ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల ప్రొభేషన్ డిక్లరేషన్, సర్వీసు రెగ్యులైజేషన్ కి సాంకేతిక కారణాలు, హైకోర్టులో దాఖలవుతున్న కేసులు ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఈ కారణాలన్నీ గట్టెక్కాలంటే కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ వార్త చదివే వారందరికీ కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. కాని సాంకేతిక కారణాలు, ఎదురుగా కనిపిస్తున్న సమస్యలు సంగతి తెలుసుకుంటే సచివాలయ ఉద్యోగులంతా ముక్కున వేలేసుకోక తప్పదు. వాస్తవానికి ఇదంతా ప్రభుత్వం కావాలని చేసినది కాకపోయినా రెగ్యులర్ జాబ్ కి పాటించాల్సిన నియమ నిబంధనలు ప్రభుత్వ శాఖలు ఖచ్చితంగా పాటించక తప్పని పరిస్థితి. అక్కడే అసలు చిక్కంతా వచ్చి పడింది. అదే సమయంలో కొందరు మండల అధికారులు, డివిజనల్ స్థాయి అధికారులు వారికేదో ప్రభుత్వం ప్రత్యేకంగా పిలిచి మరీ చెప్పినట్టుగా.. సచివాలయాల సందర్శనకు వచ్చిన సమయంలో పనిగట్టుకొని మరీ చేస్తున్న ప్రచారాలు కూడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెంచేస్తున్నాయి. దీనితో సచివాలయ ఉద్యోగాలు రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ సమయంలో కాకుండా మరో ఆరు నెలల నుంచి ఏడాది కాలం పట్టేయవచ్చే ప్రచారం ఊపందుకుంది. సాంకేతిక కారణాలు, కొందరు అధికారులు చేస్తన్న ప్రచార విషయం ఇదే శాఖలో వున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు సైతం తెలియకపోవడం, వారికి తోచినట్టుగా ప్రకటనలు మీడియాకి జారీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటై అక్టోబరు 2 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 10వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు ఒక లక్షా 24వేలకు పైగా ఉద్యోగులు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అందులో అత్యధిక శాతం మంది ఉద్యోగులు అక్టోబరు నెలలోనే విధుల్లోకి చేరలేదు. అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకూ విధుల్లోకి చేరిన వారూ ఉన్నారు. అంటే వారు విధుల్లో చేరిన దగ్గర నుంచి రెండేళ్లు పూర్తిస్థాయిలో సర్వీసు పూర్తిచేసుకుంటేనే ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వానికి ఆస్కారం వుంటుంది. అలా కాకుండా మెడికల్ లీవులు పెట్టినా, ప్రసూతి సెలవులు పెట్టి మళ్లీ సర్వీసు రెగ్యులైజేషన్ ను వాడుకున్న సెలవులన్నీ పూర్తి అయ్యేవరకూ అంటే.. విధుల్లోకి చేరిన తేది తరువాత ఆరునెలలు దాటితేనే(ప్రసూతి, మెడికల్ సెలవులకు అయితే) వారి ఉద్యోగాలు రెగ్యులర్ చేయడానికి మాత్రమే వీలుపడుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కోవిడ్ వైరస్ వచ్చి 14 రోజులు మెడికల్ సెలవులు తీసుకున్నా, అంతకంటే అధికంగా సెలవులు తీసుకున్నా అదే పరిస్థితి ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈ విషయం చాలా మంది ఉద్యోగులకు తెలియదు. ఈ అంశాలన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తప్పించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి లేఖలు రాసినా, సర్వీసు రూల్స్ ని రెగ్యులర్ ఉద్యోగులకు ఖచ్చితంగా అమలు చేసి తీరక తప్పని పరిస్థితి ప్రభుత్వానిది. ఆ విధంగా నిబంధనలు పొందుపరిచారు.
