స్పందనపై ప్రజలకు నమ్మకం పెంచాలి..


Ens Balu
6
Paderu
2022-04-08 10:50:23

స్పందనపై ప్రజలకు నమ్మకం పెరిగేలా అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఐటిడి ఏ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ జి. ఎస్. ధనుంజయ్, ఐటిడిఏ పి. ఓ రోణంకి గోపాల క్రిష్ణ, ఎస్.పి.సతీష్ కుమార్, సబ్ కలెక్టర్ వి.అభిషేక్ తో మొట్టమొదటి సారిగా స్పందనలో గిరిజనుల నుండి శుక్రవారం 147 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ స్పందన కార్యక్రమంలో తప్పని సరిగా పాల్గొనాలని సూచించారు. స్పందనలో ఉపాధి, ఉద్యోగాఅవకాశాలు, తాగునీరు ,రహదారి సమస్యలపై ఎక్కవగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. జిల్లా అధికారులు స్వయంగా గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆర్దికేతర సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలని చెప్పారు.
స్పందనలో కొన్ని ఫిర్యాదులు డుంబ్రిగుడ మండలం రంగిలిసింగి గ్రామానికి చెందిన వంతాల లక్ష్మి జగనన్న తోడుపథకాన్ని మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. హుకుంపేట మండలం సంతారి పంచాయతీ పత్తిరి మెట్ట,బిల్లాయిపుట్టు గ్రామస్తులు జి.చంద్రరావు, పాడి త్రినాధరావు తదితర 15 మంది రైతులు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఆదివాసీ మహా సభ అధ్యక్షులు కొర్రా అప్పారావు పెదకోడాపల్లి పంచాయతీ మలకరిపుట్టు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేసారు. ముంచింగ్ పుట్టు మండలం లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ కొర్రా త్రినాధ్ కర్లాపొదార్ గెడ్డపై వంతెన నిర్మించాలని, కిముడుపల్లి, కర్లాపొదార్ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. పాడేరు మండలం దేవాపురం ఎంపిటిసి ఎం.నాగమణి దేవాపురం పంచాయతీలోనిఅంటిలోవ-దేవాపురం,డప్పాడ-జరిగరువు, గదుబూరు - కుమ్మరిపుట్టు గ్రామాల మట్టి రోడ్డు పనులు పూర్తి చేయాలని వినతిపత్రం అందజేసారు. బాషా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని,బకాయి వేతనాలు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. అప్పనర్స నేతృత్వంలో బాషా వాలంటీర్లు వినతిపత్రం సమర్పించారు. హుకుంపేట మండలం తడిగిరి గ్రామ సర్పంచ్ పి రంజిత్ కుమార్ తడిగిరి గ్రామం పరిధిలో 1650 గ్రామాల వ్యవసాయ భూమి ఉందని సాగునీటి సదుపాయం కల్పించాలని, ఆర్ ఓ ఎఫ్ పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ బి. దయానిధి, డి ఎఫ్ ఓ వినోద్‌కుమార్, గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు సి ఎ మణి కుమార్, ఇ ఇ డి వి ఆర్ ఎం రాజు, పంచాయతీరాజ్ పి ఐ యు ఇ ఇ కె.శ్రీనివాసరావు, పి ఆర్ ఇ ఇ కె.లావణ్య కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇ ఇ జవహార్ కుమార్, డి ఎల్ పి ఓ పి ఎస్ కుమార్ వెలుగు ఎపిడి మురళి, అదనపు జిల్లా వైద్యాధికారి డా. లీలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.