శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం..
Ens Balu
2
Tirumala
2021-08-30 13:28:52
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి గోశాల నుంచి వెన్న తీసుకుని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని అర్చకులకు అందజేశారు.అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన కృష్ణాష్టమి పర్వదినం రోజున నవనీత సేవను ప్రారంభించుకోవడం మనందరి అదృష్టమన్నారు. కలియుగం ఉన్నంతకాలం ఈ సేవ కొనసాగుతుందన్నారు. ఇందుకోసం గోశాలలో దేశవాళీ గోవుల పాలతో పెరుగు తయారుచేసి, దాన్ని సంప్రదాయబద్ధంగా కవ్వాలతో చిలికి వెన్న తీస్తారని చెప్పారు. ఈ వెన్నను ప్రతిరోజూ గోశాల నుండి ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు తీసుకొచ్చి అర్చకులకు అందజేస్తారని వివరించారు. అర్చకులు వెన్నను స్వీకరించి శ్రీవారి కైంకర్యాలకు వినియోగిస్తారని తెలిపారు. వెన్న తయారీ, వెన్న ఊరేగింపులో శ్రీవారి సేవకులు పాల్గొంటారని వివరించారు. ముందుగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఛైర్మన్, ఈవో వెన్న తయారీని పరిశీలించారు. కవ్వంతో కుండలోని పెరుగును చిలికారు. ఈ సందర్భంగా గోశాల ప్రాంగణాన్ని రంగవళ్లులు, పుష్పాలతో అలంకరించారు.నవనీత సేవలో వెన్న తీసుకెళ్లి స్వామివారికి సమర్పించేందుకు గాను 1 కిలో 12 గ్రాముల బరువు గల వెండి గిన్నెను టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి విరాళంగా అందజేశారు. నవనీత సేవ ఊరేగింపులో చిన్నికృష్ణులు, గోపికల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. కోలాటం కళాకారులు కృష్ణుని భజన పాటలు ఆలపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, డెప్యూటీ ఈవోలు రమేష్‌బాబు, హరీంద్రనాథ్, విజయసారథి, లోకనాథం, భాస్కర్, విజిఓ బాలిరెడ్డి, టిటిడి బోర్డు మాజీ సభ్యులు శివకుమార్, ఎవిఎస్వోలు పవన్, గంగరాజు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.