ప్రభుత్వంలో ఏ శాఖలోని రెగ్యులర్ జాబ్ అయినా ప్రొబేషన్ పూర్తి అయి సర్వీస్ రెగ్యులర్ కావాలంటే.. ఖచ్చితంగా రెండేళ్లు ప్రొబేషన్ పూర్తిచేసుకొని తీరాల్సిందే. దీర్ఘకాలిక సెలవులు పెట్టకూడదు. శాఖపరమైన శిక్షణ పూర్తిచేసుకొని ఉండాలి. డిపార్ట్ మెంటల్ టెస్టులు కూడా ఖచ్చితంగా పాసై వుండాలి. అన్నింటికంటే మించి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ రెగ్యులర్ కావాలంటే సర్వీస్ రిజిస్టర్(ఎస్.ఆర్) ప్రారంభంతో పాటు పోలీస్ వెరిఫికేషన్ పూర్తి అయి వుండాలి. అవన్నీ ఏ ఉద్యోగి అయితే క్లియర్ చేసుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వం సర్వీసుని రెగ్యులర్ చేస్తుంది. అలాకాకుండా ఏ ఒక్కటి మిగిలిపోయినా వారి సర్వీసు అనుకున్న సమయానికి రెగ్యులర్ కాకపోగా, నిబంధనలను అనుసరించి సమయం వచ్చే వరకూ ప్రభుత్వానికి సర్వీసు రెగ్యులర్ చేసే అవకాశం వుండదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికైన సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏ నిబంధన అమలు చేయకపోయినా సదరు శాఖ జిల్లా అధికారులు, డిఎస్సీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఇరకాటంలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇక గ్రామ, వార్డు సచివాలయ శాఖలో సాంకేతిక కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలో ఉన్న ఉద్యోగులంతా వారి విధుల్లోకి ఒకే సమయానికి చేరలేదు. అక్టోబరు 2 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకూ విధుల్లో చేరుతూనే ఉన్నారు. అలా చూసుకుంటే వీరి ప్రొబేషన్ సమయం పూర్తవ్వాలంటే ఫిబ్రవరి వరకూ ఆయా ఉద్యోగుల విధుల్లో చేరిన నెలను బట్టి ఆధార పడి వుంటుంది. అంతేకాకుండా అన్నిశాఖల ఉద్యోగులకు శాఖాపరమైన శిక్షణ పూర్తికాలేదు. చాలా మందికి డిపార్ట్ మెంటల్ పరీక్షలు కూడా పూర్తికాలేదు. అన్నింటికంటే మించి 60శాతం ఉద్యోగులకు పోలీస్ వెరిఫికేషన్ ఇంకా పూర్తికాలేదు. కొన్నిశాఖల ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు పూర్తయినా వారు పాస్ అయ్యారో, లేదో వారి ఫలితాలు వెలువడకపోవడం కూడా మరో కారణం. వీటితోపాటు పలు కేసులు హైకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ రాకపోవడం. ఇంత వరకూ ఒక ఎత్తైతే కొందరు మండల అధికారులు, డివిజనల్ స్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కావడానికి మరో ఏడాది సమయం పడుతుందని, అప్పటి వరకూ ఇప్పుడిచ్చే జీతం రూ.15వేలు కాకుండా రూ.20వేలకు పెంచి ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. కాగా అక్టోబరు 2 నాటికి ఎంతమంది ఉద్యోగులకైతే రెండేళ్లు పూర్తయిందో వారి సర్వీసులను సర్వీస్ రూల్స్ ను అనుసరించి రెగ్యులర్ చేయాలంటూ గ్రామ, వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి నుంచి వచ్చిన సర్క్యులర్ ఆధారంగా జిల్లాల్లో గ్రామ,వార్డు సచివాలయ జెసీలు ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు. అదీ కూడా పైన పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే.
మరోపక్క గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో ప్రసూతి సెలవుల అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా సర్వీసు రెగ్యులర్ చేయాలని, మెడికల్ లీవులు(కరోనాలీవ్, సిక్ లీవ్)ను కూడా పరిగణలోకి తీసుకోకుండా చూడాలని ఉద్యోగ సంఘాలు చేసిన వినతిపత్రాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది(ఇంకా పరిశీలన దశలోనే ఉంది). అంతా బాగుంది అనుకుంటే మహిళా పోలీసులను జీఓ నెంబరు 59 ద్వారా పోలీసుశాఖలో విలీనం చేయడం చట్టవిరుద్దమంటూ హైకోర్టులో కేసుపడటం, అంతేకాకుండా జీవో నెంబరు 2 ద్వారా గ్రామకార్యదర్శిలకు కాకుండా వీఆర్వోలకు డీడీఓ అధికారాలు కట్టబెట్టిన అంశం కూడా హైకోర్టు పరిధిలోనే వుంది. ఈ విషయంలో ప్రతివాది పంచాయతీలు ఉండగా ఎందుకు గ్రామసచివాలయాలను ఏర్పాటు చేయాల్సివచ్చిందనే ఘాటు వ్యాఖ్యలను కూడా హైకోర్టు చేయడం ప్రభుత్వం తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంది. పైగా సుమారు 5 నుంచి 10 శాతం మంది ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం, మరి కొందరు ఉద్యోగులను జెసిలు, జిల్లా కలెక్టర్లు కొన్ని కొన్ని శాఖాపరమైన అంశాల్లో సస్పెండ్లు చేయడం(కొందరికైతే ఇంకా రీపోస్టింగ్ ఆర్డర్లు కూడా ఇవ్వలేదు) ఇలా ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కు అడుగడుగునా అవాంతరాలే కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వలను, సర్వీసు నిబంధనలను అనుసరించి 19ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు సంబంధించి జిల్లా అధికారులు జాబితాలను సిద్దం చేస్తున్నప్పటికీ పరిస్థితి ఇప్పుడప్పుడే తీరేటట్టుగా అయితే కనిపించడం లేదనే విషయం ఎదరుగా వున్న కొరకరాని కొర్రీలే స్పష్టం చేస్తున్నాయి. చూడాలి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. వీరి సర్వీసును రెండేళ్లు ప్రొబేషన్ పూర్తిచేసుకున్నవారికి ఎంతమందికి సర్వీసు రెగ్యులర్ చేస్తుందో.. పేస్కేలు ఏవిధంగా అమలు చేస్తుందో..!