రాష్ట్రంలోనే తొలి భూగర్భ విద్యుత్ సరఫరా ఒంగోలులోనే..


Ens Balu
8
Ongole
2022-04-06 12:10:22

ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి  బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనే ప్రథమంగా ఒంగోలు నగరంలో రూ.56.74 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్ సర్క్యూట్ భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థను బుధవారం ఆయన ప్రారంభించారు. ఇదే సందర్భంగా మరో రూ.23.79 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భూగర్భ కేబుల్ విద్యుత్ లైన్ల నిర్మాణానికి కూడా వీరు శంకుస్థాపన చేశారు.  అనంతరం మంగమూరు రోడ్డులో ప్రత్యేక పైలాన్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భూగర్భ విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఒంగోలు ప్రజల కల నేడు నెరవేరిందని అన్నారు. హైటెన్షన్ విద్యుత్ తీగల కారణంగా గతంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం ఇళ్ల పైనుంచి వెళ్తున్న ఈ హైటెన్షన్ వైర్లను  త్వరలోనే తొలగించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని  మంత్రి ఆదేశించారు. ఈ చర్య ద్వారా 33, 34, 35, 36 డివిజన్లలోని ప్రజలకు ఇబ్బందులు తొలగాయని అన్నారు.  నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, ఈనెల 15వ తేదీ నుంచి ప్రతి ఇంటికీ తిరుగుతామని మంత్రి చెప్పారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఒంగోలు నగర ప్రజల ఇబ్బందులను తొలగించేలా పోతురాజు కాలువను ఆధునీకరిస్తున్నామన్నారు. ఈ పనుల్లో ఇప్పటికే 25 శాతం పూర్తి అయ్యాయని చెప్పారు. మిగిలిన పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఒంగోలు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.409 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని, వీటికి సంబంధించిన టెండర్లను త్వరలోనే ఇస్తామని చెప్పారు.

 ప్రతిరోజు పగటివేళ తాగునీరు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలోని అన్ని ప్రధాన రోడ్లలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రూ.180 కోట్లతో రిమ్స్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తీసుకొస్తున్నట్లు చెప్పారు. కొత్తపట్నంలో రూ.400 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయబోతున్నామని, వీటికి సంబంధించిన టెండర్ల  ప్రక్రియను పూర్తి చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని, గ్రోత్ సెంటరులో సుమారు 700 మందికి ఉద్యోగాలు కల్పించేలా సాఫ్ట్ వేర్ కంపెనీ త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నానన్నారు. సంక్షేమం తో పాటు అభివృద్ధికి కూడా సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఒంగోలులో 24వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోగా, కోర్టు కేసుల వల్ల జాప్యం జరిగిందని, వీటిని పరిష్కరించి పేదలకు త్వరలోనే పట్టాలు ఇచ్చి, ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో గుడిసె లేకుండా అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. హైటెన్షన్ విద్యుత్ తీగల ముప్పు తొలగిన స్థానికులు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 

 కర్నూలు రోడ్డులో ఉన్న ట్రాన్స్ కో ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ జె.వి.మురళి, ట్రాన్స్ కో  జె.ఎం.డి. మల్లారెడ్డి, ఎస్.ఈ. రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.  నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, మాధవ రావు, ట్రాన్స్ కో ఎస్.ఈ. రామచంద్రారెడ్డి, ఓడీఈ శ్రీనివాసరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, మున్సిపల్ ఇంజినీర్ సుందరరామిరెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.   దీనికి ముందుగా కొప్పోలు ఫ్లై ఓవర్ నుంచి కర్నూల్ రోడ్డు వరకూ ద్విచక్రవాహనాలతో స్థానికులు ర్యాలీ నిర్వహించి మంత్రికి ఘన స్వాగతం పలికారు. కేసవరాజు కుంట, బాలినేని భరత్ కాలనీ, గోపాల నగర్, గోపాల్ నగర్ మినీ బైపాస్ రోడ్డు లో రూ.2.04 కోట్ల విలువైన రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నెహ్రూ నగర్ పార్కును ప్రారంభించారు.