కాకినాడ వసతి దేవెనకు రూ.44.67 కోట్లు
Ens Balu
7
Kakinada
2022-04-08 11:05:58
కాకినాడ జిల్లాలో 2021-22 సంవత్సరానికి సంబంధించి జగనన్న వసతి దీవెన కార్యక్రమం రెండో విడతలో 46,828 మంది విద్యార్థులకు రూ. 44.67 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాలలో జగనన్న వసతి దీవెన పథకం రెండో విడత లబ్ధి మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో నేరుగా జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జెడ్‌పీ ఛైర్‌పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంకర శివ ప్రసన్న, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి తదితరులు హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కలెక్టర్.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జగనన్న వసతి దీవెన లబ్ధికి సంబంధించిన మెగా చెక్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక సమస్యలు విద్యార్థుల ఉన్నత చదువులకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను అమలుచేస్తోందన్నారు. జగనన్న వసతి దీవెన ద్వారా ఏటా రెండు విడతల్లో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేలు; డిగ్రీ, ఆపై కోర్సుల విద్యార్థులకు రూ. 20 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని, బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా.. విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జె.రంగలక్ష్మీదేవి, బీసీ సంక్షేమ అధికారి కె.మయూరి తదితరులు హాజరయ్యారు.