1 ENS Live Breaking News

డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జితో అవసరాల ఉత్ప‌త్తులు..

డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి ద్వారా టిటిడి అవ‌స‌రాల‌కు త‌గిన ఉత్ప‌త్తులు త‌యారు చేసి ఇవ్వ‌డానికి ముందుకు రావాల‌ని  టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను కోరారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని త‌న ఛాంబ‌ర్‌లో బుధ‌వారం ఈవో డాక్ట‌ర్ వై.ఎస్‌.ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డాక్ట‌ర్ జాన‌కిరామ్, ప‌శువైద్య విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డాక్ట‌ర్ ప‌ద్మానాభ‌రెడ్డి,  ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం డైరెక్ట‌ర్ అఫ్ ఎక్స్‌టెన్ష‌న్ డాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌తో స‌మావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి ద్వారా బొకేలు, ల్యామినేటెడ్ ఫోటోలు, పేప‌ర్ వెయిట్స్ త‌దిత‌ర ఉత్ప‌త్తుల త‌యారీలో నైపుణ్యం ఉన్నడాక్ట‌ర్ వై.ఎస్‌.ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ముందుకు వ‌స్తే తిరుప‌తిలో స్థ‌లం కేటాయిస్తామ‌ని చెప్పారు. ఇందులో ఉత్ప‌త్తుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే యంత్రాలు, సౌక‌ర్యాలతో పాటు, ప‌రిశోధ‌న కేంద్రం ఏర్పాటు చేసుకోవ‌చ్చున‌ని సూచించారు. ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఈ కేంద్రాన్ని నిర్వ‌హించుకుని త‌రువాత టిటిడికి అప్ప‌గించే ప్ర‌తిపాద‌న ప‌రిశీలించాల‌న్నారు. డాక్ట‌ర్ వై.ఎస్‌.ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి డాక్ట‌ర్ జాన‌కిరామ్ మాట్లాడుతూ త‌మ విశ్వ‌విద్యాల‌యం డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జి ద్వారా ఇప్ప‌టికే రోజ్‌టీ, లిల్లీ టీ, లెమ‌న్ గ్రాస్‌ మ్యారిగోల్డ్ టీ, హైబిస్క‌స్ టీ, సోపులు, బాడీ కెర్ ఉత్ప‌త్తులు, ఫేషియ‌ల్ క్రీములు, మాస్క్‌లు, స్ప్రే లాంటి అనేక ఉత్ప‌త్తులు స్థానికంగానే త‌యారు చేస్తున్నామ‌ని చెప్పారు. ఇందుకోసం సిబ్బందికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇస్తున్నామ‌న్నారు. ఈ స‌మావేశంలో జెఈవో స‌దా భార్గ‌వి, సిఇ  నాగేశ్వ‌ర‌రావు, గార్డెన్ సూప‌రింటెండెంట్  శ్రీ‌నివాస్‌, డిఎఫ్‌వో  చంద్ర‌శేఖ‌ర్ పాల్గొన్నారు.          

తిరుమల

2021-08-18 13:42:13

అప్కోవస్త్రాలు ప్రత్యేక డిస్కౌంట్ సేల్..

శ్రీకాకుళం పట్టణంలో ఆప్కో కేంద్రాలలో చేనేత వస్త్రాల డిస్కౌంట్ సేల్ నిర్వహిస్తున్నట్లు ఆప్కో డివిజనల్ మేనేజర్ బీవీ రమణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేస్తూ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న చేనేత భవన్ లో ఆప్కో మెగా షోరూం,  జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఎగ్జిబిషన్ కౌంటర్లో  వస్త్రాలను డిస్కౌంట్ పై విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన పేర్కొంటూ డిస్కౌంట్ సేల్ ఆగస్టు 18వ తేదీ వరకు రెండు కౌంటర్లలో కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం 30 శాతం డిస్కౌంట్ కు అదనంగా 5 శాతం కలిపి 35 శాతం డిస్కౌంట్ తో విక్రయాలను చేస్తున్నట్లు ఆయన వివరించారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి చేనేతకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.

Srikakulam

2021-08-10 15:34:49

త్వ‌ర‌లో పంచ‌గ‌వ్య ఉత్ప‌తుల తయారీ..

