ప్రముఖ ఆదాయ వనరుగా పర్యాటకరంగం..


Ens Balu
1
Tadepalle
2021-09-08 12:42:27

ప్రముఖ ఆదాయ వనరుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ది పర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,యువజన శాఖ మంత్రి ముత్తం శెట్జి శ్రీనివాసరావు తెలిపారు.  పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు, రవాణా, బోటింగ్ సౌకర్యాల మెరుగుతోపాటు పర్యాటక హోటళ్ల నిర్వహణను మెరుగుపర్చి ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వాటికి మంచి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో 13 జిల్లాలకు చెందిన పర్యాటక, క్రీడా శాఖలు, పర్యాటక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు. ప్రపంచంలో థాయిల్యాండ్, మలేషియా, స్విట్జర్లాడ్ వంటి 40 శాతం దేశాలు కేవలం పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే అభివృద్ది పథంలో పయనిస్తున్నాయని, అదే తరహాలో రాష్ట్రంలోని పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ది పర్చేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నామన్నారు.  కోవిడ్ కు ముందు సాలీనా రూ.120 కోట్ల మేర ఆదాయం పర్యాటక శాఖ ద్వారా వచ్చేదని, ప్రస్తుతం  కోవిడ్ పరిస్థితుల్లో అది రూ.60 కోట్లకు పడిపోయిందన్నారు. కోవిడ్ ఆసుపత్రులు,  కోవిడ్ సెంటర్లలో భోజన సదుపాయం కల్పించే బాధ్యతను పర్యాటక సంస్థ చేపట్టడం వల్ల అంతమాత్రం ఆదాయానన్నా సమకూర్చుకోవడం జరిగిందన్నారు. ఇటు వంటి గడ్డు పరిస్థితుల నుండి పర్యాటక శాఖను కాపాడి, స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకొనేలా పర్యాటక రంగాన్ని అభివృద్ది పరుస్తున్నామన్నారు. 
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, పర్యాటక హోటళ్ల వివరాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్క పర్యాటకునికి తెలిసే విధంగా ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వాటికి మంచి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించి దసరా పండుగలోపు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ యాప్ ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాంతాల ప్రాచుర్యం అందరికీ తెలిసే విధంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి మాసం ఒక ఈవెంట్ను నిర్వహిస్తామన్నారు.   రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కోస్తా మరియు రాయలసీమ పర్యాటక సర్క్యూట్లకు ఒక్కొక్క మేనేజరు చొప్పున మొత్తం నలుగురు మేనేజర్లను నియమించి ప్రత్యేక వోల్వో బస్సుల ద్వారా రెండు  లేక మూడు రోజులపాటు పర్యాటక ప్యాకేజిలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా సర్క్యూట్లలో గల పర్యాటక ప్రాంతాలకు చుట్టుప్రక్కల నున్న రాష్ట్రాల నుండి కూడా ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  పర్యాటక ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బోట్ల నిర్వహణ సజావుగా సాగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది  కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 24  ప్రభుత్వ, 164 ప్రైవేటు బోట్లు అన్నింటినీ ఆపరేషన్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నం, విజయవాడ, నాగార్జునసాగర్, సూర్యలంక తదితర ప్రాంతాల్లో సీ ప్లైన్ లను నడిపేందుకు సంబందిత సంస్థలతో చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు.   ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బాపట్ల, సూర్యలంక తదితర 13  ప్రాంతాల్లో ఐదు నక్షత్ర హోటళ్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని, ఇందులో 50 శాతం హోటళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నామన్నారు.  అదే విధంగా రాష్ట్రంలో ఉన్న 37 పర్యాటక హోటళ్ల నిర్వహణను మెరుగుపర్చి గూగుల్ సెర్చి టాప్ టెన్ బెస్టు హోటళ్లలో అవి కనిపించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.  కేంద్ర ప్రభుత్వ సహకారంతో “ ప్రసాదం” పథకం  అమల్లో బాగంగా  టెంపుల్ టూరిజం అభివృద్దికి చర్యలు చేపట్టామని, రూ.50 కోట్లతో శ్రీశైల దేవాలయం అభివృద్ది పనులు ఇప్పటికే చేపట్టామని, మరో రూ.50 కోట్లతో సింహాచల దేవస్థానం అభివృద్ది పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి, యువజన శాఖ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.రజత్ భార్గవ్ , ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ సి.ఇ.ఓ. ఎస్.సత్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.