mptc,zptc కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు..


Ens Balu
3
Tadepalli
2021-09-17 14:33:19

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19న జడ్పిటిసి,ఎంపిటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు ఎస్పిలు, డిపిఓలు,జడ్పి సిఇఓలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ  ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ కు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని సిఎస్ స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున ఆయా కౌంటింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పి లను సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు.అదే విధంగా కౌంటింగ్ కేంద్రాలకు సమీపంలో ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడ కుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్,ఎస్పిలు కూర్చుని కౌంటింగ్ సజావుగా జరిగేందుకు తగిన విధంగా ప్రణాళిక సిద్దం చేసుకొని సక్రమంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ చెప్పారు.ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్చార్జి గా పెట్టాలని సిఎస్ కలెక్టర్లును ఆదేశించారు. అంతేగాక జెసిలను పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియలో బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ కలెక్టర్లు ఆదేశించారు.

ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ జడ్పిటిసి ఎంపిటిసి ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం తోపాటు తాము అన్ని వేళలా సిద్ధంగా ఉంటామని తెలిపారు.కౌంటింగ్ కు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయంలో 24గంటలూ పని చేసేలా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి కౌంటింగ్ సజావుగా జరిగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న శాంతి భద్రతల అదనపు డిజిపి రవి శంకర్ మాట్లాడుతూ అన్ని కౌంటింగ్ కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వివరించారు. అంతేగాక అన్ని కేంద్రాల్లో నిరంతర సిసిటివి నిఘా పర్యవేక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

అంతకు ముందు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ కౌంటింగ్ నిర్వాహణకు సంబంధించిన మార్గ దర్శకాలను వివరిస్తూ ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మరియు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ల లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, జనరేటర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కౌంటింగ్ సిబ్బందికి వెంటనే మరో విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాల్లోకి బ్యాలెట్ బాక్సులను తీసుకువచ్చే సమయంలో పూర్తిగా సిసిటివి కవరేజ్ చేయాలని చెప్పారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తిగా శానిటేషన్ చర్యలు తీసుకోవాలని గిరిజా శంకర్ కలెక్టర్లును ఆదేశించారు. అదే విధంగా కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు అందరూ విధిగా మాస్క్,ఫేస్ షీల్డు వంటివి ధరించి గుర్తింపు కార్డుతో  కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించేలా చూడాలని  ఆదేశించారు. ఈవీడియో సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.