దేశీయ గోవుల ద్వారా సేక‌రించే పంచ‌గ‌వ్యాల‌తో హెర్బల్ ప్రొడక్ట్స్ త‌యారీని వేగ వంతం చేయాల‌ని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో శుక్ర‌వారం ఈవో ఎస్వీ గోశాల అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పంచ‌గ‌వ్యాలలో ధూపం, స‌బ్బులు, అగ‌ర‌బ‌త్తీలు, ప‌రిశుభ్ర‌తా సామ‌గ్రి లాంటి ఉత్ప‌త్తుల్లో వీలైన‌న్ని టిటిడి గోశాల‌లో త్వ‌రిత గ‌తిన త‌యారీకి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎస్వీ గోశాల అధికారుల‌ను ఆదేశించారు. కోయంబత్తూర్‌లోని ఆశీర్వాద్‌ ఆయుర్వేద ఫార్మసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు వివిధ పంచగవ్య ఆధారిత మూలికా ఉత్పత్తుల తయారీకి అర్హత క‌లిగి ఉన్న‌ట్లు తెలిపారు.  పూజ‌లో వినియోగించే పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులైన ధూప్‌చూర్ణం, అగరబత్తీలు, సాంబ్రాణి కప్‌లు, ధూప్ స్టిక్స్‌, ధూప్ కోన్‌లు టిటిడి, గృహ,  శైవ దేవాలయాలలో వినియోగం కోసం విబూదిని త‌యారుచేసి త్వ‌ర‌లో విక్ర‌యాలు ప్రారంభించాల‌న్నారు. అదేవిధంగా పంచగవ్య టూత్ పౌడర్, ఫేస్‌ప్యాక్‌, సోప్, మూలికా షాంపూలు, నాజల్ డ్రాప్స్‌, గో ఆర్క్ అందుబాటులో ఉంచాల‌న్నారు. టిటిడి వసతి స‌ముదాయాలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో పంచగవ్య హెర్బల్ ఫ్లోర్ క్లీనర్‌ను ఉపయోగించాల‌న్నారు. హోమ కార్య‌క్ర‌మాల్లో వినియోగించే ఆవు పేడ‌తో చేసిన పిడ‌క‌లు త‌దిత‌ర వాటిని సిద్ధంచేయాల‌న్నారు. వీటి స్టోరెజ్ కొర‌కు తిరుప‌తిలోని డిపిడబ్ల్యు స్టోర్‌ను ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులను మొద‌ట  తిరుమల, తిరుపతిల‌లో, తరువాత బ‌య‌ట ప్రాంతాల్లో విక్రయించాల‌ని ఈవో సూచించారు.

          ఈ స‌మీక్ష‌లో సిఇ  నాగేశ్వ‌ర‌రావు, ఎఫ్ఎ అండ్ సిఏవో  బాలాజి, ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, గోశాల అధికారులు పాల్గొన్నారు.   అంతకుముందు ఈవో గోసంరక్షణ శాల కార్యకలాపాలపై అధికారులతో సమీక్షించారు.

Tirumala

2021-07-30 17:32:58

ఆగస్టు15 నుంచి టిటిడి అగరబత్తి అమ్మకాలు..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో స్వామి వార్లకు ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ ముడి సరుకు ఖర్చు మాత్రమే తీసుకుని,   అగర బత్తులు తయారుచేసి టీటీడీకి ఇస్తుందన్నారు. వీటికి ఎంఆర్ పి నిర్ణయించి అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మొదటి విడతగా తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద ఆగస్టు 15న అమ్మకాలు ప్రారంభించి, తరువాత ఇతర ప్రాంతాల్లో విక్రయాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. పంచ గవ్య తోటి తయారు చేయాలని నిర్ణయించిన 15 రకాల ఉత్పత్తుల గురించి ఈవో అధికారులతో చర్చించారు. వీటిని త్వరలోనే విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని బలోపేతం చేసి మరిన్ని ఉత్పత్తులు తయారు చేయడంపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే 115 రకాల ఉత్పత్తులకు ఆయుష్ మంత్రిత్వశాఖ నుంచి లైసెన్స్ తీసుకున్నామని అధికారులు తెలిపారు.  మరో 70 ఉత్పత్తుల తయారీకి లైసెన్స్ తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. ఫార్మసీ ఆధునీకరణ పనులు త్వరగా పూర్తి చేసి, అవసరమైన కొత్త యంత్రాలు సమీకరించుకోవడానికి ఈ నెలాఖరుకు టెండర్లు పూర్తి చేయాలని ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎఫ్ఏ అండ్ సిఏవో  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, ఎస్ఈ  జగదీశ్వర రెడ్డి, ఎస్వీ డైరీఫామ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ సమావేశంలో పాల్గొన్నారు.

