సత్వరమే నష్టపరిహారం అందించాలి..


Ens Balu
4
Kakinada
2022-04-08 06:44:55

ఓఎన్జీసీ పైపు లైన్ల పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు త్వరితగతిన పరిహారం అందించేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో మత్స్య శాఖ, ఓఎన్జీసీ, తాళ్లరేవు మండల రెవెన్యూ అధికారులతో కలెక్టర్ కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఇలాక్కియా‌తో కలిసి మత్స్యకారులకు పరిహారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా పరిధిలోని తాళ్లరేవు మండలానికి సంబంధించి ఓఎన్జీసీ పైపు లైన్లు పనుల వలన జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులకు నష్ట పరిహారం ఇచ్చే విధంగా అధికారులు చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఇందుకు ఓఎన్జీసీ, మత్స్య, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తాళ్ళరేవు మండలం పరిధిలో మత్స్యకారులు, ఒంటరి మహిళలు మొత్తం 7,050 మంది లబ్ధిదారులు ఉన్నారని, మత్స్యకారుల జాబితా సిద్దంగా ఉన్నందున సొమ్ము జమ అయ్యేవిధంగా చూడాలని కలెక్టర్ కృతికా శుక్లా ఓఎన్జీసీ అధికారులను ఆదేశించారు. పైపులైన్ల పనులు ఇతర వివరాలు ఓఎన్జీసీ అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ కు వివరించారు. సమావేశంలో  జిల్లా మత్స్యశాఖ అధికారి పి.వి.సత్యనారాయణ, ఓఎన్జీసీ జీఎం (హెచ్.ఆర్) డి.మల్లిక్, ఓఎన్జీసీ ప్రతినిధి రవి, తాళ్ళరేవు తహసీల్దార్ ప్రసాద్ రావు, ఎంపీడీవో పీవీ.థామస్, మత్స్య శాఖ ఏడీ కె.కరుణాకర్, ఎఫ్.డీ.వో జీ.గోపి తదితరులు పాల్గొన్నారు.