ఆ వాలంటీరును విధుల నుంచి తొలగించండి..
Ens Balu
7
విజయనగరం టౌన్
2022-04-06 12:04:04
విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించిన వార్డు వలంటీర్‌ను తొలగించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలోని 34 వ సచివాలయాన్ని, కానుకుర్తివారి వీధికి చెందిన 10 వ నెంబరు సచివాలయాన్నిజిల్లా కలెక్టర్ సూర్యకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది, వలంటీర్ల హాజరు పట్టికను పరిశీలించారు. 34 వ సచివాలయం పరిధిలోని 16వ క్లష్టర్ వలంటీర్ కు కేవలం 33 శాతం హాజరు మాత్రమే ఉండటంపై మండిపడ్డారు. వెంటనే ఆ వలంటీర్‌ను తొలగించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే, ఎవరినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జగనన్న ఇళ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఈ నెలాఖరునాటికి మంజూరైన అన్ని ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని, ముందుకురాని లబ్దిదారుల ఇళ్లను రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటిఎస్ పథకంపై సిబ్బందిని ప్రశ్నించారు. రిజిష్ట్రేషన్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పిల్లలకు, గర్భిణిలకు రక్త పరీక్షల నిర్వహణపై ఆరా తీశారు. హెమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉన్నవారిపై ప్రత్యేక దృష్టిపెట్టి, పోషకాహారాన్ని అందించాలని సూచించారు. ముఖ్యంగా నెలనెలా పంపిణీ చేస్తున్నరేషన్ బియ్యాన్ని వినియోగించడం ద్వారా, రక్తహీనతనుంచి బయటపడవచ్చని అన్నారు. పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మెనూను తరచూ తనిఖీ చేయాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.