Tirumala

2021-07-23 13:15:33

ఖరీఫ్ కి డీలర్లు సిద్దంగా ఉండాలి..

ఖరీఫ్ సీజన్ లో రైతులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ ఉత్పాదక డీలర్లు సిధ్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు.  బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలోని విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల డీలర్లు, వ్యవసాయాధికారులతో వ్యవసాయ ఉత్పాదకత, నాణ్యతాప్రమాణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకత డీలర్లు నిజాయతీతో క్రయ విక్రయాలు చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. రైతులతో అన్యాయంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. గతంలో రైతులు బ్యాంక్ లోన్ లతో పాటు, వ్యవసాయ ఉత్పాదకతల కోసం తిరిగే పరిస్ధితి ఉండేదన్నారు. ముఖ్యమంత్రి ఈ పరిస్ధితులను అధిగమించే విధంగా ఒన్  స్టాప్ విధానంలో రైతు భరోసా కేంద్రాలు ప్రవేశపెట్టారన్నారు. డిలర్లు తమ పరిధిలోని ఆర్.బి.కె.ల ద్వారా తమ ఉత్పాకతలను విక్రయించుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతు కొనుగోలు చేసే ప్రతి వ్యవసాయ ఉత్పాదకతకు తప్పనిసరిగా రసీదు జారీ చేయాలన్నారు. రసీదు జారీ వలన రైతు తో పాటు డీలర్ కు లాభం చేకూరుతుందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ ఉత్పాదకతలు నిర్వహించే ప్రతీ డీలరు తప్పని సరిగా రికార్డు నిర్వహించడంతో పాటు లైసెన్సు ఆయా షాపుల్లో ప్రదర్శించాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పరుగు మందుల జారీలో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని, తదనుగుణంగా డీలర్లు తమ ఉత్పదకతల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే విధంగా గతంలో కన్నా భిన్నంగా ప్రతి గ్రామంలో అర్హత కలిగిన వ్యవసాయ సెక్రటరీలు పని చేస్తున్నారని, వీరి సేవలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. 
జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ) జి.లక్ష్మిశ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం విత్తనం నాటిన నాటి నుండి పంట చేతికి వచ్చే వరకు పూర్తి భరోసా ఇస్తుందని, తదనుగుణంగా డీలర్లు వ్యవహరించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వలన రైతులు ఆర్ధికంగా నష్టపోతారని, తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. డీలర్లు లైసెన్సుల నిబంధనల పట్ల తక్కువ అవగాహన తో ఉన్నారని, ఇది సరైన చర్య కాదన్నారు. కంపెనీల నుండి వచ్చే వ్యవసాయ ఉత్పాదకతల పట్ల ఏమైన సేందేహాలు ఉంటే వ్యవసాయాధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలన్నారు. సందేహాల నివృత్తి కోసం ఆర్.బి.కె.ల సేవలు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో పురుగు మందుల షాపుల లైసెన్సూలు-1136 , విత్తనాల డీలర్ల లైసెన్సులు – 515, ఎరువుల షాపుల లైసెన్సులు – 1181 గా ఉన్నాయని జేసి లక్ష్మిశ వివరించారు. 
జిల్లా ఎస్.పి. నయీమ్ అద్నాన్ అశ్మీ మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పదకతల పంపిణీ వ్యవహారంలో ఏమైన అవక తవకలు జరిగితే రెవెన్యూ, పోలీస్, ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు కఠినంగా వ్యవహరిస్తాయన్నారు. 
వ్యవసాయ శాఖ జేడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం రైతులు వ్యవసాయ ఉత్పాదకత డీలర్ల వద్ద వస్తారన్నారు. అలాంటి సమయంలో వారికి నాణ్యతతో కూడిన వాటిని అందించాలన్నారు. సీజనల్ లో మధ్యస్ధ వర్గాల ద్వారా వ్యవసాయ ఉత్పాదకాలు పంపిణీ జరుగుతుందని, వీటి వలన అనర్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాంటి వాటిని ప్రోత్సహించ కూడదన్నారు. డీలర్ల వద్దకు వచ్చే ఉత్పాదకాలను వెంటనే స్ధానిక వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి నాణ్యతా ప్రమాణాలు తెల్సుకోవాలని జేడి పలు సూచనలు చేశారు. ప్రతీ డీలర్ తమ షాపు వద్ద స్టాకు బోర్డుతో పాటు ధరల పట్టీ ప్రదర్శించాలన్నారు. 
విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్.పి. రవి కుమార్ మాట్లాడుతూ రైతులు, విభిన్న వర్గాల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతాల నాణ్యతా లోపాలపై తగు సమాచారం తమ దృష్టికి వస్తుందన్నారు. వీటిని బేరీజు చేసుకుని, తనిఖీలుచేపట్టడం జరుగుతుందన్నారు. తనిఖీ సమయంలో ఖచ్చితంగా ప్రభుత్వ మార్గదర్శకాలు, లైసెన్సు నియమ నిబంధనలు పాటిస్తున్నదీ లేనిది పరిశీలించడం జరుగుతుందన్నారు. కాలం చెల్లిన ఉత్పాదకతల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డీలర్లు వ్యవహరించాలని ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్.పి. రవికుమార్ డీలర్లకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు బి.రామారావు, జి.వి.పద్మశ్రీ, వ్యవసాయ ఉత్పాదకతల డీలర్లు, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Kakinada

