ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి..


Ens Balu
3
Vizianagaram
2022-03-19 10:01:21

స్టాండ్ అప్ ఇండియా పధకంలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చేందుకు ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) వెంకటరావు తెలిపారు.  శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఇ.పి.సి) సమావేశాన్ని నిర్వహించారు.   ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఎస్.సి., ఎస్.టి. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు స్టాండ్ అప్ ఇండియా పధకాన్ని ప్రవేశపెట్టిందని, అన్ని బ్యాంకులలో రుణ సౌకర్యం కల్పించాల్సివుంటుందన్నారు.  పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు మండల స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.   ప్రభుత్వ మార్గదర్శకాలకు సంబంధించిన పూర్తి వివరాలను సర్క్యులర్ తయారుచేసి అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రదర్శించడం ద్వారా ఈ పధకం విజయవంతం అవుతుందన్నారు.  జిల్లాలో వివిధ పరిశ్రమల అభివృద్దికి సంబంధించి అధికారులతో చర్చించారు.  క్రిందటి నెలలో నిర్వహించిన డి.ఐ.ఇ.పి.సి సమావేశంలో చేపట్టిన అంశాలపై సమీక్షించారు.  భూగర్భ జలాలను వినియోగించే పరిశ్రమల వారు ఈనెలాఖరులోగా భూగర్భ జల శాఖ నుండి నిరభ్యంతర పత్రాలను (ఎన్.ఓ.సి) తప్పనిసరిగా పొందాలన్నారు.  లేని పక్షంలో సంబంధిత పరిశ్రమల యాజమాన్యంపై చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.  పరిశ్రమల నుండి వెలువడే వాయు, నీటి, శబ్ద కాలుష్యాలకు సంబంధించి కాలుష్య నియంత్రణ శాఖ ద్వారా వున్న నియమనిబంధనలను కచ్చితంగా అమలు పర్చాలన్నారు.   పరిశ్రమల నిర్వహణకు అవసరమైన నీటి సరఫరాకు సంబంధించి ఇరిగేషన్, మున్సిపల్, ఎపిఐఐసి లనుండి నిబంధనలకు అనుకూలంగా తీసుకోవల్సివుంటుందన్నారు.  జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెలలో సింగిల్ డస్క్   పోర్టల్ (ఎస్.డి.పి)లో  54 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 35 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు.  మిగిలినవి పరిశీలనలో వున్నాయని తెలిపారు.  ఈ సమావేశంలో డిఐఇపిసి కమిటీ మెంబర్లు ఎల్.డి.ఎం, ఎపిఐఐసి, ఎం.ఎస్.ఎం.ఇ., కాలుష్యనియంత్రణ, ఫ్యాక్టరీలు, పంచాయితీరాజ్, ఇరిగేషన్, అగ్నిమాపక, మున్సిపల్, విఎంఆర్డిఎ, కార్మిక తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు.