సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలి..
Ens Balu
3
Visakhapatnam
2022-03-14 09:35:26
ప్రజల నుంచి వచ్చే వినతులకు నిర్ణీత సమయంలో సంతృప్తి కరంగా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున జిల్లా అధికారులను ఆదేశించారు.ఒక సారి అందిన ఫిర్యాదు మళ్లీ తిరిగి రాకుండా చర్యలు తీసుకోవాలని, జాగ్రత్త వహించాలని సూచించారు. నిర్ణీత కాలంలో ఫిర్యాదులకు చక్కని పరిష్కారం చూపాలని, కింది స్థాయి అధికారి ఇచ్చిన రిప్లై సమాధానాన్ని ఉన్నతాధికారి క్షుణ్ణంగా పరిశీలించాలని పేర్కొన్నారు. వినతుల పరిష్కారంలో అధికారులు శ్రద్ధ వహించాలని చెప్పారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ముందుగా పాత ఫిర్యాదుల స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. వచ్చిన ఫిర్యాదులే మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నాయనే అంశంలో అధికారులంతా పునఃపరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. రీ ఓపెన్ పిటిషన్లకు, ఎస్.ఎల్.ఏ. పరిధి దాటిన దరఖాస్తులకు సంబంధించి కారణాలు తెలపాలని కోరుతూ సంబంధిత అధికారులకు లేఖలు రాయాలని డీఆర్వో శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, అరుణ్ బాబు, కల్పనా కుమారి, డీఆర్వో శ్రీనివాసమూర్తి, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.