2021-07-07 15:20:29

ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్..

శ్రీకాకుళంజిల్లాలో పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ కల్పించడం కోసం ప్రభుత్వంతో మాట్లాడి కిసాన్ రైలును ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ కొబ్బరి రైతులకు హామీ ఇచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కొబ్బరి ఉత్పత్తి కమిటీలు,  రైతులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యానవన రైతులు పండిస్తున్న పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించి వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాడి కిసాన్ రైలును ప్రారంభించిందని అన్నారు. తొలిసారిగా మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో కిసాన్ రైలును ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కిసాన్ రైలులో ఉద్యాన పంటలు, పండ్లు, కూరగాయలు, పూలు రవాణా చేయవచ్చని చెప్పారు. లారీ లాంటి వాహనాలలో అయితే ఖర్చు ఎక్కువ, సమయం అధికంగా అవుతుందని, కిసాన్ రైలు ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో మంచి గిట్టుబాటు ధర లభించనుందని కలెక్టర్ గుర్తుచేసారు. సరైన గిట్టుధర లేక ఇబ్బంది పడుతున్న పండ్లు, కూరగాయల రైతులకు ఇది ఊరటగా ఉంటుందని కలెక్టర్ సూచించారు. కొబ్బరి పంటతో పాటు పలు ఉద్యాన పంటలకు  జిల్లా ప్రసిద్ధి చెందిందని, వాటిని కిసాన్ రైలు ద్వారా మార్కెట్ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తొలుత కొబ్బరి ఉత్పత్తి కమిటీలతో మాట్లాడి పలు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ దీనిపై పునరాలోన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని సంఘాలను, రైతులను, అధికారులను  కోరారు.   ఈ కార్యక్రమంలో ఏ.పి.యం.ఐ.పి పథక సంచాలకులు ఏ.వి.యస్.వి.జమదగ్ని, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు పి.యల్.ప్రసాద్, టెక్కలి సహాయ సంచాలకులు ఆర్.వి.వి.ప్రసాద్, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి.శ్రీనివాసరావు, ఏ.పి.మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ కె.యు.పి.రమణి, ఉద్యానవన అధికారులు ఎం.అనూష, పి.స్వాతి, సిహెచ్.చంద్రశేఖరరావు, పి.ప్రసాద్, సిహెచ్.శంకరరావు, పి.మాధవీలత, కొబ్బరి ఉత్పత్తి కమిటీల అధ్యక్షులు జి.రాజు, బి.మోహనరావు, బి.వెంకటేశ్వరరావు, ఎ.శివాజీ, బి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-03-19 17:01:42

20 నుంచి శిల్పారామంలో క్రాఫ్ట్ బజారు..

