ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలకు జీఓనెంబరు.149 ద్వారా అధికారాలు బదలాయించే విషయంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమీషనర్ ఇంకామీన మేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి నెత్తీనోరూ కొట్టుకుంటూ ఏపనైనా ప్రభుత్వ జీఓ ప్రకారమే ఖచ్చితంగా చేయాలని ప్రతీ సమావేశంలో ఆదేశించినా.. జీఓలను అతిక్రమమించ వద్దని సూచించినా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మాత్రం పట్టడం లేదు. ఫలితంగా గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై అక్టోబరు 2 నాటికి రెండేళ్లు పూర్తిచేసుకున్నా ఇంకా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలు ఎలాంటి అధికారాలకు నోచుకోలేదు. పేరుకి సచివాలయంలో కార్యదర్శిగా ఉన్నా ఎలాంటి అధికారం ప్రభుత్వం కల్పించకపోవడం వీరంతా నేటికీ ఉత్సవ విగ్రహాల్లానే నిలబడాల్సి వస్తుంది. అసలు తమను ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో సచివాలయాలకు కార్యదర్శిలుగా నియమించిందో అర్ధం కావడం లేదని, అమలు చేయని జీఓలను ఎందుకు విడుదల చేసిందో తెలియడం లేదని గ్రేడ్-5 కార్యదర్శిలంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలకంటే అత్యధికంగా పంచాయతీల్లో పనులు చేస్తున్నా, తమను మాత్రం ప్రభుత్వం చిన్నచూపే చూస్తుందని ఫలితంగా ప్రజలకు అధికారికంగా ఎలాంటి సేవలు అందించలేని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. దేశం మొత్తం తొంగిచూసేవిధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి తమను సిబ్బందిగా నియమించిందనే పేరు, ఆనందం కంటే.. నియమించి ఎలాంటి అధికారాలు ఇవ్వలేదనే బాధ, నిరాసే అధికంగా వుందని కార్యదర్శి మొహాలు చిట్లిస్తున్నారు. ఒక దశలో తాము ఎందుకు పనిచేస్తున్నామో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వమైనా ఒక జీఓను విడుదల చేస్తే దానిని అమలు చేస్తుందని..విచిత్రంగా జీఓ ఇచ్చిన తరువాత రెండేళ్లు గడిచినా జీఓలను అమలు చేయని రాష్ట్రప్రభుత్వ అధికారులను ఇక్కడే చూస్తున్నామని సచివాలయ సిబ్బంది చీదరించుకుంటున్నారు. ప్రజలకు ఏదో చేద్దామని ఎంతో ఉన్నత ఆశయంతో ఉద్యోగాల్లోకి చేరితే..నాటి నుంచి నేటి వరకూ ఏ అధికారం లేకుండా ఉన్న సిబ్బందిని సూపర్ వైజ్ చేయడానికి తాము పనిచేస్తున్నట్టు అవుతుందని చెబుతున్నారు. ఆదిలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఇక జీఓలను పూర్తిగా తమ శాఖ ఉన్నతాధికారులే పక్కనపెట్టేస్తారని దానికి ప్రత్యేక ఉదాహరణ జిఓనెంబరు 149 గా నిలుస్తుందని అంటున్నారు.
మరోరా సారి కోర్టులో భంగపాటు తప్పదా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి భంగపాటు పంచాయతీరాజ్ శాఖ ద్వారానే కలిగేటట్టు కనిపిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంభించి, నిబంధనలను, జీఓలను అమలు చేయని శాఖగా అత్యధిక కోర్టు కేసులు ఎదుర్కొంటున్న పంచాయతీరాజ్ శాఖ గ్రేడ్-5 కార్యదర్శిలు తమ అధికారాలు, విధులు, నిధులు బదాలాయింపు జీఓనెంబరు 149 ద్వారా చేయాలని కోర్టుకి వెళితే మరోసారి సారి వార్తల్లో నిలిచేలా వుందంటున్నారు విశ్లేషకులు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ లు ఉద్దేశ్య పూర్వకంగానే గ్రేడ్-5 కార్యదర్శిలకు రావాల్సిన అధికారాల బదాలాయింపు జీఓనెంబరు 149ని తొక్కిపెట్టారనే విషయం ఇప్పటికే రెండేళ్లుగా స్పష్టమవుతూనే వుంది. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించే పనికూడా ఉండదు. వాస్తవానికి సర్వీసు నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బందికి ఇవ్వాల్సిన అధికారాలన్నీ ప్రభుత్వం జీఓ ద్వారానే కల్పిస్తుంది. అలా అధికారాలు ఇవ్వడానికే ఇచ్చిన జీఓనెంబరె 149ని మాత్రం గ్రేడ్-5 కార్యదర్శిలకు ప్రభుత్వం ఇప్పటి వరకూ అలుచేసి అధికారాలు కల్పించలేదు. అధికారాలులేని ఉద్యోగం కల్పించడం ఎందుకని రేపుపొద్దున్న వీరంతా వేసిన కేసులో కోర్టు ప్రశ్నిస్తే అధికారులు అక్కడ కూడా తెల్లమొహం వేసే పరిస్థితి ఎదురవుతుంది.
ఇప్పటికే డిడిఓ అధికారాలు పంచాయతీ కార్యదర్శి నుంచి వీఆర్వోలకు బదిలీ చేసిన విషయంలో కోర్టు నుంచి మొట్టికాయలు తిన్న పంచాయతీరాజ్ శాఖకు అప్పట్లో కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు..అదే పంచాయతీలు ఉండగా గ్రామసచివాలయాలు ఎందుకు అదనంగా ఏర్పాటు చేశారనే గుర్తున్నా.. ఆమాటలతో మళ్లీ డిడిఓ అధికారాలు పంచాయతీ కార్యదర్శిలకే అప్పగించినా.. ఎందుకనో గ్రేడ్-5 కార్యదర్శిల విషయంలో మాత్రం మొండి వైఖరి అవలంభిస్తోంది. ఈ సమయంలోనే తమ సర్వీసులు రెగ్యులర్ కాకుండా కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండాలని బావించిన గ్రేడ్-5 కార్యదర్శిలంతా సర్వీసు రెగ్యుల్ అయిన మరుక్షణం తమ అధికారాల కోసం కోర్టుకి వెళ్లి ప్రభుత్వాన్ని, పంచాయతీరాజ్ శాఖను ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇంత వరకూ తాము అధికారులే జీఓనెంబరు 149 అమలు చేస్తారని భావించామని, ఈ విషయంలో ఎంపీడీఓలు, డీపీఓలు, జెసి, జిల్లా కలెక్టర్ ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి సైతం వినతి పత్రాలు ఇచ్చినా అవి బుట్టదాఖలే అయ్యాయని ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో తమకి న్యాయం జరగాలన్నా, ప్రజలకు తమను నుంచి సేవలు అందాలన్నా అధికార బదలాయింపు జరగాల్సిందేనంటున్నారు గ్రేడ్-5 కార్యదర్శిలు. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనేది..!