ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని అలా కాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున గ్రామీణ నీటి సరఫరా విభాగ అధికారులను హెచ్చరించారు. ఇప్పటి వరకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవటంలో, అప్పగించిన పనులను చేయటంలో సంబంధిత విభాగం వెనుకబడి ఉందని మందగమనం వీడి అధికారులందరూ సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా జిల్లాలో చేపడుతున్న పనులపై, ఇంటింటికీ కుళాయిల ఏర్పాటులో గ్రామీణ నీటి సరఫరా విభాగం తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలజీవన్ మిషన్, శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఈ నెలాఖరులోగా చేరుకోవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగపు అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయాలని, త్వరితగితన పైప్ లైన్లు, ట్యాప్‌లు ఏర్పాలు చేయాలని సూచించారు. జిల్లాలో 1.24 పనులను గుర్తించగా సుమారు 28వేల పనులనే పూర్తి చేయటం గర్హణీయమని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేసవిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, మార్చి నెలాఖరులోగా సంబంధిత పనులను పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని మండలాల పరిస్థితిని ఆయా డివిజన్ల, మండలాల అధికారుల ద్వారా కలెక్టర్ తెలుసుకున్నారు.
పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ జిల్లాలో ఉన్న ప్రతి సచివాయం పరిధిలో లేదా సమీప ప్రాంతంలో కమ్యునిటీ శానిటరీ కాంప్లెక్సులను నిర్మించాలని చెప్పారు. సచివాలయాల్లో పని చేసే మహిళా సిబ్బందికి ఇబ్బంది లేకుండా నిర్మాణాలను పూర్తి చేసి మరుగుదొడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకోవాలని సూచించారు. శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణానికి సంబంధించిన స్థల సేకరణ, టెండర్ల ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 733 శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయగా ఇప్పటి వరకు 583 చోట్ల గ్రౌండింగ్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన చోట్ల కూడా సంబంధిత పనులను త్వరితగతిన ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. పెదబయలు, ముంచింగుపుట్లు పరిధిలో గతంలో జరిగిన పనులకు సంబంధించి తక్కువ నిధులు మంజూరు అయ్యాయని సంబంధిత మండలాల అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా సర్కిల్ ఆఫీస్ అధికారులను ఆదేశించారు. అలాగే నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలల్లో చేపట్టాల్సిన తాగునీటి వసతి కల్పనకు సంబంధించిన పనులను గుర్తించి అంచనాలను తయారు చేయాలని సూచించారు.
సమావేశంలో డీఈవో చంద్రకళ, ఎస్.ఎస్.ఏ. పీవో, గ్రామీణ నీటి సరఫరా విభాగం సర్కిల్ కార్యాలయం డీఈ సావిత్రి, డివిజన్ లెవెల్ అధికారులు, జేఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.