తిరుపతి శిల్పారామంలో ఈనెల 20 నుంచి క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేస్తున్నారు. శిల్పారామం నుంచి ఒక ప్రకటన వెలువడింది. భారత ప్రభుత్వం హస్త కళా అభివృద్ది  మరియు జౌళి మంత్రిత్వ శాఖ – న్యూ ఢిల్లీ వారి సౌజన్యం తో మెగా క్రాఫ్ట్ బజారు ( చేతి వృత్తి ఉత్పత్తుల) మేళాను తిరుపతిలో ఏర్పాటు చస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. దాదాపుగా  ఏడు  రాష్ట్రాల నుండి  60-80 కళాకారులు వారి వారి ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మాకాలు చేపడతారని పేర్కొన్నారు. తిరుపతి వాసులు ఈ ప్రత్యేక క్రాఫ్ట బజారును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ క్రాప్ట్ బజార్ 20వ తేది సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో  శిల్పారామం  ఎక్జిక్యూటివ్  ఇంజనీరు గురుప్రసాద్ గారు, లంకా మనోజ్  సహాయ సంచాలకులు, హ్యాండీ క్రాఫ్ట్స్, ఢిల్లీ ,  పార్థసారధి హెచ్. పి. ఓ., శిల్పారామం  పరిపాలనాధికారి తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.

తిరుపతి

2021-03-19 16:12:07

మత్స్య సామగ్రి కొనుగోలుకు టెండర్లు..

శ్రీకాకుళం జిల్లాలో మత్స్య సామగ్రి కొనుగోలుకు టెండర్లు పిలుస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు జెసి ఒక ప్రకటన విడుదల చేస్తూ మత్స్య శాఖ ద్వారా  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన(PMMSY) క్రింద 2020-21 సంవత్సరానికి వివిధ పధకములు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా చేప పిల్లల సరఫరా, రిజర్వాయరు, సముద్రంలో పంజరాలు (కేజ్) నిర్మాణం, ఇన్సులేటెడ్ వాహనములు సరఫరా, చేపల రవాణాకు ఐస్ బాక్సులతో  సహా మోటారు సైకిల్, సముద్రములో చేపల వేట చేయు ఫైబర్ బోటులు, ఇంజెన్లు, వలల కొనుగోలుకు రూ.11.45 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పరికరాల సరఫరాకు ఈ – పొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలవడం జరుగుతుందని అన్నారు. టెండర్లు ఈ నెల 25వ తేదీ వరకు సమర్పించుటకు గడువు ఉందని జెసి తెలిపారు.

Srikakulam

2021-03-17 18:45:39

ఆప్కో ద్వారా నేత దుప్పట్లను కొనుగోలు..

 ఆప్కో ద్వారా నేత దుప్పట్లను కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టడం జరిగిందని చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు డా. వి. పద్మ తెలిపారు. జిల్లాలో చేనేత కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, కార్యక్రమాలను, ఆప్కో ద్వారా నేత దుప్పట్లను కొనుగోలు చేసే కార్యక్రమంను బుధవారం రాజాం ప్రాంతంలో ఎడి పరిశీలించారు. రాజాంలో శ్రీ మల్లిఖార్జున చేనేత సహకార సంఘం, బొద్దాంలో శ్రీ రామలింగేశ్వర చేనేత సహకార సంఘాల్లో ఆప్కో ద్వారా నేత దుప్పట్లను కొనుగోలు చేయడాన్ని తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2020 సంవత్సరానికి వై.ఎస్.ఆర్.నేతన్న నేస్తం పథకం క్రింద జిల్లాలో 1,775 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.24 వేలు చొప్పున రూ.4.26 కోట్లను చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగిందని ఆమె వివరించారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 209 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున రూ.1.04 కోట్లను ముద్ర రుణాలుగా వివిధ బ్యాంకు శాఖల ద్వారా మంజూరు చేయడం జరిగిందని వివరించారు. జిల్లాలో చేనేత సహకార సంఘాలలో నిల్వ వున్న రూ.50 లక్షల విలువగల నేత దుప్పట్లను ఆప్కో ద్వారా ఈ నెల కొనుగోలు చేయించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. కోవిడ్ 19 లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పొందూరుకు చెందిన శ్రీ సాయిబాబా చేనేత సహకార సంఘంలోని 115 మంది చేనేత కార్మికులకు,  సింగపురం శ్రీ హటకేశ్వర చేనేత సహకార సంఘంలోని 123 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.2 వేలు చొప్పున సికింద్రాబాద్ లో గల దస్తకర్ ఆంధ్ర సంస్థ సహకారముతో రూ.4.76 లక్షలను అందించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి అధికారి వి.శంకర రావు, సహాయ అభివృద్ధి అధికారి ఆర్.శేఖర్ పాల్గొన్నారు.

