విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించనున్నట్టు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమనాయుడు, కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ తెలిపారు. ఈ మేరకు వారు బుధవారం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి దేవీనవరాత్రులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
7వ తేది నుంచి 15వ తేదీ వరకూ ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దుర్గాదేవి భక్తులకు దర్శం ఇస్తారని వివరించారు.11-10-2021న శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున శ్రీ అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందన్నారు. శ్రీ శివకామసుందరి దేవి అమ్మవారికి(ఉపాలయం)కూడా పేర్కొన్న విధంగా అలంకారములు ఉంటాయని తెలిపారు. ఆలయ దర్శనవేళలు, టిక్కెట్లు బుకింగ్, మార్పులు చేర్పులు కొరకు దేవస్థానం వెబ్సైట్ లో పూర్తివివరాలు పొందుపరుస్తామని వివరించారు.