రీ-సర్వేలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటాం..
Ens Balu
6
Visakhapatnam
2022-03-10 11:21:28
విశాఖ జిల్లాలో చేపట్టిన రీ-సర్వే ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరు కుంటామని, ఆ దిశగా ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 16 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ పూర్తి చేశామని, ఈ వారం లోపు మరొక 10 గ్రామాల్లో ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న భూ రక్ష పథకంలో భాగంగా చేపట్టిన భూముల రీ-సర్వే విధానం అమలు, ఫలితాలపై సీసీఎల్ఎ కమిషనర్ జి. సాయి ప్రసాద్ గురువారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రక్రియను వేగంగా, సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. ఫలితాలు అందరికీ అందాలని, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే విధానం, మ్యుటేషన్ ప్రక్రియ, రెవెన్యూ సంబంధిత పలు అంశాలపై ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున జిల్లాలో తీసుకున్న చర్యల గురించి సీసీఎల్ఏకు వివరించారు. ఇప్పటి వరకు సర్వే పూర్తయిన గ్రామాల్లో నోటిఫికేషన్లు, సంబంధిత పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. మ్యుటేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కారణం తెలపకుండా తిరస్కరించిన మ్యుటేషన్ దరఖాస్తులను పరిశీలిస్తామని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి జిల్లాలో మొత్తం 26 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ పూర్తి చేసి సంబంధిత పత్రాలు అందజేస్తామని వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, కల్పనాకుమారి, డీఆర్వో శ్రీనివాసమూర్తి, సర్వే విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు.