ప్రభుత్వ సెలవులన్నీ అదనపు విధులకే..!
Ens Balu
5
Tadepalli
2021-10-19 04:24:06
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా వచ్చే సాధారణ సెలవులన్నీ అధనపు విధులు హరించేస్తున్నాయి.. కాదు కాదు ఆవిధంగా అధికారులు వీరికి సెలవులు రానీయకుండా చేస్తున్నారు.. ప్రతీ పనీ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే చేస్తుందని కాస్త గట్టిగా మాట్లాడే అధికారులు.. ఏ నిబంధనతో ప్రభుత్వం ఇచ్చే సెలవు రోజుల్లో సచివాలయ ఉద్యోగులతో అదనపు విధులు నిర్వహిస్తున్నారో సెలవు రోజుల్లో డ్యూటీలు వేసే అధికారులు వివరించాల్సి వుంది.. ప్రభుత్వం ఇచ్చే సెలవురోజుల్లోనే సచివాలయ ఉద్యోగులకు ఏదో ఒక అదనపుపని అప్పగిస్తూ(అడిషనల్ ఫ్రీ డ్యూటీ.. ఇది ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాదు, లెక్కగట్టరు..) వీరికి కనీసం సెలవులను వినియోగించుకునే అవకాశం ఇవ్వడం లేదు. మిగిలిన శాఖల సిబ్బందితో పోల్చుకుంటే ఆరోగ్య సహాయకుల పరిస్థితి అయితే మరీదారుణం. వీరు చేపట్టే కోవిడ్ విధులకు వేళాపాలా అస్సలు ఉండటం లేదు. కోవిడ్ వేక్సినేషన్ సమయంలో ఉదయం 8గంటలకు ప్రత్యేక క్యాంపైన్ చేసే రోజుల్లో అయితే ఉదయం 6గంటలకే విధులకు హాజరైతే.. ఇచ్చిన టార్గెట్ వేక్సిన్లు పూర్తయ్యేవరకూ వాళ్లు ఇంటి మొహం పెట్టడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఆదివారాలు, 2వ శనివారాలు, ఇతర సాధారణ సెలవులు ఇలా ఎప్పుడు పడితే అపుడు వీరికి సెలవులను వినియోగించుకోకుండా చేస్తున్నారు అధికారులు. శెలవురోజుల్వో అధనపువిధులు చేసినందుకు వీరికి మిగిలిన సమయంలో సెలవులు ఇస్తున్నారా అంటే అదీలేదు. పైగా ఇచ్చిన ఇచ్చిన సెలవులన్నీ మాత్రం సిక్ లేదా సిఎల్ రిజిస్టర్ లో తప్పనిసరిగా రికార్డవుతున్నాయి.. అధికారులు వాటిని ఖచ్చితంగా నిబంధనల ప్రకారం చేయాలని ఆదేశాలు సైతం జారీచేస్తున్నారు. ఇలా సిఎల్ పెట్టినపుడు సెలవులను ప్రభుత్వ నిబంధనల ప్రకరారం రికార్డు చేసే అధికారులు, సెలవురోజుల్లో పనిచేసినందుకు మాత్రం ఎందుకు ప్రత్యేక ఆదేశాలతో పనిచేసినందుకు రికార్డు చేయడం లేదంటే.. అది మా పరిధిలో లేదని చేతులెత్తేస్తున్నారు. మరి ఎందుకు తమతో సెలవురోజుల్లోనూ అదనపు విధులు అప్పగిస్తూ ఎందుకు పనిచేయిస్తున్నారని ప్రశ్నిస్తే ఆ ఒక్కటీ అడక్కు అంటూ బీరాలు పోతున్నారు అధికారులు. ఇచ్చే రూ.15వేల జీతంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు ఒక లక్షా 24వేల మందికి పైగా ఉద్యోగులు ప్రభుత్వం ఏవిధంగా చెబితే ఆవిధంగానే విధులు నిర్వహించాల్సి వస్తుంది. సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన మూడు నెలలకేయ కోవిడ్ మహమ్మారి రాష్ట్రంలోకి ప్రవేశించడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ కరోనా పేరుతోనే సచివాలయ సిబ్బంది సెలవు రోజుల్లో కూడా అదనపు