పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు..
Ens Balu
10
Srikakulam
2022-04-08 11:47:44
శ్రీకాకుళం జిల్లాలో పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 27 నుండి మే 9వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ -19 దృష్ట్యా మార్గదర్శకాలను అనుసరించి అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లావ్యాప్తంగా 36,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఇందులో 18,455 మంది బాలురు, 17,668 మంది బాలికలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం 09.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.45గం.ల వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు 248 కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని, వేసవి దృష్ట్యా తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని, పరీక్ష ప్రశ్నపత్రాలు భద్రత, పంపిణీ పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులతో వైద్య బృందాలను ఏర్పాటుచేయాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను మరియు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారికి ఆదేశించారు. పరీక్ష సమాధాన పత్రాలు ఎప్పటి కప్పుడు స్పీడ్ పోస్టులో పంపించేలా తపాలా శాఖాధికారులు చర్యలు చేపట్టాలని, పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరి, తిరిగి పరీక్షల అనంతరం వారి ప్రాంతాలకు చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేయాలని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి జెరాక్స్,నెట్ సెంటర్లు తెరచి ఉండరాదని, పరీక్షా కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికారాలు అనుమతించ రాదని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతీ అధికారికి అప్పగించిన భాద్యతలను సక్రమంగా నెరవేరుస్తూ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ సహాయ కమీషనర్ అలీ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, జిల్లాపరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, ఉప రవాణా కమీషనర్ డా.వడ్డి సుందర్, ఆర్.టి.సి ప్రజా సంబంధాల అధికారి బి.ఎల్.పి.రావు, పోలీస్, ఖజానా, తపాలా,ఏ.పి.ఈ.పి. డి.సి.ఎల్ శాఖల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.