ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలను 181 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు తెలిపారు. ఈ మేరకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పరీక్షల నిర్వహణ ప్రక్రియ ఇక్కడి నుంచే జరుగుతుందని స్పష్టం చేశారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో అనుసరించాల్సిన విధి విధానాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. రెగ్యులర్, సార్వత్రిక విద్యాపీఠం నుంచి మొత్తం 29,567 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మారుమూల కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సదుపాయం, వైద్య సదుపాయాలు కల్పించాలని చెప్పారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని సబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు. పోలీసు, రెవెన్యూ శాఖల వారు సమన్వయంతో వ్యవహరించి 144 సెక్షన్ ను పటిష్టింగా అమలు చేయటం ద్వారా శాంతియుతమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పరీక్షల సమయంలో ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు విద్యార్థులు తప్పకుండా బస్ పాస్‌లు తీసుకురావాలని డీఆర్వో స్పష్టం చేశారు.
విజయనగరం, పార్వతీపురం డీఈవోలు జయ శ్రీ, రమణ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై సూచనలు చేశారు. జిల్లాలో మొత్తం 181 కేంద్రాల్లో ఈ నెల 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రెగ్యులర్ వారు 29,561 మంది ప్రయివేటు వారు ఆరుగురు మొత్తం 29,567 మంది పరీక్షలకు హాజరవుతున్నారని వివరించారు. రెగ్యులర్ వారికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ప్రయివేటు వారికి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఓపెన్ ఇంటర్మీడియట్ వారికి మే 7 నుంచి 21వ తేదీ వరకు ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు థియరీ పరీక్షలు జరుగుతాయన్నారు. మే 24 నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్ విద్యార్థులు ప్రాక్టికల్స్ ఉంటాయని వివరించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి సాంకేతిక పరికరాలు తీసుకురాకూడాదని స్పష్టం చేశారు.
సమావేశంలో డీఆర్వో ఎం. గణపతిరావుతో పాటు విజయనగరం డీఈవో ఎం. జయ శ్రీ, పార్వతీపురం డీఈవో ఎస్.డి.వి. రమణ, పరీక్షల నిర్వహణ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మి, ఆర్టీసీ, పోస్టల్, విద్యుత్, రెవెన్యూ, ఇంటర్మీడియట్ బోర్డు, వైద్యారోగ్య తదితర శాఖల నుంచి జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.