలన చేసేవి. ఆ తరువాత గత ప్రభుత్వం  పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో సుమారు 9ఏళ్లకు పైనే ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు నడిచాయి. ‘వంగలేక మంగళవారం’ అన్నట్టు ఆ సమయంలో తినేసిన నిధులు, లేని ఖర్చులకు చూపిన లెక్కలపై నోరుమెదపని మీడియా.. ఇపుడు సచివాలయాలు ఏర్పాటైన తరువాత మాత్రం ఏదో జరిగిపోతుందని గగ్గోలు పెడుతుంది. వీటి వలన ఎలాంటి ఉపయోగం లేదన్నట్టుగా పనిగట్టుకొని ప్రచారం చేస్తుంది. వ్యవస్థ ఏర్పాటు చేయడం తప్పుకాదు.. ఆ వ్యవస్థకి ఒక దిశా నిర్దేశం, ప్రభుత్వ జీఓలను సమయానికి అమలు చేయకపోవడం తప్పు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ అదే జరుగుతుంది. ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన తరువాత జీఓనెంబరు 149 ప్రకారం గ్రామ సచివాలయాల వారీగా పంచాయతీ పరిధిని విభజించాలి. జనాభాకు సేవలు అందించడానికి రెండు నుంచి 4వేల జనాభాకి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎందుకనో అక్కడ నియమించిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు మాత్రం విధులు, నిధులు, అధికారాలు, పారిశుధ్య సిబ్బందిని మాత్రం విభజన చేయలేదు. ఫలితంగా ఇంకా పంచాయతీల్లోని గ్రేడ్-1-4 కార్యదర్శిల చేతుల్లోనే పంచాయతీలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో మేజర్ పంచాయతీల్లో  అదనంగా మరో రెండు గ్రామ సచివాలయాలు ఉన్నప్పటికీ అక్కడ ప్రభుత్వం నియమించిన గ్రేడ్-5 కార్యదర్శిలకు పనిలేకుండా పోయింది. సుమారు రెండేళ్లు కావొస్తున్నా వీరికి ఎలాంటి దస్త్రాలు ఇవ్వకపోవడమే పంచాయతీరాజ్ శాఖ చేసిన ప్రధాన తప్పుగా కనిపిస్తుంది..

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక్క గ్రామీణ ప్రాంతంలోని సచివాలయాల్లో సుమారు ఏడువేల మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఉన్నారు. ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం సచివాయాలను కేటాయించారు తప్పితే, ప్రభుత్వమే విడుదల చేసి జీఓ నెంబరు 149 ఆధారంగా వీరికి ఎలాంటి అధికారాలు కట్టబెట్టలేదు. ఫలితంగా ఏ చిన్న పనికోసమైనా, ఆఖరికి ఆయా సచివాలయాల పరిధిలో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నా పంచాయతీల చుట్టూ గ్రేడ్-5 కార్యదర్శిలు ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సమయం వ్రుధా అవుతుంది తప్పితే ప్రజలకు మాత్రం సేవలు అందడం లేదు. పంచాయతీల్లో నిధులు పుష్కలంగా వున్నాయి. ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయించకపోయినప్పటికీ ఇంటిపన్నులు, కుళాయి పన్నులు, విద్యుత్ మీటర్లు, ఇలా చాలా సర్వీసుల ద్వారా గ్రామపంచాయతీలకు అత్యధిక స్థాయిలో ఆదాయం సమకూరుతుంది. ఈ సమయంలో ప్రభుత్వం జనాభా ప్రాతిపధిక విభజించి సచివాలయాలను ఏర్పాటు చేసినట్టుగానే విధులు, నిధులు, అధికారాలూ కూడా విభజన చేసి వుంటే ఇప్పటికే అద్బుతమైన ఫలితాలు వచ్చి ఉండేవి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మండల స్థాయిలో ఎంపీడీఓ, జిల్లా స్థాయిలో డీపీఓ, జిల్లా కలెక్టర్ ఆఖరికి రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సైతం జీఓను అమలు చేయడానికి చొరవ చూపకపోవడంతో ప్రభుత్వం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది.