Srikakulam

2021-03-17 18:09:33

పండ్ల, పూల తోటల పెంపకానికి ప్రాధాన్యత..

2021-22 ఆర్థిక సంవత్సరం లో పండ్ల తోటలు,  పూల  తోటలు  పెంపు తో పాటు గ్రామీణ ప్రాంత్రాలలో అవెన్యూ ప్లాంటేషన్ కు నరేగా నిధులతో  ప్రాధాన్యత కల్పించాలని,  గత అనుభవాలను  దృష్టిలో వుంచుకోని  వంద శాతం  మొక్కలు కాపాడాలని  నరేగా డైరెక్టర్ చినతాతయ్య ఆదేశించారు.   బుధవారం  స్థానిక సి.ఎల్.ఆర్.సి.సమావేశమందిరంలో రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరుజిల్లా   నరేగా అడిషన్ పి డి లు, ఏ పి ఓ లు, ప్లాంట్ సూపర్వైజర్లతో  ఒక్క రోజు  ప్రాంతీయ సదస్సు రాష్ట్ర నరేగా కౌన్సిల్  మెంబర్  విశ్వనాథ్ ,  డిప్యూటీ కమీషనర్ భవాని లతో కలిసి నరేగా డైరెక్టర్  సమీక్ష నిర్వహించారు.  నరేగా డైరెక్టర్ చినతాతయ్య మాట్లాడుతూ జగనన్న పచ్చతోరణం   2020-21  లో ఆశాజనకంగా లేదని,  రానున్న  2021-22  ఆర్థిక  సంవత్సరం లో  పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి  పండ్ల , పూల తోటలు  అభివృద్ది జరగాలని అన్నారు.  గౌ.  రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు , పంచాయతీ రాజ్  శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగారు   అవెన్యూ ప్లాంటేషన్ తో గ్రామాలలో పచ్చదనం పెంచాలని సూచించినా, ఈ  ఆర్థిక సంవత్సరంలో  10 వేల  కి.మీ లు  నిర్దేశించుకున్నా  సగం కూడా పూర్తి కాలేదని, క్షేత్ర స్థాయిలో ఎందుకు  ఇబ్బందులు వున్నాయని తెలిపి, రానున్న  ఆర్థిక సంవత్సరం లక్ష్య సాధన పూర్తి కావాలని అన్నారు.   అవెన్యూ ప్లాంటేషన్  విషయంలో   గ్రామ స్థాయి లో గతంలో సర్పంచులు లేరు, ఇప్పుడు కొత్తగా  ఎన్నుకోబడ్డారని, వారి సహకారంతో పంచాయతీ నిధులు  ద్వారా  మొక్కలు మాత్రం  కొంటె  నరేగా  నుండి, పిట్స్ , వాటర్ ఛార్జీలు అందించడం  జరుగుతుందని, దీనికి  విస్తృత  ప్రచారం కల్పించాలని సూచించారు. నరేగా  క్షేత్ర స్థాయిలో తలెత్తున్న ఇబ్బందులను జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు.        రానున్న  సంవత్సరం లో  రోజా  పూల తోటలపెంపు కు రైతులు దరఖాస్తులు చేసుకోవడానికి  అవకాశం వుందని వివరించారు.  మొక్కలు కనీసం  9 నెలల కాల పరిమితి వుండి , నాణ్యత వుండాలని, రహదారులు విస్తరణ వుందా లేదా  తెలుసుకొని  రహదారుల  వెంబడి మొక్కలు నాటే  విధంగా వుండాలని సూచించారు.  రైతులు పండ్ల తోటల విషయం లో 3 సంవత్సారాల  కాలానికి  కనీసం మొక్కకు  రూ. 400 వరకు వస్తుందని,  కాపాడే విధంగా వుండాలని సూచించారు.   ప్రధానంగా ప్రాంతాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి మొక్కల అవసరం  గుర్తించాలని సూచించారు.  నరేగా రాష్ట్ర  కౌన్సిల్ మెంబర్  ముత్తంశెట్టి విశ్వనాథం మాట్లాడుతూ పని దినాల కల్పన, మెటీరీయల్ కాంపొనెంట్ పనులు, ప్రణాళిక మేరకు చేపట్టాలని  రానున్న ఆర్థిక సంవత్సరం లో పెద్ద ఎత్తున పచ్చదనం చేపట్టాలని సూచించారు.  నర్సరీలు,  అందుబాటులోకి తీసుకురానున్నామని , పేదలందరికి ఇళ్ళు లే ఔట్లలో  మొక్కల పెంపకం పూర్తి చేయాలని సూచించారు.      నరేగా  డిప్యూటీ కమిషనర్  5 జిల్లాల నరేగా అధికారులతో 2020-21  సంబంధించిన  సాధించిన  ప్రగతి పై  పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్   ద్వారా వివరిస్తూ,  నిర్దేశించుకున్న  టార్గెట్ మార్చి 31 కి  పూర్తి చేయాలని సూచించారు.          ఈ వర్క్ షాపు లో   డ్వామ పి. డి. చంద్ర శేఖర్ , అడిషనల్ పి. డి. లు చిత్తూరు  రామాంజనేయులు రెడ్డి, కర్నూలు బాలకృష్ణా రెడ్డి, నెల్లూరు సతీష్ బాబు, అనంతపురం విజయప్రసాద్   , అంబుడ్స్మన్   రాసరయ్య నాయుడు,   ఏ పి డి లు , అమరనాథ్ రెడ్డి , సుబ్రమణ్యం, నందకుమార్ రెడ్డి, ఐదు జిల్లాల   ఏ. పి. ఓ. లు , సూపర్వైజర్లు పాల్గొన్నారు.

