ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సాధారణంగా ఉంటూ సంప్రదాయాలకు విలువ ఇచ్చేవ్యక్తి అని మంత్రాలయం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి చెప్పారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి దంపతులు, అదనపు ఈవోధర్మారెడ్డి దంపతులు మంగళవారం తిరుమల లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించి స్వామి వారి పూజలో పాల్గొన్నారు. అనంతరం వీరు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామివారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి మాట్లాడుతూ, రాఘవేంద్రస్వామివారి కుల దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. స్వామివారి ఆదేశంతో తిరుమల కు వచ్చి శ్రీ వేంకటేశ్వర కన్నడ భక్తి ఛానల్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం స్వామివారి దయతోనే జరిగిందన్నారు. కార్యక్రమం చాలా బాగా, సంప్రదాయ బద్దంగా నిర్వహించారని టీటీడీని అభినందించారు.