ప్రభుత్వం చేసిన తప్పుని ఎత్తిచూపకుండా.. నిధులు లేవని, పారిశుధ్య నిర్వహణ గ్రామాల్లో జరగడం లేదని ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారానికి దిగాయి. దానికి కారణం కూడా ప్రభుత్వమే. జనాభా ప్రాతిపధిక సచివాలయాలను విభజన చేసి అక్కడ సిబ్బందిని నియమించిన ప్రభుత్వం ఎందుకు పారిశుధ్య సిబ్బందిని కేటాయించలేదు.. ఎందుకు చెత్తతరలించే వాహనాలు సమకూర్చలేదు..ఎందుకు అధికారాలు, రికార్డులు బదలాయించలేదూ అంటే మాత్రం ఆ.. ఒక్కటీ అడక్కు అంటున్నాయి అధికార వర్గాలు.. చేయాల్సింది చేయకుండా ఫలితాలు వచ్చేయాలంటే ఎలా ఎలావస్తాయనే విషయంతో కనీసం ఆలోచించపోవడం విశేషం. సచివాలయాలకు కార్యదర్శిలను నియమించిన ప్రభుత్వం అదే సచివాలయాలకు పారిశుధ్య సిబ్బందిని కేటాయిస్తే ఎవరి గ్రామ సచివాలయ పరిధిలో ఆ గ్రేడ్-5 కార్యదర్శి పారిశుధ్య నిర్వహణ చేయడానికి 100 శాతం అవకాశం వుంటుంది. సచివాలయాలల్లో కార్యదర్శిలు ఉన్నా..  ప్రభుత్వం పరిధిలను విభజించకుండా మొత్తం పారిశుధ్య నిర్వహణ పంచాయతీలోనే ఉంచేయడం, అక్కడ పనిచేస్తున్న గ్రేడ్-1-4 కార్యదర్శిలకు ఇతర పంచాయతీలకు ఇన్చార్జిలుగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఉన్న పంచాయతీల్లో పారిశుధ్యం కాస్తా అపారిశుధ్యంగా మారుతోంది. దీనితో నిర్వహణ భారం పంచాయతీలకు గుది బండలా మారుతోంది. అలాగని గ్రేడ్-5 కార్యదర్శిలు పూనుకొని చేయించాలన్నా వీరికి ఎలాంటి అధికారాలు లేకపోవడంతో కనీసం పారిశుధ్య కార్మికులు సైతం వీరి మాట వినడం లేదు. తమ పంచాయతీ కార్యదర్శి చెబితే తప్పా తాము ఎక్కడికి వచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్టు రాష్ట్రవ్యాప్తం ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వకుండా ప్రభుత్వంపై బురదచల్లే మీడియాకి ప్రభుత్వమే అవకాశం కల్పించినట్టుగా వ్యవహరించడం ఇపుడు ప్రధాన చర్చగా మారింది. చేసిన తప్పుని పదే పదే మీడియా ఎత్తిచూపుతున్నా చూసి ముసి ముసి నవ్వులు నవ్వే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రజలకు గ్రామాల్లోనే సేవలందంచడానికి నియమించిన సచివాలయక గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు, విధులు, నిధులు బదలాయించే విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. ఇదే పద్దతి కొనసాగితే థర్డ్ వేవ్ లో పరిస్థితి మరింత దారుణంగా పరిణమించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.  పారిశుధ్య నిర్వహణ జరగగక.. ప్రజలకు మురుగు కంపే మిగిలి రోగాలతో రాష్ట్రం రాజ్యమేలడం ఖాయంగా కనిపిస్తుంది.. చూడాలి ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ మేలుకుంటుందో లేదో..!