Tirupati

2021-03-17 18:01:36

జీడి మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి..

జీడీమామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని జీడి రైతులు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమీషనర్ పి.ఎస్.ప్రద్యుమ్నను కోరారు. జీడిమామిడి పంట, రైతుల సమస్యలు తెలుసుకొనుటకు జిల్లా పర్యటనకు విచ్చేసిన కమీషనర్ బుధ వారం వజ్రపు కొత్తూరు మండలం నీలావతి గ్రామాన్ని సందర్శించారు. జీడి పంట పరిస్ధితిని స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖాముఖి పాల్గొన్నారు. జీడి రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదని, మార్కెట్ లోధర పెరిగినా తగ్గినా ఒకటే ధర చెల్లిస్తున్నారని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్ధానం (టిటిడి) జీడి పప్పును కొనుగోళు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తద్వారా రైతులకు కొంత భరోసా కలుగుతుందని పేర్కొన్నారు. కోల్డు స్టోరేజి ఏర్పాటు చేయాలని కోరారు. జీడి పంటకు ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. జీడి పంటకు సరైన సాగు నీటి సదుపాయం లేదని – బోర్లు తదితర సౌకర్యాలు కల్పించడం వలన మరింత ఉత్పాదకత సాధించుటకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతుల సూచనలకు కమీషనర్ ప్రద్యుమ్న స్పందిస్తూ జీడి మామిడి రైతుల సమస్యలపై ముఖ్య మంత్రికి నివేదిక సమర్పిస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం సహాయం అందించుటకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కోల్డు స్టోరేజి ఏర్పాటుకు తగిన ప్రయత్నం చేస్తామని కమీషనర్ అన్నారు. జీడి రైతులు రైతు ఉత్పాదక సంఘాలు (ఎఫ్.పి.ఓ)గా ఏర్పడి సంఘాలను రిజిస్టర్ చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, మార్కెంటింగు శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కె.శ్రీనివాస రావు, సహాయ సంచాలకులు బి.శ్రీనివాస రావు, కార్యనిర్వాహక ఇంజనీరు జయ శేఖర్, ఉద్యానవన సహాయ సంచాలకులు ఆర్.వి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Vajrapukotturu

2021-03-17 15:03:35