విష్ణునివాసం లో గదుల కేటాయింపులు..


Ens Balu
3
Tirupati
2021-09-09 14:51:10

తిరుపతి లో రాబోయే శనివారం నుంచి భక్తులకు విష్ణు నివాసం లో గదులు  అందుబాటులోకి తేవాలని టీటీడీ జెఈవో  సదా భార్గవి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత కొంత కాలంగా కోవిడ్ వల్ల విష్ణునివాసం గదుల కేటాయింపు తాత్కాలికంగా నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఆమె విష్ణు నివాసం వసతి సముదాయం లోని గదులు, రిసెప్షన్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ,  ప్రతి ఫ్లోర్లో లిఫ్ట్ ఎదురుగా గదుల సమాచారం తెలిపే వివరాలు ఏర్పాటు చేయాలన్నారు.  అదేవిధంగా స్థానిక ఆలయాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమాచారం తెలియడం వల్ల భక్తులు సులభంగా స్థానిక ఆలయాలకు వెళ్ళే అవకాశం ఉంటుందని జెఈఓ చెప్పారు. శ్రీనివాసం నుంచి టూరిజం శాఖ స్థానిక ఆలయాలకు బస్సులు నడుపుతున్న విషయం విదితమే. విష్ణు నివాసంలో 50 శాతం గదులు భక్తులకు ఆన్ లైన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఐటి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విష్ణు నివాసం చుట్టూ మొక్కలు నాటి, ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటయ్యేలా చూడాలన్నారు.  అనంతరం ఆమె రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడుతూ, శనివారం నుంచి గదులు కేటాయించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అనంతరం ఆమె  రైల్వే స్టేషన్ వెనుక ఉన్న 2, 3 సత్రాలను  పరిశీలించారు. కోవిడ్ కారణంగా ఈ సత్రాలు భక్తులకు తాత్కాలికంగా కేటాయించనందువల్ల చిన్నపాటి మరమ్మతులకు గురికావడం,  పిచ్చి మొక్కలు పెరిగి ఉండటం  గమనించారు. గదుల మరమ్మతులు త్వరగా చేయించి పిచ్చి మొక్కలు తొలగించి ఈ ప్రాంతాన్ని సుందరంగా తయారుచేయాలని ఆదేశించారు.  ప్రస్తుతానికి మూడవ సత్రంలోని గదులు భక్తులకు అందుబాటులోకి తేవాలని,  ఈ లోపు రెండవ సత్రంలో మరమ్మతులకు గురైన గదుల పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. ఈఈలు  కృష్ణారెడ్డి,   సుమతి,  డిప్యూటీ ఈ ఈ  జోగయ్య,  సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ,  విష్ణు నివాసం ఏ ఈ ఓ  సీతామహాలక్ష్మి ఈ పర్యటనలో పాల్గొన్నారు.