ఓటిఎస్ పై ప్రత్యేకంగా ద్రుష్టిసారించాలి..


Ens Balu
1
Kakinada
2022-04-08 12:18:32

కాకినాడ జిల్లాలో న‌వ‌ర‌త్నాలు పేద‌లంద‌రికీ ఇళ్లు, సంపూర్ణ గృహ హక్కు (ఓటీఎస్) పథకాలపై దృష్టిసారించి ల‌బ్ధిదారుల‌కు మేలు జ‌రిగేలా ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్ నుంచి క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ.ఎస్‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్ విధానంలో ఆర్‌డీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, మండ‌ల ప్ర‌త్యేక అధికారులు, త‌హ‌సీల్దార్లు, ఎంపీడీవోల‌తో హౌసింగ్, సంపూర్ణ గృహ హక్కు, ఇత‌ర ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాల‌పై తొలిసారిగా స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పురోగ‌తి వివ‌రాల‌ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రధానంగా ఓటీఎస్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్, స్కానింగ్, ఈ-సైనింగ్ అంశాలపై దృష్టిసారించాల‌న్నారు. ఇందుకు గ్రామ/వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్, ఇతర సిబ్బందితో మండల స్థాయి అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో టెక్నికల్ సమస్యలు ఉంటే వెంటనే  జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో వైఎస్సార్ జగనన్న కాలనీలలో వివిధ దశలో ఉన్న గృహ నిర్మాణాల పురోగతిపై శ్రద్ధ వహించి స్టేజ్ అప్‌డేష‌న్‌పై దృష్టిసారించాల‌న్నారు. హౌసింగ్ లబ్ధిదారులకు అవగాహన కల్పించి వర్షాలు పడకముందే గృహాలు నిర్మించుకునేవిధంగా చూడాల‌న్నారు. గ్రామ/వార్డు సచివాలయాలలో స్పందన అర్జీలు, ఇతర సేవ‌ల‌ను సకాలంలో పరిష్కారించాలన్నారు. జగనన్న విద్యాదీవెన‌, జ‌గ‌న‌న్న తోడు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి సకాలంలో ఎక్నాలిజిమెంట్ ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స‌మావేశంలో డీఆర్‌వో కె.శ్రీధర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, హౌసింగ్ పీడీ బి.సుధాక‌ర్ పట్నాయక్, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, ఈఈ బీవీ సత్యనారాయణ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.