విధులు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అదనపు విధులు చేసినందుకు చాలా మంది ఉద్యోగులు కోవిడ్ బారిన సైతం పడ్డారు. కొందరు గ్రామవాలంటీర్లు, సచివాలయ, పంచాయతీ ఉద్యోగులు మ్రుత్యువాత పడిన సందర్భాలూ ఉన్నాయి. ఎవరూ ఎదురు ప్రశ్నవేయకుండా సర్వీసు రెగ్యులరైజేషన్ బూచీని చూపిస్తూ కొన్ని చోట్ల అధికారులు సైతం బెదిరింపులకు దిగుతుండటం విమర్శలకు తావిస్తుంది. వాస్తవానికి ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం సెలవు దినాల్లో ఉద్యోగులతో అదనపు పనులు చేయించకూడదు. ఒకవేళ చేయించాల్సి వస్తే.. అలా చేయించిన ప్రతీ పనికీ అంటే ఎన్నిరోజులు పనిచేస్తే అన్ని రోజులకు.. సాధారణ రోజుల్లో విధులకి ఇచ్చే జీతాన్ని లెక్క గట్టి ఉద్యోగులకు ఇవ్వాలి. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఈ నిబంధనల అమలు కాకపోగా ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా వచ్చే సెలవులను అధికారులే అదనపు పనులు అప్పగించి హరించేస్తున్నారు. అయితే ఇక్కడ అధికారులు కూడా కావాలని చేయడం లేదు.. ప్రభుత్వం వారికి అప్పగించిన పనిని సాధారణ రోజుల్లో కాకుండా సెలవు రోజుల్లోనే సచివాలయ ఉద్యోగులతో పనిచేయిస్తున్నారు. ఇప్పటికే సర్వీసు రెగ్యులరైజేషన్ పేరుతో కనీసం పేస్కేలు జీతానికి కూడా నోచుకోని సచివాలయ సిబ్బంది, ఇపుడు ప్రభుత్వం ఇచ్చే సెలవులను సైతం కోల్పోవాల్సి వస్తుంది. ఏమైనా అడగాలంటే వీరికి పై అధికారులుగా ఉన్న ఎంపీడీఓలు, వారిపై ఉండే డీఎల్డీఓలు, ఆపై గ్రామ, వార్డు సచివాలయ జేసీలు వీరిపై కన్నెర్ర జేస్తున్నారు. కొందరు ఉద్యోగులైతే అటు ప్రభుత్వం, ఇటు అధికారులు తమను కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా పరిగణించకుండా.. స్కూలు, కాలేజీ విద్యార్ధులను బెదిరించినట్టు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే వింత నిబంధనలు, సెలవు రోజుల్లో రికార్డుకాని అధనపు విధులు, రెండేళ్లు పూర్తయినా సర్వీసు నిబంధన అమలు చేయకపోవడం, ఉద్యోగులకు బెదిరిపులు ఇవన్నీ చూడాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ దేశవ్యాప్తంగా ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆర్జించినా.. ఇందులో పనిచేసే అత్యధికశాతం మంది ఉద్యోగుల నుంచి మాత్రం తీవ్ర నిరసన ఎదుర్కొనేలా చేస్తున్నాయి అధికారులు చేస్తున్న విధానాలు. ఈ విషయాలన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు, ప్రభుత్వం ఈ శాఖకోసమే నియమించిన గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లకు తెలిసినా, ఉద్యోగుల ఇబ్బందులు గుర్తించినా..షరా మామూలుగానే ప్రభుత్వ సెలవు దినాల్లోనే వీరికి అధనంగా పనులు అప్పగించడం విశేషం. బహుసా ప్రభుత్వ సెలవులకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అర్హులు కారేమో..!