మా కుటుంబాలేం పాపం చేశాయ్ సారూ..


Ens Balu
29
Tadepalle
2021-09-01 02:55:14

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంచేసినా దానికో లెక్కుంటుంది.. అదేంటో కాస్తతిక్క కూడా ఉన్నట్టే కనిపిస్తుందని గగ్గోలు పెడుతున్నారు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 15వేల4 గ్రామ, వార్డు సచివాలయాల్లోని లక్షా 24వేల మంది ఉద్యోగులు. ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాలు అతి తక్కువ జీతానికి రూ.15వేలు(బిపీఎల్ కుటుంబాల సంపాదన కంటే తక్కువ) సంపాదిస్తే.. కేవలం మేము రేషన్ కార్డులో ఉన్నామనే ఒకే ఒక్క కారణంతో ఏకంగా కార్డు మొత్తం రద్దు చేసేస్తే మాకుటుంబాలు ఏం తిని బతకాలని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులంతా. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు సంపాదించిన వారంతా నిరుపేదలేనని, కేవలం తాము ఆ కార్డులో ఉన్నందుకు కార్డు రద్దు చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తున్న వారిలో చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయశాఖలో అధికంగా ఉన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు బిపీఎల్ కుటుంబాలకిచ్చే రేషన్ కార్డులు వినియగించకూడదనే ఉత్తర్వుతో ఉద్యోగస్తులు స్వచ్చందంగా రేషన్ కార్డులు సరెండర్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఏ ప్రభుత్వ ఉద్యోగంలో అయినా ఉద్యోగం వచ్చిన వెంటనే పేస్కేలు ఇస్తారని అదేంటో తాము సాధించిన ఉద్యోగాలకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతాలు ఇస్తూ, ఇంకా సర్వీసులు రెగ్యులర్ చేయకుండానే రేషన్ కార్డులు తొలగించడం సరికాదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. కావాలంటే కార్డుల్లో ఉద్యోగాలు పొందిన తమను తొలగించి తమ కుటుంబాల కార్డులు అలాగే ఉంచాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నా అవి కనీసం ప్రభుత్వం ద్రుష్టికి చేరడం లేదు. ఏ ప్రభుత్వ శాఖలో అయితే ఏ శాఖ ఉద్యోగం వస్తే అదేశాఖకు సంబంధించిన విధులు నిర్వహిస్తారని, కానీ సచివాలయాల్లో ఉద్యోగులతో ప్రభుత్వం అన్నిశాఖలకు సంబంధించిన విధులను చేయిస్తుందని, అక్కడ కనిపించని నిబంధనలు తక్కువ జీతంలో ఉద్యోగాలు పొందిన తమ కుటుంబాల రేషన్ కార్డులను తొలగించడానికి మాత్రం నిబంధనలు అడ్డొస్తున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్నో ఆశలతో ఉద్యోగాల్లోకి వస్తే.. రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో తమకిచ్చే పేస్కేలు పరంగా చూసుకున్నా ఒక్కో ఉద్యోగి సుమారు రెండున్నర లక్షలకు పైనే జీతం కోల్పోయామని, దాని గురించి ఆలోచించని ప్రభుత్వం తమ రేషన్ కార్డుల విషయంలో ఉత్తర్వులు, ఉద్యోగాలకు ముడిపెట్టడం ఇదేం పద్దతంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగులకు అధికారాలు విధులు కట్టబెట్టని ప్రభుత్వం తమకు అనుకూలంగా మాత్రం అన్ని నిర్ణయాలను ఆగమేఘాలపై అమలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. నిబంధన ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డులు ఉండకూడదు వాటిని తొలగించిన ప్రభుత్వం అదే నిబంధనలు అమలు చేస్తూ గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు జీఓ నెంబరు 149 ప్రకారం అధికారాల బదలాయింపులు చేపడితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల సహేతుకంగా ఉన్నాయని అంతా భావించేవారమని, ఉద్యోగులను ఇబ్బందులు పెట్టాలంటే ఒక విధానం, ప్రభుత్వం లాభపడాలంటే మరో విధానం అమలు చేయడం పద్దతి కాదని వాపోతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తున్న తమను కార్డుల్లో నుంచి తప్పించి తమ కుటుంబ సభ్యులను అలాగే ఉంచి కార్డులు రద్దు చేయకుండా ఉంచాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మాత్రమే పనులు జరుగుతున్నాయి తప్పితే అభ్యర్ధనలు పట్టించుకునే సూచనలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి దగ్గర నుంచి రేషన్ కార్డులు తప్పించి, కనీసం అతితక్కువ జీతాలు తీసుకునే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది్ వేచిచూడాలి..!