ఘనంగా కొసనా వార్షికోత్సవ వేడుకలు..
Ens Balu
7
విశాఖ సిటీ
2022-02-19 15:20:58
కొసనా కల్చరల్ అకాడమీ 17వ వార్షికోత్సవ వేడుకలు శనివారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ వేడుకల్లో పలువురు కళాభిమానులు, కవులు, రచయితలు, గాయనీ, గాయకులు పాల్గొని కొసనా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిధిగా హాజరు కాగా వ్యవస్థాపక అధ్యక్షురాలు సుసర్ల శేషుమణి, తులసీనగర్ ప్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ డైరెక్టర్ కె.వి.ఎన్.వి. బ్రహ్మాజీ, అకాడమీ ఉపాధ్యక్షులు పి. రాజేంద్రప్రసాద్లు జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరంతా మాట్లాడుతూ కొసనా సాంస్కృతిక రంగంలో సంగీత, నృత్య, నాటక చిత్రలేఖనం, సాహిత్య రంగాల్లో 50 ఏళ్లుపాటు సుదీర్ఘ సేవలందించడం ఎంతో చిరస్మరణీయమన్నారు. వచ్చే ఏడాది నుంచి కొసనా పేరిట కళాపురస్కారాలు అందజేయనున్నట్లు కొసనా తనయుడు బ్ర హ్మాజీ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లలిత సంగీత విభావరి ఆహుతుల్ని అలరించింది. గిన్నీస్ వరల్డ్ రికార్డు హోల్డర్ కోరుకొండ రంగారావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ప్రముఖ గాయనీ గాయకులు శివల రఘురామ్. బి.ఎస్.మాధవి, ఎమ్.వి.ఆర్. నాగేశ్వరరావు, కోరుకొండ రంగారావు, కనదుర్గ, ఎమ్. రూపవాణి. ఎన్. లక్ష్మి, కామేశ్వరి, లీలాకుమారి, కణ్యాకుమారి, కొసనా పాటలతో వీనుల విందు చేశారు. అనంతరం గాయనీ గాయకులకు. నిర్వహాకులకు సన్మానం చేశారు. వ్యవస్థాపక అధ్యక్షురాలు సుసర్ల శేషుమణి మాట్లాడుతూ, ఎంతో మందిని ప్రోత్సహించిన ఘనత కొసనాకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో త్రినాధ్. జగత్లావుతో పాటు అనేక మంది కళాభిమానులు పాల్గొన్నారు.