ముగిసిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీ యాగం
Ens Balu
5
Tirupati
2022-04-06 12:14:23
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస మహా ధన్వంతరీయాగం బుధవారం ఉదయం మహా పూర్ణాహూతితో శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా టిటిడి వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ శ్రీవారి అనుగ్రహంతో శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ప్రపంచంలోని ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని మూడు రోజుల పాటు టిటిడి యాగం నిర్వహించినట్లు తెలిపారు. రుత్వికులు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఏడు హోమగుండాలలో హోమాలు, మంత్ర పారాయణం నిర్వహించినట్లు చెప్పారు. చివరిగా మంత్ర శక్తితో నిండిన కలశాల్లోని జలంతో శ్రీ ధన్వంతరీ, శ్రీ సుదర్శన భగవానులకు అభిషేకం చేయడం వలన లోకం అంత సుభిక్షంగా ఉంటుందని వివరించారు. యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, శ్రీ ధన్వంతరీ, శ్రీ సుదర్శన భగవానుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. ఇందులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విక్‌వరణం, అగ్నిస్థాపన, కుంభరాధన, కుంభ నివేదన, విశేష హోమాలు, మహా పూర్ణాహూతి నిర్వహించారు. అనంతరం శ్రీ ధన్వంతరీ, శ్రీ సుదర్శన భగవానులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కలశాల్లోని మంత్ర జలంతో విశేషంగా అభిషేకం చేశారు. టిటిడి వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు ఆధ్వర్యంలో 12 మంది ప్రముఖ రుత్వికులు మూడు రోజుల పాటు ఈ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రటరీ సత్యనారాయణ, పాల్గొన్నారు. ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, తిరుమల విజివో బాలిరెడ్డి, ఎవిఎస్వో గిరిధర్, వేద పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.